రాయితీ వేరుశనగ విత్తనకాయలు ఎలుకల పాలు
ABN , First Publish Date - 2021-09-04T05:18:35+05:30 IST
రాయితీ వేరుశనగ విత్తన కాయలు ఎలుకల పాలు, బూజు పట్టిపోయాయి.

రామాపురం, సెప్టెంబరు3: రాయితీ వేరుశనగ విత్తన కాయలు ఎలుకల పాలు, బూజు పట్టిపోయాయి. 2018లో రామాపురం మండలానికి విత్తనకాయలు పంపిణీ చేసేటప్పుడు కొందరూ వాటిని అక్రమంగా తీసుకుని వెళ్తుంటే విజిలెన్స్ అధికారులు పట్టుకొని వ్యవసాయశాఖ అధికారులకు అప్పగించారు. వాటిని వ్యవసాయ కార్యాలయంలో ఉంచారు. అయితే వాటిని ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో ఎలుకల పాలు, బూజుపట్టిపోయాయి. దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరిపించాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రంగారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక వ్యవసాయ కార్యాలయంలో పురుగు పట్టిన వేరుశనగ విత్తనకాయలను ఏపీ రైతు సంఘాలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రంగారెడ్డి మాట్లాడుతూ 2018లో రామాపురం మండలంలో రైతులకు ఇవ్వాల్సిన రాయితీ వేరుశనగ విత్తన కాయలు 66 బస్తాలు అక్రమ మార్గంలో తరలిస్తుండగా విజిలెన్స్ అధికారులు పట్టుకొని వ్యవసాయ అధికారులకు అప్పగించారు. ఈ విషయంపై వ్యవసాయశాఖ ఏడీ దృష్టికి తీసుకుపోయినప్పటికీ నిర్లక్ష్యపు సమాధానం చెబుతున్నారన్నారు. వాటిని ఎలాంటి చర్యలు తీసుకోకుండా వృథాగా పురుగులు పట్టేటట్లు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపించి బాధ్యుతలపై చర్యలు తీసుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం నాయకుడు రాజగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.