డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు సబ్సిడీతో ఇవ్వాలి : సీపీఐ
ABN , First Publish Date - 2021-10-22T04:55:28+05:30 IST
రైతులకు డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు సబ్సిడీతో వెంటనే మంజూరు చేయాలని ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో డిప్యూటీ తహసీల్దార్‌కు వినతి పత్రం ఇచ్చారు.

ఎర్రగుంట్ల, అక్టోబరు 21: రైతులకు డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు సబ్సిడీతో వెంటనే మంజూరు చేయాలని ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో డిప్యూటీ తహసీల్దార్‌కు వినతి పత్రం ఇచ్చారు. అనంతరం రైతు సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు ఎంవీ సుబ్బారెడ్డి, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్.చాంద్‌బాషా, సీపీఐ నేత భీమరాజు మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సూక్ష్మనీటి సేద్యపు పరికరాలు, వ్యవసాయ యంత్రాలపై ఇచ్చే రాయితీని గత మూడు సంవత్సరాలుగా నిలపివేయడాన్ని నిరసిస్తూ ఏపీ రైతు సంఘం అక్టోబరు 21న రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఆందోళన చేపట్టినట్లు తెలిపారు. 2003 నుంచి బిందు, తుంపర సేద్యానికి సబ్సిడీలు లభించేవన్నారు. అయితే వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రివర్స్ టెండరింగ్ విధానం, కంపెనీలకు చెల్లించాల్సిన రూ.1300కోట్ల బకాయిలు చెల్లించకపోవడంతో రాష్ట్రంలో 37 కంపెనీలు సూక్ష్మనీటి సేద్యపు పరికరాల సరఫరాను పూర్తిగా నిలుపుదల చేశాయన్నారు. దీంతో 4.5 లక్షల హెక్టార్లలో సాగు కుంటుబడిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ చూపి రైతులకు సూక్ష్మనీటిసేద్యపు పరికరాలను సబ్సిడీపై అందించి వ్యవసాయాన్ని బతికించాలన్నారు.