మానవత్వం...

ABN , First Publish Date - 2021-01-13T05:50:46+05:30 IST

బ్యాక్‌వాటర్‌లో చిక్కుకుని దిక్కుతోచని స్థితిలో ఉన్న వానరాలకు గ్రామస్థుల సహకారంతో ఉపాధ్యాయుడు ఆహారాన్ని అందించారు.

మానవత్వం...
ఉన్నత పాఠశాల పైకప్పు మీద వేసిన ఆహారం తింటున్న వానరాలు

ఆంధ్రజ్యోతి కథనానికి స్పందించిన ఉపాధ్యాయుడు వెంకటసుబ్బారెడ్డి

గ్రామస్థుల సహకారంతో వానరాలకు ఆహారం 


ముద్దనూరు జనవరి 12: మానవత్వం వెల్లి విరిసింది. బ్యాక్‌వాటర్‌లో చిక్కుకుని దిక్కుతోచని స్థితిలో ఉన్న వానరాలకు గ్రామస్థుల సహకారంతో ఉపాధ్యాయుడు ఆహారాన్ని అందించారు. బ్యాక్‌వాటర్‌లో వానరాలు పడుతున్న కష్టాల గురించి ఆంధ్రజ్యోతి దినపత్రిలో వచ్చిన కథనానికి ఆయన స్పందించారు. అట్లూరు మండలం సోమేశ్వరపురం ఉన్నత పాఠశాలలో ఫిజికల్‌ సైన్స్‌ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పట్టెం వెంకటసుబ్బారెడ్డి మంగళవారం గండికోట ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌లో మునిగిన పాత కొర్రపాడు గ్రామానికి తెప్పలో వెళ్లి దిక్కుతోచని స్థితిలో ఉన్న వానరాలకు ఆహారం అందించారు. కొర్రపాడు పునరావాస కేంద్రంలో ఉన్న గ్రామస్థులు యనమల శ్రీధర్‌రెడ్డి, గరుడయ్యగారి సురే్‌షరెడ్డి, రమణారెడ్డి, బోరెడ్డి రామకేశవరెడ్డి, తెప్ప డ్రైవర్లు వెంకట చలపతి, శ్రీనివాసుల సహకారంతో దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాత కొర్రపాడు గ్రామానికి తెప్పలో ఆహారం తీసుకొని వెళ్లారు.


అక్కడి నీటమునిగిన ఉన్నత పాఠశాల భవనం వద్దకు తెప్ప వెళ్లగానే తెప్పలోని మనుషులను చూసిన వానరాలు ఉన్నత పాఠశాల పైకప్పు పైకి వచ్చాయి. ఎంతో కష్టపడి భవనం పైకి ఎక్కి తమ వెంట తీసుకొని వచ్చిన దాదాపు రూ.5 వేల విలువ చేసే 3 మొక్కజొన్న బస్తాలు, వేరుశనగ విత్తనాలు, బియ్యం ప్యాకెట్‌, అరటి పండ్లు, కర్జూరాలు ఉన్నత పాఠశాల పైకి తీసుకెళ్లి వాటికి అందించారు. ఆహారం అందించగానే ఎంతో ఆప్యాయంగా తిని నీళ్లు తాగాయి. వారం రోజుల పాటు వాటికి సరిపడే ఆహారం ఉన్నత పాఠశాల పైకప్పు మీద ఉంచారు. అధికారులు స్పందించి వానరాలను రక్షించాలని ఆయన కోరారు. ఎంతో దూరం నుంచి వానరాలకు ఆహారం అందించేందుకు వచ్చిన ఉపాధ్యాయుడిని గ్రామస్థులు అభినందించారు.



Updated Date - 2021-01-13T05:50:46+05:30 IST