పస్తులెన్నాళ్లు ‘గురూ..’!

ABN , First Publish Date - 2021-01-20T05:40:21+05:30 IST

కొవిడ్‌-19 లాక్‌డౌన్‌లో కూడా విధులు నిర్వర్తించినప్పటికీ 8 నెలల నుంచి వేతనాలు చెల్లించలేదు.

పస్తులెన్నాళ్లు ‘గురూ..’!

8 నెలలుగా జీతాల్లేవు 

పండుగ వేళ కూడా పస్తులే

గురుకులాల సెక్యూరిటీ గార్డులు, పారిశుధ్య కార్మికుల ఆవేదన


కడప (ఎడ్యుకేషన్‌), జనవరి 19: వారంతా గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులు, పారిశుధ్య కార్మికులు. విద్యార్థుల భద్రతతో పాటు పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంతరం శ్రమిస్తున్న వారిని ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి. కొవిడ్‌-19 లాక్‌డౌన్‌లో కూడా విధులు నిర్వర్తించినప్పటికీ 8 నెలల నుంచి వేతనాలు చెల్లించలేదు. దీంతో సంక్రాంతి పండుగ వేళ వీరు పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. 


జిల్లాలో 18 బాలయోగి గురుకుల పాఠశాలలున్నాయి. ఒక్కో పాఠశాలకు  ఏడుగురు సెక్యూరిటీ గార్డులు, ఏడుగురు పారిశుధ్య కార్మికులు చొప్పున మొత్తం 252 మంది విధులు నిర్వహిస్తున్నారు. సెక్యూరిటీ గార్డులకు రూ.7,500, పారిశుధ్య కార్మికులకు రూ.6,500 వేతనం. వీరికి సేవాసుప్రీం సంస్థ, ఎస్‌ఆర్‌ఆర్‌ సంస్థ ఆధ్వర్యంలో వేతనాలు చెల్లిస్తుంటారు. 2019 మార్చి 28 నుంచి విధుల్లో చేరిన కార్మికులకు వేతనాలు సక్రమంగానే చెల్లిస్తుండేవారు. కొవిడ్‌-19లో భాగంగా 2020 మార్చి నుంచి లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ఒక్కో పాఠశాలకు ముగ్గురు సెక్యూరిటీ గార్డులు, ఇద్దరు పారిశుధ్య కార్మికులను మాత్రమే ఉంచారు. అంటే ఒక్కో పాఠశాలలో 14 మందికి బదులు ఐదుగురు చొప్పున మొత్తం 90 మంది విధులు నిర్వహిస్తున్నారు. వీరికి ఏప్రిల్‌ నుంచి వేతనాలు చెల్లించలేదు.


2019 నుంచి 2020 మార్చి వరకు 14 నెలల పాటు విధులు నిర్వర్తించిన 252 మంది సెక్యూరిటీ గార్డు లు, పారిశుధ్య కార్మికులకు పీఎఫ్‌ జమచేయలేదు. కరోనా సమయం నుంచి 8 నెలలుగా విఽధులు నిర్వహిస్తున్న వారికి పీఎఫ్‌ నిధులు జమ చేయలేదు, జీతాలూ ఇవ్వలేదు. వీరంతా తమకు వేతనాలు, పీఎఫ్‌ నిధులు జమ చేయాలని కోరుతున్నారు. ఈ వ్యవహారంపై బాలయోగి గురుకుల పాఠశాలల జిల్లా కోఆర్డినేటర్‌ సంతోషమ్మను వివరణ కోరగా.. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, ఏజెన్సీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిఽధులు రావాల్సి ఉందని అన్నారు. ప్రస్తుతానికి ఒక నెల వేతనం కార్మికులకు చెల్లించాలని ఏజె న్సీలను ఆదేశించామని, మిగిలిన జీతం కూడా త్వరలో ఇచ్చే ఏర్పాట్లు చేస్తామని అన్నారు.


ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలి

బాలయోగి గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న సెక్యూరిటీగార్డులు, పారిశుధ్య కార్మికులకు 8 నెలల నుంచి రావాల్సిన జీతాలు తక్షణం చెల్లించాలి. దీనికి బాధ్యులైన ఏజెన్సీలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

- కేసీ బాదుల్లా, ఏఐటీయూసీ జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి


8 నెలల జీతాలు చెల్లించాలి 

కరోనా సమయంలో బస్సులు లేకపోయినా నానా తంటాలుపడి వచ్చాం. ఒక్కోసారి నడుచుకుంటూ వెళ్లి డ్యూటీలు చేశాం. అయినా మాకు 8 నెలలుగా జీతాలు ఇవ్వలేదు. దీనిపై ఎన్నిసార్లు సంబంఽధిత సంస్థ జిల్లా మేనేజరుకు చెప్పినా సమాధానం లేదు. ఉన్నతాధికారులు న్యాయం చేయాలి.

- యాకుబ్‌, సెక్యూరిటీ గార్డు, సగిలేరు గురుకుల పాఠశాల  


పీఎఫ్‌ జమ చేయాలి

2019 మార్చి 20న పారిశుధ్య కార్మికునిగా విధుల్లో చేరా. అప్పటి నుంచి పీఎఫ్‌ నిధులు జమ చేయలేదు. తక్షణం ఉన్నతాధికారులు స్పందించి 8 నెలల జీతంతో పాటు 22 నెలల పీఎఫ్‌ నిధులు జమ చేసేట్లు చర్యలు తీసుకోవాలి.

- ఎస్‌.బాబ్జి, పారిశుధ్య కార్మికుడు, రామాపురం గురుకుల పాఠశాల 

Updated Date - 2021-01-20T05:40:21+05:30 IST