ప్రకృతి వైపరీత్యానికి ప్రభుత్వ నిర్లక్ష్యం తోడైంది

ABN , First Publish Date - 2021-11-22T05:22:20+05:30 IST

ప్రకృతి వైపరీత్యమైన అతివృష్టికి ప్రభుత్వ నిర్లక్ష్యం, వైఫల్యం తోడుకావడంతో జిల్లాలో చెయ్యేరు తీర గ్రామాలకు శాపంగా పరిణమించిందని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి ఆవేదన వెలిబుచ్చారు.

ప్రకృతి వైపరీత్యానికి ప్రభుత్వ నిర్లక్ష్యం తోడైంది

పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి 

 

వేంపల్లె, నవంబరు 21: ప్రకృతి వైపరీత్యమైన అతివృష్టికి ప్రభుత్వ నిర్లక్ష్యం, వైఫల్యం తోడుకావడంతో జిల్లాలో చెయ్యేరు తీర గ్రామాలకు శాపంగా పరిణమించిందని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి ఆవేదన వెలిబుచ్చారు. వేంపల్లెలో ఆయన మాట్లాడుతూ గత ఏడాది అధికారుల నిర్లక్ష్యం, నిర్వహణా లోపం వల్ల పింఛా, అన్నమయ్య ప్రాజెక్టులు తెగిపోయాయన్నారు. వీటికి శాశ్వత మరమ్మతులు చేసి ఉంటే ప్రస్తుత వరద ప్రమాదం జరిగి ఉండేది కాదన్నారు. అన్నమయ్య ప్రాజెక్టుకు 5 గేట్లు ఉండగా ఒక గేటు పనిచేయడం లేదు, మరోగేటు ఎత్తలేదు, మూడు గేట్లు మాత్రమే తెరిచారు. దీంతో అధిక నీటి ప్రవాహానికి డ్యాం కొట్టుకుపోయిందన్నారు. ప్రజలను అప్రమత్తం చేసి పునరావాస కేంద్రాలకు తరలించడంలో, ముందస్తు సమాచారం ఇవ్వడంలో పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. పర్యవసానంగా కనీవినీ ఎరుగని నష్టం జరిగిందన్నారు. వరదబాధిత కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన రూ.2వేలు  ఏమాత్రం సరిపోదన్నారు. పంటల బీమా, పంట నష్టపరిహారం రైతులకు వీలైనంత త్వరగా అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌ శ్రేణులు వరదబాధితులకు చేతనైన సహాయం చేసి ఆదుకోవాలని తులసిరెడ్డి పిలుపునిచ్చారు. 

Updated Date - 2021-11-22T05:22:20+05:30 IST