‘బిందె’ సేద్యం

ABN , First Publish Date - 2021-08-10T09:57:27+05:30 IST

వరుణుడు ముఖం చాటేశాడు. భూమిలో నాటిన ఒక విత్తు కూడా మొలకెత్తలేదు. దీంతో పంటను కాపాడుకునేందుకు కొందరు రైతులు బిందెలతో నీటిని తీసుకొచ్చి మొక్కలను తడుపుతుండగా మరికొందరు మందులను పిచికారీ చేసే యంత్రంతో నీటిని అందిస్తున్నారు.

‘బిందె’ సేద్యం
బీచువారిపల్లెలో పిచికారి యంత్రంతో పొలం తడుపుతున్న రైతు

రాలని చినుకులు.. రానంటున్న మొలకలు

పత్తి పంటను దక్కించుకునేందుకు రైతుల ప్రయత్నం

ప్రొద్దుటూరు, ఆగస్టు 9: వరుణుడు ముఖం చాటేశాడు. భూమిలో నాటిన ఒక విత్తు కూడా మొలకెత్తలేదు. దీంతో పంటను కాపాడుకునేందుకు కొందరు రైతులు బిందెలతో నీటిని తీసుకొచ్చి మొక్కలను తడుపుతుండగా మరికొందరు మందులను పిచికారీ చేసే యంత్రంతో నీటిని అందిస్తున్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో పడిన వర్షాన్ని ఆధారంగా చేసుకుని జిల్లాలో దాదాపు వెయ్యి హెక్టార్లకు పైగా పత్తి పంటను సాగు చేశారు. మొలక దశలోనే అధిక వర్షాలు పడటంతో పంట దెబ్బతింది. కొన్ని రోజుల తర్వాత వాటిని తొలగించి తిరిగి మరో దఫా పత్తి విత్తనాలను వేశారు. ఆ తర్వాత వర్షం రాకపోవడంతో రైతుల్లో అందోళన నెలకొంది. సాగు చేసిన పంటను దక్కించుకునేందుకు ఆష్టకష్టాలు పడుతున్నారు. ఎంతో కష్టంతో కూడుకున్న పని అయినప్పటికి ఇదే సీజన్‌లో ఒక దఫా పంట పోయి నష్టపోయిన రైతులు తిరిగి సాగు చేసుకున్న పంటను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. కొందరు పురుగుల మందు పిచికారి చేసే యంత్రం ద్వారా నీటిని నింపుకుని మొక్కలకు అందిస్తుండగా, కొంతమంది బిందెలతో నీటిని తీసుకెళ్లి పొలాల్లో పోస్తున్నారు. ఇదిలా ఉంటే  రైతులకు ఎక్కువగా ఇష్టపడే రకం పత్తి విత్తనాలు అందుబాటులో లేక ఇబ్బంది పడుతున్నారు. అరకొరగా రైతు కష్టం ఫలించి విత్తులు మొలకెత్తుతున్నాయి. 50 శాతం మేర సమృద్ధిగా పంట వచ్చే పరిస్థితి కన్పించడం లేదు. ఇక మరో రెండు మూడు రోజుల్లో వర్షాలు రావచ్చనే ప్రకటనలు వెలువడుతుండటంతో రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. కడప వ్యవసాయ డివిజన్‌లో ఖాజీపేట, పెండ్లిమర్రి, సీకె దిన్నె మండలాల్లో 450 హెక్లార్లల్లో పత్తి పంట సాగు చేశారు.కొన్ని రోజుల్లో వర్షం రాకపోతే మిగిలిన మండలాల్లో పత్తి పంట మొలకెత్తడం ప్రశ్నార్థకమే. 


భారమవుతున్న వ్యవసాయం 

ఒకే సీజన్‌లో ఒకే రకం పంటను రెండు దఫాలుగా వేయాల్సి రావడం భారంగా మారుతుందని రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టపరిహారం వచ్చే పరిస్థితులు ఉండవు. నిబంధనల ప్రకారం పంట మొలకొచ్చి, ప్రకృతి వైపరీత్యాల వల్ల 50 శాతానికి పైగా పంట నష్టపోతేనే పరిహారం అందే అవకాశాలు ఉంటాయి. అయితే ముందుగా సాగు చేసిన విత్తనాలు మొలకెత్తే సమయంలోనే అధిక వర్షాల వల్ల నష్టపోవడం, ఇప్పుడు మొలకే రాకపోవడంతో పరిహారానికి రైతాంగం దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనికి తోడు ఈ-క్రాప్‌ నమోదైతేనే రైతులకు ప్రయోజనం కలుగుతుంది. ఇన్ని ఇబ్బందుల మధ్య పంటల సాగు, దిగుబడులు, గిట్టుబాటు ధరలు లేకపోవడం వ్యవసాయం మరింత భారమవుతుందని రైతులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. 


వ్యవసాయం భారం అవుతోంది 

-నాగేంద్రరెడ్డి, రైతు బీచువారిపల్లి, ఖాజీపేట మండలం

అవసరానికి రావాల్సిన వాన ఎక్కువగా రావడంతో భూమిలో వేసిన విత్తనాలు మొలక దశలోనే కుళ్లిపోయాయి. వాటిని తొలగించి తిరిగి పత్తి సాగు చేస్తే సకాలంలో వర్షాలు రాకపోవడంతో మొలకలు రావడం లేదు. దానిని దక్కించుకునేందుకు ఎకరానికి వెయ్యి బిందెల చొప్పున నీటిని తీసుకొచ్చి చల్లుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ సీజన్‌లోనే వేసిన పంటనే మళ్లీ వేయడం వల్ల ఎక్కువ ఖర్చులొచ్చి వ్యవసాయం భారంగా మారింది.


రెండు మూడు రోజుల్లో వర్షాలు 

- నరసింహారెడ్డి, ఏడీ, వ్యవసాయశాఖ

రెండు మూడు రోజుల్లో వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో కొంత మేర పంటలకు నీరందే పరిస్థితులు ఉంటాయి. కేసీ కెనాల్‌ ఆయకట్టు ప్రాంతంలో కాలువ నీటి ద్వారా పంటలను రక్షించుకునే పరిస్థితులు ఉంటాయి. 

Updated Date - 2021-08-10T09:57:27+05:30 IST