రూ.12 కోట్లతో బస్టాండు, గ్యారేజీ, క్వార్టర్స్ అభివృద్ధి
ABN , First Publish Date - 2021-11-21T06:43:35+05:30 IST
ప్రస్తుతం ఉన్న ఆర్టీసీ బస్టాండును, అలాగే గ్యారేజీని, పక్కనే ఉన్న ఆర్టీసీ క్వార్టర్స్‌తో పాటుగా హాస్పిటల్‌ను సుమారు రూ.12 కోట వ్యయంతో అభివృద్ధి చేస్తామని ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు.

మృతిచెందిన కండక్టర్ కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం
ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు
కడప మారుతీనగర్, నవంబర్ 20: ప్రస్తుతం ఉన్న ఆర్టీసీ బస్టాండును, అలాగే గ్యారేజీని, పక్కనే ఉన్న ఆర్టీసీ క్వార్టర్స్‌తో పాటుగా హాస్పిటల్‌ను సుమారు రూ.12 కోట వ్యయంతో అభివృద్ధి చేస్తామని ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు. ఇటీవల ఎడతెరపిలేకుండా కురుస్తున్న వరదల కారణంగా కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, జిల్లాల్లో గల బస్టాండ్లు, గ్యారేజిలలో వర్షపు నీరు మరింతగా చేరాయన్నారు. దీంతో శుక్రవారం సుమారు 18 వందల సర్వీసులను రద్దుచేశామన్నారు. ఇదిలావుండగా కడపజిల్లా నందలూరు వద్ద చెయ్యేరు వరదలో మూడు ఆర్టీసీ బస్సులు వాగులో చిక్కుకొని కండక్టర్, ఇద్దరు ప్రయాణికులు చనిపోవడం బాధాకరమన్నారు. కండక్టర్ కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇస్తామన్నారు. మిగిలిన ప్రయాణికుల గురించి అధికారులతో చర్చించాక ప్రకటిస్తామన్నారు. కడప బస్టాండును త్వరలో మరింతగా ప్రయాణికులకు నచ్చేవిధంగా తీర్చిదిద్దుతామన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ డిప్యూటీ సీటీఎం వెంకటరమణ, ఆర్‌ఎం జితేంద్రనాధరెడ్డి, కడప డిపో మేనేజర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆర్టీసీ ఎండీ ఒంటిమిట్ట మండలం మాధవరం వెళ్లి బాధిత కండక్టర్ కుటుంబాన్ని పరామర్శించారు.