రైతుల గుండె ‘కోత’

ABN , First Publish Date - 2021-07-12T05:30:00+05:30 IST

మైలవరం ప్రధాన దక్షిణ కాలువలో నీరు ప్రవహించలేక ఆ నీరంతా పొలాల్లోకి వస్తుండటంతో అవి కోతకు గురవుతున్నాయి. సుమారు రెండు కిలోమీటర్ల మేర రైతులకు సంబంధించిన పొలాల్లో నీరు ప్రవహిస్తూ భారీ

రైతుల గుండె ‘కోత’
మైలవరం దక్షిణ కాలువ కనిపించకుండా పెరిగిన కంపచెట్లు, జమ్ము

జమ్ము, పూడికతో నిండిపోయిన దక్షిణ కెనాల్‌

కాలువ నీరంతా పొలాల్లోకి 

సాగుకు పనికిరాకుండా కోతకు గురైన పొలాలు


మైలవరం దక్షిణ కాలువ అధికారుల నిర్లక్ష్యం కొంతమంది రైతులకు శాపంగా మారింది. రెండేళ్లుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో కాలువలో భారీగా పెరిగిన జమ్ము, కంపచెట్లు, పూడికతో నీరు పారలేక పొలాల్లోకి ప్రవహిస్తోంది. దీంతో పొలాలు భారీగా కోతకు గురవుతున్నాయి. రెండడుగల లోతుకు పైగా పొలాలు కోతకు గురవుతున్నాయి. ఒకే రైతుకు చెందిన పొలాలు రెండుగా చీలిపోతున్నాయి. అధికారులు స్పందించకపోవడంతో రైతులు తమ పొలాలను అమ్ముకుంటున్నారు. 


ఎర్రగుంట్ల, జూలై 12: మైలవరం ప్రధాన దక్షిణ కాలువలో నీరు ప్రవహించలేక ఆ నీరంతా పొలాల్లోకి వస్తుండటంతో అవి కోతకు గురవుతున్నాయి. సుమారు రెండు కిలోమీటర్ల మేర  రైతులకు సంబంధించిన పొలాల్లో నీరు ప్రవహిస్తూ భారీ వెడల్పుతో భూమి కోతకు గురైంది. దీంతో పొలంలోని మట్టి అంతా కొట్టుకుపోయింది. ఇలా  రెండేళ్లుగా జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకున్న పాపాన పోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కట్ట స్థానంలో రైతులు సొంతంగా నాపరాయి వేస్టేజి, మట్టితో అడ్డుకట్ట వేసినా అది ప్రవాహానికి కొట్టుకుపోయి నీరు పొలాల్లోకి చేరి కోసేసింది. దక్షిణ కాలువకు ఆనుకుని ఉన్న ఆనందరెడ్డికి చెందిన మూడెకరాల పొలంలో సుమారు వంద అడుగుల వెడల్పున కోతకు గురైంది. దీంతో ఆయన తన పొలాన్ని అమ్ముకున్నాడు. అలాగే పుల్లారెడ్డికి చెందిన పొలం కూడా లోతుగా కోతకు గురైంది. ఇలా అనేకమంది రైతులకు చెందిన పొలాలను కాలువనీరు సాగుకు పనికిరాకుండా చేయడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. కోతకు గురైన పొలాలను బాగుచేసుకోవాలంటే రూ.లక్షలు వెచ్చించాల్సి వస్తుందని, దీనికి బదులు అమ్ముకోడమే మేలని భావించి అమ్ముకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారులకు తెలిపేందుకు కార్యాలయం వద్దకు వెళ్లినా సరైన సమాధానం లేదని రైతులు పేర్కొంటున్నారు. 


పొలాన్ని అమ్మేశాను

- ఆనందరెడ్డి, రైతు, హనుమనగుత్తి

కాలువకు అడ్డుకట్ట వేసేందుకు రూ.80 వేలు ఖర్చు చేశాను. అయినా నీటి ప్రవాహం ఆగకుండా పొలం కోతకు గురైంది. అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో పొలాన్ని అమ్మేశాను. మైలవరం దక్షిణ కాలువలో భారీగా కంపచెట్లు, జమ్ము మొలిచాయి. అలాగే పూడిక భారీగా నిండిపోయింది. దీంతో మా పొలం గట్టున ఉండే బ్రిడ్జి వద్ద నీరు కాలువ ద్వారా ముందుకు సాగడం లేదు. నీరంతా బ్రిడ్జి పైభాగానికి వచ్చి కట్టను తెంపేసింది. నీరు పొలంలోకి ఉధృతంగా ప్రవహించి భారీగా కోసేసింది.


గుండె కోత మిగిల్చింది

-చల్లా పుల్లారెడ్డి, రైతు

నా పొలం చూసి గుండె తరుక్కుపోతోంది. 5 ఎకరాల పొలాన్ని నిలువునా కోసేసింది. దీనిని బాగు చేసుకోవాలంటే లక్షలు వెచ్చించాల్సి ఉంటుంది. నాకు అంత శక్తి లేదు. కోత నుంచి పొలాన్ని రక్షించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకపోయింది. ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే అసలు పొలం పనికిరాకుండా పోతుంది. అడ్డుకట్టలు ప్రవాహాన్ని ఆపలేకపోతున్నాయి. ప్రధాన కాలువలో పూడిక తీయడమే దీనికి మార్గం. లేదంటే మా బతుకులు రోడ్డు పాలే.


ప్రతిపాదనలు పంపారు

-చంద్రమోహన, డీఈ మైలవరం కెనాల్‌

2007-11 మధ్యలో  ఒక ప్యాకెజీలో పని చేశారు. పనులు పూర్తి స్థాయిలో కాలేదు. దీంతో మిగిలిన పనులు రద్దు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కెనాల్‌ మెయింటెనెన్స పనులు చేయలేదు. నేను ఇటీవల డీఈగా బాధ్యతలు తీసుకున్నాను. నా కంటే ముందున్న వారు బ్యాలెన్స వర్కులకు సంబంధించి  ప్రతిపాదనలు పంపించారు. అవి మంజూరైతే పనులన్నీ చేయిస్తాం. రైతులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటాం. మా కింది స్థాయి అధికారులు కూడా ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకురాలేదు. 

Updated Date - 2021-07-12T05:30:00+05:30 IST