వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాల్లో నలుగురి మృతి

ABN , First Publish Date - 2021-08-11T05:12:28+05:30 IST

పోట్లదుర్తి పెన్నా బ్రిడ్జి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పోట్లదుర్తికి చెందిన తండ్రీకొడుకు దుర్మరణం చెందారు.

వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాల్లో నలుగురి మృతి
టిప్పర్‌ కింద పడి మృతి చెందిన తండ్రీ కొడుకులు

ఎర్రగుంట్లలో తండ్రీకొడుకు 

రాజంపేట, బద్వేలులో ఒక్కొక్కరు...

జిల్లాలో వేర్వేరుచోట్ల మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. ఎర్రగుంట్లలోని పోట్లదుర్తి పెన్నాబ్రిడ్జి వద్ద టిప్పర్‌ ఢీకొని తండ్రీకొడుకు మృతి చెందారు. రాజంపేట వద్ద జరిగిన ప్రమాదంలో ఒకరు, బద్వేలులోని కుమ్మరకొట్టాలు వద్ద జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.

ఎర్రగుంట్ల / రాజంపేట టౌన్‌/ బద్వేలు రూరల్‌, ఆగస్టు 10: పోట్లదుర్తి పెన్నా బ్రిడ్జి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పోట్లదుర్తికి చెందిన తండ్రీకొడుకు దుర్మరణం చెందారు. పోట్లదుర్తికి చెందిన ఎర్రి మల్లికార్జునరెడ్డి(55), సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఆయన కుమారుడు ఎర్రి మనోహర్‌రెడ్డి(27) మంగళవారం సాయంత్రం 5.40గంటల ప్రాంతంలో ప్రొద్దుటూరుకు బైక్‌లో బయలుదేరారు. పెన్నాబ్రిడ్జి డౌన్‌లో ముందువైపున వెళుతున్న టిప్పర్‌ సడన్‌గా బ్రేక్‌ వేయడంతో బైక్‌ కూడా బ్రేక్‌ వేశారు. అయితే వేగంగా వెనుకవైపు వస్తున్న మరో టిప్పర్‌ బైక్‌ను ఢీ కొట్టింది. దీంతో బైక్‌తో సహా తండ్రీకొడుకులు టిప్పర్‌కింద ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న బంధువులు, పోట్లదుర్తి వాసులు భారీగా  తరలివచ్చి మృతదేహాల వద్ద బోరుబోరున విలపించారు. ఎర్రగుంట్ల ఎస్‌ఐ వెంకటక్రిష్ణయ్య టిప్పర్లను తొలగించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. 

పోట్లదుర్తిలో విషాదఛాయలు

పోట్లదుర్తికి చెందిన మల్లికార్జునరెడ్డి భార్య క్యాన్సర్‌తో మృతిచెందగా అప్పటినుంచి ఆయనకు ఆరోగ్యం సరిగా లేదని బంధువులు తెలిపారు. మల్లికార్జునరెడ్డికి కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. కుమారుడు మనోహర్‌రెడ్డి బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. కరోనా నేపథ్యంలో వర్క్‌ఫ్రం హోం చేస్తూ పోట్లదుర్తిలోనే ఉంటున్నట్లు బంధువులు తెలిపారు. పనిపై ప్రొద్దుటూరుకు వెళుతుండగా ఇద్దరినీ టిప్పర్‌ రూపంలో మృత్యువు కబళించింది. తండ్రీకొడుకు మృతితో పోట్లదుర్తిలో విషాదఛాయలు నెలకొన్నాయి.

పాల వ్యాన్‌ను ఢీకొని...

రాజంపేట-తిరుపతి హైవే రోడ్డుపై ఊటుకూరు వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆ వాహన డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఆగి వున్న పాల వ్యాన్‌ ఐచర్‌ వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మన్నూరు ఏఎస్‌ఐ సుబ్బయ్య వివరాల మేరకు.. రాజంపేట నుంచి కోడూరుకు వెళుతున్న పాల వాహనాన్ని ఊటుకూరు ఆంజనేయస్వామి గుడి సమీపంలో నిలిపి ఉండగా కోడూరు నుంచి రాజంపేట వైపు వస్తున్న ఐచర్‌ మినీ లారీ ఢీకొంది. దీంతో ఐచర్‌ వాహన డ్రైవర్‌ ఏసేపు, విజయ్‌కుమార్‌, ధన్‌రాజులకు తీవ్ర గాయాలయ్యాయి. విజయ్‌కుమార్‌ (48) తీవ్ర గాయాలు కావడంతో రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. అలాగే ధన్‌రాజు తలకు తీవ్రగాయం కావడంతో కడప రిమ్స్‌కు తరలించారు. వాహన డ్రైవర్‌కు స్వల్పగాయాలయ్యాయి. కాగా పాల వాహనంలో మనుషులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. 

ఆల్విన్‌ ఢీకొని యువకుడు...

బద్వేలులోని మైదుకూరు రోడ్డులోని కుమ్మరకొట్టాలు సమీపంలో మంగళవారం ఆల్విన్‌ లారీ వెనుక వైపు నుంచి ఢీకొనడంతో బైకులో వెళుతున్న అనకర్ల సుబ్బరాయుడు (30) అనే యువకుడు ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. సుబ్బరాయుడు మండల పరిధిలోని చెముడూరు గ్రామానికి చెందినవాడు. టిప్పరు డ్రైవరుగా పనిచేస్తున్న సుబ్బరాయుడుమంగళవారం సాయంత్రం పట్టణంలోకి వ చ్చేందుకు మోటారు బైకుపై వస్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతుడికి భార్య ఆదిలక్ష్మి, మూడు నెలల పాప ఉన్నారు. అర్బన్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2021-08-11T05:12:28+05:30 IST