గండికోట.. గుండెకోత..!

ABN , First Publish Date - 2021-09-03T09:30:26+05:30 IST

‘‘ఈ 18 నెలల్లో చేసిన గొప్పపని ఏమిటంటే గండికోట జలాశయంలో 26.85టీఎంసీల నీటిని నిల్వచేయడం. గండికోట, చిత్రావతి నిర్వాసితుల త్యాగాలు మరువలేనివి.

గండికోట.. గుండెకోత..!

  • గడువు కోరినా కనికరం లేకుండా ముంచేశారు
  • ఉన్నపళంగా ఊరు ఖాళీ చేసి పునరావాసానికి
  • 9నెలలుగా తాత్కాలిక గుడారాలు, రేకుల షెడ్లలోనే
  • తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, మౌలిక వసతులు నిల్‌ 
  • వానకు తడుస్తూ... ఎండకు ఎండుతూ అవస్థలు 
  • 22టన్నుల ఇసుక ఉచితమని చెప్పి చేతులెత్తేశారు
  • ఇంకా 450 మందికి అందని ప్యాకేజీ సొమ్ము 
  • క్షమాపణలొద్దు... మొత్తం పరిహారం ఇస్తే చాలు
  • గండికోట పునరావాస కాలనీవాసుల డిమాండ్‌ 


(కడప-ఆంధ్రజ్యోతి) : ‘‘ఈ 18 నెలల్లో చేసిన గొప్పపని ఏమిటంటే గండికోట జలాశయంలో 26.85టీఎంసీల నీటిని నిల్వచేయడం. గండికోట, చిత్రావతి నిర్వాసితుల త్యాగాలు మరువలేనివి. మీకు ఇబ్బంది కలిగించి ఉంటే... మీ బిడ్డగా నన్ను క్షమించండి’’... పులివెందుల నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులు, సాగునీటి ప్రాజెక్టులకు శంకుస్థాపన సందర్భంగా గత డిసెంబరు 25న నిర్వహించిన సభలో సీఎం జగన్‌ చేసిన ప్రకటన ఇది.


క్షమాపణ సరే... ఊళ్లు, చేలు త్యాగాలు చేసిన ముంపు బాధితుల కష్టాలు తీర్చేదెవరు..? ఆరు నెలల గడువివ్వండి.. ఇండ్లు కట్టుకుని మేమే వెళ్లిపోతామని కాళ్లావేళ్లా పడినా కనికరించలేదు. రాత్రికి రాత్రే తరిమేశారు. రేకుల షెడ్లు, గుడారాల్లో ఎండనకా.. వాననకా.. 9నెలలుగా బాధితులు పడుతున్న అవస్థలెన్నో. ఇప్పటికీ చాలామందికి పునరావాస ప్యాకేజీ అందలేదు. ఇల్లు కట్టుకుంటే గత ప్రభుత్వంలో రూ.1.85లక్షలు ఇస్తే.. ఈ ప్రభుత్వం పైసా ఇవ్వలేదు. ఇస్తామనీ చెప్పడం లేదు. రోడ్లు లేవు. తాగునీరు అందక తాళ్లప్రొద్దుటూరు గండికోట పునరావాస కాలనీవాసులు పడుతున్న అవస్థ అక్షరాలకు అందని వేదన. పాలకులు మిగిల్చిన గుండెకోతపై ‘ఆంధ్రజ్యోతి’ క్షేత్రస్థాయి పరిశీలన కథనం. 


కన్నీళ్లు పెట్టినా... 

గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టులో భాగంగా కడప జిల్లా కొండాపురం మండలం గండ్లూరు సమీపంలో పెన్నా నదిపై 26.85 టీఎంసీల సామర్థ్యంతో గండికోట జలాశయం నిర్మించారు. దీంతో 24 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. గత ప్రభుత్వాలు 16 గ్రామాలను ఖాళీ చేయించి పునారావాసం కల్పించాయి. టీడీపీ ప్రభుత్వంలో 12 టీఎంసీలు నిల్వ చేశారు. ముఖ్యమంత్రిగా జగన్‌ బాధ్యతలు చేపట్టాక పూర్తిస్థాయి సామర్థ్యం 26.85 టీఎంసీలు నిల్వ చేస్తామని 2019 డిసెంబరు 23న కడప జిల్లా సున్నపురాళ్లపల్లె సభలో ప్రకటించారు. ముంపు గ్రామాల్లో 7,919మంది బాధితుల ఇళ్లు ఖాళీ చేయించేందుకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద రూ.665.85కోట్లు మంజూరు చేశారు. యంత్రాలు, పోలీస్‌ బలగాలను దించి 2,869 నివాసాలు కలిగిన తాళ్లప్రొద్దుటూరును 2020 సెప్టెంబరులో ఖాళీ చేయించారు. ఆరు నెలలు గడువివ్వండి.. మేమే ఖాళీ చేసి వెళ్లిపోతామని మహిళలు రోడ్డెక్కి గొంతెత్తినా కనికరం చూపలేదు.. కొంచెంకొంచెంగా నీటిమట్టం పెంచుతూ డిసెంబరు 11న పూర్తిగా ముంచేశారు. అదే నెల 24న సీఎం జగన్‌ క్షమాపణ చెప్పడంతో కష్టాలు తీరతాయని భావించారు. ఇప్పటికి 9 నెలలు కావొస్తున్నా కన్నీళ్లతోనే ముంపు బాధితులు కాలం వెళ్లదీస్తున్నారు.


ఇది వంచన కాదా?

కడప-తాడిపత్రి రోడ్డులో 160ఎకరాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కాలనీలో బాధితులు ఒక్కొక్కరికి 5సెంట్ల స్థలం ఇచ్చారు. ప్యాకేజీ రూ.10లక్షలు కాగా.. ఇంటిస్థలం తీసుకున్న వారికి రూ.7లక్షలు ఇచ్చారు. మిగిలిన రూ.3లక్షల్లో.. 5 సెంట్లు స్థలం, సీసీ డ్రైనేజీ, రోడ్లు వంటి మౌలిక వసతులకు రూ.1.20లక్షలు పోను రూ.1.80లక్షలు ఇల్లు నిర్మించుకుంటే మూడు దశల్లో చెల్లిస్తామని అధికారులు చెప్పారని, ఇప్పుడు ఆ డబ్బు రాదంటున్నారని, ఇది వంచన కాదా అని బాధితులు నిలదీస్తున్నారు. ఇంటికోసం గత ప్రభుత్వం రూ. 1.85లక్షలు ఇచ్చింది. ఇప్పుడెందుకు ఇవ్వట్లేదని ప్రశ్నిస్తున్నారు. ప్రతి ఇంటికి 22 టన్నుల ఇసుక ఉచితంగా ఇస్తామన్నారు.. ఒక్కటన్నూ ఇవ్వలేదు. గతేడాది సెప్టెంబరులో నాటి జమ్మలమడుగు ఆర్డీవో నాగన్న బాధితులు ఇళ్లు ఖాళీ చేస్తే.. 6 నెలలు బాడుగ ఇస్తామన్నారు. మాటిచ్చిన అధికారి రిటైర్‌ కాగా కలెక్టరు బదిలీ అయ్యారు. ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఏకరువు పెడుతున్నారు. రోడ్లు లేవు.. తాగునీరు క్యాన్‌ రూ. 20కి కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఉంది. అంతేకాదు, నేటికీ సుమారు 450మందికి పునరావాస ప్యాకేజీ డబ్బు అందలేదు. గట్టిగా ప్రశ్నిస్తే ఆ పరిహారం కూడా వస్తుందో.. రాదో..? అని కన్నీళ్లు దిగమింగుతూ కాలం గడిపేస్తున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


ఈ కష్టాలు పగోడికైనా రాకూడదు

గండికోటలో 18 చదరాల ఇల్లు ముంపునకు గురైంది. రాత్రికిరాత్రే ఊరొదిలి వచ్చేశాం. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఎంచుకుంటే 5సెంట్ల స్థలం ఇచ్చారు. రూ.7 లక్షల ప్యాకేజీ చెక్కు ఇప్పటికీ ఇవ్వలేదు. అప్పు పుట్టక ఇంటి నిర్మాణం చేపట్టలేదు. తిమ్మాపురంలో రూ.3 వేలకు బాడుగ ఇంట్లో ఉంటున్నాం. 18 చదరాల ఇంటిని కట్టుకోవాలంటే రూ.35 లక్షలకు పైగా ఖర్చు అవుతుంది. న్యాయబద్ధంగా రావాల్సిన చెక్కు కూడా అందలేదు. నాలాంటి వాళ్లు 450 మందికిపైగా ఉన్నారు. ఇళ్లు, పొలాలు త్యాగం చేసి దుర్భరమైన జీవనం గడుపుతున్నాం. మాలాంటి కష్టాలు పగోడికైనా రాకూడదు.  - జగదీశ్వరరెడ్డి, తాళ్ల ప్రొద్దుటూరు.


ఒక్క టన్ను ఇసుక ఉచితంగా ఇవ్వలేదు 

ఆరు నెలలు గడువివ్వండి.. ఇల్లు కట్టుకుని ఖాళీ చేస్తామంటే కనికరించలేదు. 10చదరాల ఇల్లు మునిగిపోయింది. రూ.7 లక్షల చెక్కు ఇచ్చారు. ఇంటి నిర్మాణానికి రూ.18 లక్షలు ఖర్చు కాగా.. రూ.11లక్షలు అప్పు చేశాము. ప్రతి ఇంటికి 22 టన్నులు ఇసుక ఉచితంగా ఇస్తామని కలెక్టరు సారే చెప్పారు. ఒక్క టన్ను కూడా ఇవ్వలేదు. టిప్పరు రూ.20 వేల ప్రకారం ఇసుకకే రూ.2 లక్షలు ఖర్చు చేశాం. ఇల్లు పూర్తి కాలేదు. ఈ గుడారంలోనే వానకు తడుస్తూ.. ఎండకు ఎండుతూ కాలం గడుపుతున్నాం. 

- జిట్టా సుబ్బరాయుడు, సుబ్బమ్మ దంపతులు, తాళ్ల ప్రొద్దుటూరు


బతుకుబండి లాగించేదెట్లా? 

సార్‌.. మా కష్టాలు ఏమని చెప్పుకునేది. గండికోటలో ఇల్లు మునిగిపోతే సర్కారోళ్లు రూ.7 లక్షలు ఇచ్చారు. ఇల్లు కట్టుకోవడానికి రూ.16 లక్షలైంది. నూటికి రూ.2 ప్రకారం రూ.9 లక్షలు అప్పుచేశాం. ఇసుక కోసం రూ.30వేలు కట్టి ఆన్‌లైన్లో బుక్‌ చేస్తే.. ఒక్క ట్రాక్టరు వేశారు. కాంట్రాక్టరు మారాడు.. మిగిలిన డబ్బు వస్తుందన్నారు. ఇప్పటికీ ఇవ్వలేదు. ఇసుక దొరక్క ఇల్లు పూర్తి కాలేదు. ప్రభుత్వ స్థలంలో వేసుకున్న గుడారం పీకేయమంటున్నారు. మేం ఎక్కడికెళ్లాలి..? తాగునీళ్లు లేవు.. చేసేందుకు పనులు లేవు.. కాలం ఎట్లా గడిపేది.. బతుకుబండి లాగించేదెట్లా..?

- లక్ష్మీనారాయణమ్మ, ఓబులేసు దంపతులు, తాళ్ల ప్రొద్దుటూరు

Updated Date - 2021-09-03T09:30:26+05:30 IST