అగ్రిగోల్డ్ చెల్లింపుల్లో మోసం
ABN , First Publish Date - 2021-08-26T04:52:23+05:30 IST
వైసీపీ ప్రభుత్వం కొత్తకొత్త నిబంధనలతో అగ్రిగోల్డ్ చెల్లింపుల్లో బాధితులను మోసం చేస్తోందని టీడీపీ కడప పార్లమెంట్ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి ధ్వజమెత్తారు.

టీడీపీ కడప పార్లమెంట్ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి
ప్రొద్దుటూరు క్రైం, ఆగస్టు 25 : వైసీపీ ప్రభుత్వం కొత్తకొత్త నిబంధనలతో అగ్రిగోల్డ్ చెల్లింపుల్లో బాధితులను మోసం చేస్తోందని టీడీపీ కడప పార్లమెంట్ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం ఆయన తన కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితులు దేశంలో 8 రాష్ట్రాల్లో 32 లక్షల మంది ఉండగా, ఒక్క ఏపీలోనే 19 లక్షల మంది ఉన్నారన్నారు. వీరిలో కేవలం 4లక్షల మందికి మాత్రమే ప్రభుత్వం చెల్లింపులు చేసిందన్నారు. అంతేగాకుండా అగ్రిగోల్డ్ బాధితులు ఆన్‌లైన్ చేసేందుకు గడువు పెంచక పోవడంతో చాలా మంది నష్టపోయారన్నారు. ఇక అగ్రిగోల్డ్ బాధితుల్లో చాలా మంది చనిపోగా, వారి కుటుంబ సభ్యులకు లీగల్ ఎయిడ్ సర్టిఫికెట్ ద్వారా చెల్లింపులు చేయకుండా, కోర్టు ద్వారా సక్ససన్ సర్టిఫికెట్ తేస్తేనే చెల్లిస్తామని చెప్పడం దగా చేయడమే అవుతుందన్నారు. అంతేగాకుండా అగ్రిగోల్డ్ డిపాజిట్టుకు సంబంధించి ఒరిజినల్ సర్టిఫికెట్ ఉంటేనే చెల్లింపులు చేస్తామని చెప్పడం దారుణమన్నారు. కాగా టీడీపీ ప్రభుత్వ హాయాంలో సీఎంగా చంద్రబాబునాయుడు అగ్రిగోల్డ్ బాధితులకు పూర్తి న్యాయం జరిగేలా చర్యలు చేపట్టారన్నారు. రూ.10వేలలోపు డిపాజిట్టు కట్టిన వారి కోసం రూ.365 కోట్లతో కార్ఫస్ ఫండ్‌ను ఏర్పాటు చేసి, చెల్లింపులు చేసేందుకు సిద్దంగా కాగా, అప్పట్లో వైసీపీ వారు ఎన్నికల కోడ్ పేరిట చెల్లింపులు జరుగకుండా అడ్డుపడ్డారని గుర్తు చేశారు. సమావేశంలో టీడీపీ నాయకులు సానా విజయభాస్కర్‌రెడ్డి, సీతారామిరెడ్డి సుబ్బరాజు తదితరులు వున్నారు.