మీకెంత ధైర్యం..?

ABN , First Publish Date - 2021-12-26T05:43:16+05:30 IST

అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా భూ ఆక్రమణలు చేయడమే కాదు.. ఆక్రమణలు తొలగించేందుకు వచ్చిన కార్పొరేషన ఎక్స్‌కవేటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. మీకెంత ధైర్యం..?

మీకెంత ధైర్యం..?
రియల్టర్‌ స్వాధీనం చేసుకున్న కార్పొరేషనకు సంబంధించిన ఎక్స్‌కవేటర్‌ ఇదే

మా లేఔట్లే కూల్చేస్తారా..

కార్పొరేషన ఎక్స్‌కవేటర్‌ని స్వాధీనం చేసుకున్న ఓ రియల్టర్‌ 

మూడు రోజులకు అప్పగించిన వైనం

ఆయనకు అధికార పార్టీ అండదండలు

కడప, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా భూ ఆక్రమణలు చేయడమే కాదు.. ఆక్రమణలు తొలగించేందుకు వచ్చిన కార్పొరేషన ఎక్స్‌కవేటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. మీకెంత ధైర్యం..? మా లే ఔట్లనే కూల్చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగే దొంగ అని అరిసిన చందంగా జరిగిన ఈ వ్యవహారం కడప కార్పొరేషనలో కలకలం రేపింది. ఆయన అధికార పార్టీ ముఖ్య నేత బంధువు కావడంతో అధికారులు ఏమనలేక మిన్నుకుండిపోయినట్లు తెలుస్తోంది. 

కడప కార్పొరేషన పరిధిలో విచ్చలవిడిగా అనుమతుల్లేని లేఔట్లు వెలుస్తున్నాయి. అడ్డగోలుగా నిర్మాణాలు సాగిస్తున్నారు. దీంతో సరైన పార్కింగ్‌, రహదారులు లేక అక్కడ కొనుగోలు దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనధికారిక లేఔట్లపై కొరడా ఝులిపించాలని కార్పొరేషన నిర్ణయించింది. ఇందులో భాగంగానే 102 అనుమతులు లేని లేఔట్లలో రిజిస్ర్టేషన్లు నిలిపివేసింది. కొన్ని అక్రమ లేఔట్లను కూలగొట్టారు. రామరాజుపల్లెలో కూడా అనుమతిలేని లేఔట్లు వెలిసాయి. వాటిని కూడా రిజిస్ర్టేషన నిలిపివేశారు. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు రామరాజుపల్లె ప్రాంతం, అహ్మద్‌నగర్‌, మసీదు వీధి చెరువులను తలపించాయి. ఆక్రమణలే ఇందుకు కారణమని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. నీరు వెళ్లే కాలువలను ఆక్రమించిన కారణంగా ఈ పరిస్థితి నెలకొందంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఇక్కడ పంట కాలువలు ఆక్రమించి వెంచర్‌ వేసినట్లు అధికారులు గుర్తించారు. ఆక్రమణల తొలగింపు కోసం అధికారులు మార్కింగ్‌ కూడా ఇచ్చారు. నాలుగు రోజుల క్రితం ఎక్స్‌కవేటర్‌తో ఆ వెంచర్‌లోని మార్కింగ్‌ ఇచ్చిన చోట ఆక్రమణలు తొలగించడం మొదలెట్టారు. విషయం తెలుసుకున్న రియల్టర్‌ అధికార పార్టీ నేత బంధువు కావడంతో ఆయనకు ఆగ్రహం పెల్లుబికింది. ‘‘మీకెంత ధైర్యం.. మా లేఔట్లనే తొలగిస్తారా’’ అంటూ ఎక్స్‌కవేటర్‌ను స్వాధీనం చేసుకొని మూడు రోజుల పాటు వెంచర్‌లోనే ఉంచుకున్నట్లు సమాచారం. అధికారులు ప్రాధేయపడ్డంతో చివరకు కనికరించి ఎక్స్‌కవేటర్‌ను పంపించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం కార్పొరేషన అధికారుల్లో కలకలం రేపుతోంది. ఆక్రమణలు తొలగిస్తే వాహనాలే స్వాధీనం చేసుకుంటారా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అఽధికార పార్టీ నేతలా మజాకా అంటూ కొందరు అధికారులు గొణుక్కుంటున్నారు. ఇలా అయితే కడప నగరం బాగుపడేది కష్టమని, కలెక్టర్‌ ఈ వ్యవహారంపై దృష్టి సారించాలని వారు కోరుతున్నారు.

Updated Date - 2021-12-26T05:43:16+05:30 IST