ఆ ఊరికి దారేది..?
ABN , First Publish Date - 2021-12-16T05:03:11+05:30 IST
అది దుద్యాల గ్రామం కొట్రాళ్ల దళితవాడ. సుమారు 55 కుటుంబాలు కలవు. ఆ ఊరికి మాత్ర దారి లేదు. ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నా పాలకులు, అధికారులు మాత్రం తమ గురించి పట్టించుకోవడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు.

కొట్రాళ్ల దళితుల బతుకులు మారేదెన్నడో!
ఊరి చుట్టూ పట్టా భూములు
దారి కోసం ఏళ్ల తరబడి ఎదురుచూపులే
సంబేపల్లె, డిసెంబరు 15: అది దుద్యాల గ్రామం కొట్రాళ్ల దళితవాడ. సుమారు 55 కుటుంబాలు కలవు. ఆ ఊరికి మాత్ర దారి లేదు. ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నా పాలకులు, అధికారులు మాత్రం తమ గురించి పట్టించుకోవడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. గత ప్రభుత్వంలో దళితవాడ కోసం 80 లక్షల రూపాయలతో దిన్నెపల్లె రోడ్డు నుంచి దళితవాడ వరకు రోడ్డు మంజూరు చేశారు. రైతుల పట్టా భూములు ఉండడంలో వేసిన ఫార్మేషన్ రోడ్డును గాడి తీసి అడ్డు వేశారు. దీంతో దళితవాడ దారి సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. అధికారులు ఊరికి వెళ్లడం, పరిశీలించడం తిరిగి వెనుదిరగడం తప్ప దారి మాత్రం ఇప్పటికీ కల్పించలేదు. ఊరికి ఆనుకుని ఉన్న భూములు చెరువు కింద బంజరు భూములని వీటిని పట్టా భూములుగా మార్చుకున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. మా ఊరికి వెళ్లాలి అంటే వృద్ధులకు, పిల్లలకు కష్టాలు తప్పడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఊరిని నమ్ముకుని మూడు తరాలుగా ఇక్కడే జీవనం చేస్తున్నారు. దళితవాడ ప్రజలు దారి కోసం కలవని ప్రజాప్రతినిధి, అధికారి లేడు. అయినా సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. ఊరిలో వృద్ధులకు ఎవ రైనా ఆరోగ్యం సరిగ్గా లేకపోతే కనీసం వాహనం కూడా ఊరికి రాని దయనీయ స్థితిలో ఉన్నట్లు దళితులు వాపోతున్నారు. ప్రభుత్వాలు దళిత ప్రజల అభివృద్ధి కోసం ఎస్సీ సబ్‌ప్లాన్ పేరుతో ఊరిలో మౌలిక వసతుల కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసిన దళితవాడలు ఉన్నాయి. ఇలాంటి పథకాలు ఈ దళితవాడ దరి చేరలేదు అని చెప్పవచ్చు. ఆ ఊరి చుట్టూ పట్టా భూములు ఉండడం వారికి శాపంగా మారింది. ఇప్పటికైనా తమ ఊరికి దారి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.
దారి కల్పించండి సార్..
- గంగులమ్మ, దళితవాడ
ఎన్నో ఏళ్లుగా దారి కోసం ఎదురుచూస్తున్నాము. పట్టా భూముల పేరుతో రోడ్డును అడ్డుకుంటున్నారు. మా ఊరికి దారి సౌకర్యం కల్పించడం సారూ.
ఊరు వదలి వెళ్లి పోవాల్సిందే..
- సుధాకర్, దళితవాడ
ఊరికి దారి లేకపోతే అందరం ఊరు వదిలి వలస వెళ్లిపోవాల్సిందే. వృద్ధులకు బాగలేకపోతే కనీసం 108 వాహనం కూడా ఊర్లోకి రాని పరిస్థితి ఉంది. ఇలాంటి దయనీయ పరిస్థితి నుంచి కాపాడాలి.
