సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం

ABN , First Publish Date - 2021-12-08T04:56:08+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్స్‌, కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే గుణపాఠం చెబుతామని ఏపీఎంటీఎఫ్‌ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి ఎస్‌ఎండీ రఫీవుద్దీన్‌ తెలిపారు.

సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం
ముద్దనూరులో నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయులు

నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపిన ప్రభుత్వ ఉద్యోగులు , ఉపాధ్యాయులు


ప్రొద్దుటూరు టౌన్‌, డిసెంబరు 7: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్స్‌, కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే  గుణపాఠం చెబుతామని ఏపీఎంటీఎఫ్‌ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి ఎస్‌ఎండీ రఫీవుద్దీన్‌ తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్స్‌, కార్మికుల సమస్యల పరిష్కారానికి ఉమ్మడి జేఏసీ ఉద్యమ కార్యాచరణలో భాగంగా మంగళవారం నడింపల్లె మున్సిపల్‌ హైస్కూల్‌లో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 71 డిమాండ్లతో ఆగస్టు 21న రాష్ట్ర ప్రభుత్వ ప్రధా న కార్యదర్శికి వినతిపత్రం సమర్పించినా ప్రభుత్వం నుంచి ఇంతవరకు స్పందన లేదన్నారు. 2018 జూలై 1 నుంచి 11వ పీఆర్సీని అమలు చేసి పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను చెల్లించాలని కోరారు. నెలలో సీపీఎ్‌సను రద్దు చేస్తామన్న జగన్‌మోహన్‌రెడ్డి మూడేళ్లు అవుతున్నా ఇంత వరకు దానిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు.  కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి హెచ్‌ఎం మోహన్‌రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 


జమ్మలమడుగులో ...

జమ్మలమడుగు రూరల్‌, డిసెంబరు 7 : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పెండింగ్‌ సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం చేస్తామని ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు నారాయణరెడ్డి డిమాండ్‌ చేశారు. మంగళవారం జమ్మలమడుగు ప్రభుత్వ ఆస్పత్రి ఎదురుగా ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు పీఆర్‌సీ, ఉద్యోగుల పెండింగ్‌ సమస్యల సాధనకు ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. అలాగే గాలేరు-నగరి, సృజలస్రవంతి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, వెలుగు కార్యాలయం, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేసినట్లు సంఘం అధ్యక్షుడు తెలిపారు. స్థానిక నాన్‌గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘం నాయకత్వంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. అలాగే పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం వద్ద మున్సిపల్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ నూర్‌బాష నిరసన తెలిపారు. కార్యక్రమంలో  ఉద్యోగులు రఘునాథరెడ్డి, సుబ్బరాజా, రాజగోపాల్‌, లీలారాణి, తదితర ఉద్యోగ సంఘ నాయకులు పాల్గొన్నారు.


ముద్దనూరులో...

ముద్దనూరు డిసెంబరు 7: మండల పరిధిలోని వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు తమ న్యాయమైన హక్కుల సాధన కోసం మంగళవారం నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపినట్లు తాలూకా ఎన్‌జీవోల సంఘం అధ్యక్షుడు సత్యానంద్‌బాబు తెలిపారు. రాష్ట్ర ఏపీటీఎ్‌సఏ అధ్యక్షుడు శోభన్‌బాబు పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.  కార్యక్రమంలో  ఏపీ ఎన్‌జీవో సంఘం నాయకులు వరప్రసాద్‌, ప్రసాదరెడ్డి, సూర్యబాబు, జాసన్‌, ఉపాధ్యాయ సంఘం నాయకులు జీసీఎం రెడ్డి, రామ్మోహన్‌ పాల్గొన్నారు.


కొండాపురంలో...

కొండాపురం, డిసెంబరు 7: స్థానిక పీహెచ్‌సీలో నల్లబ్యాడ్జీలతో వైద్యసిబ్బంది మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఉమ్మడి జేఏసీ పిలుపు మేరకు పీఆర్సీ, పెండింగ్‌ సమస్యల పరిష్కారానికి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బాలానరసింహులు, దేవదాసు, భారతి పాల్గొన్నారు.

Updated Date - 2021-12-08T04:56:08+05:30 IST