సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి
ABN , First Publish Date - 2021-03-25T04:48:54+05:30 IST
సచివాలయ సిబ్బంది, నగర పంచాయతీ అధికారులు కౌన్సిలర్లకు పూర్తి సహకారం అందించాలని నగర పంచాయతీ చైర్మన్ మూలె హర్షవర్దన్‌రెడ్డి పేర్కొన్నారు.

నగర పంచాయతీ చైర్మన్ మూలె హర్షవర్దన్‌రెడ్డి
ఎర్రగుంట్ల, మార్చి 24: సచివాలయ సిబ్బంది, నగర పంచాయతీ అధికారులు కౌన్సిలర్లకు పూర్తి సహకారం అందించాలని నగర పంచాయతీ చైర్మన్ మూలె హర్షవర్దన్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఎర్రగుంట్ల ఎంపీడీవో సభాభవనంలో సచివాలయ సిబ్బందితో ప్రత్యేక పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కొందరు కౌన్సిలర్లు మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది తమకు కనీస గౌరవం ఇవ్వడం లేదన్నారు. సమస్యలపై ఫిర్యాదులు చేస్తే పట్టించుకోవడం లేదంటూ అగ్రహం వ్యక్తం చేశారు. 5వ సచివాలయంలో కొందరు వలంటీర్లు అసలే రావడం లేదని ఫిర్యాదు చేశారు. 20వ వార్డులో తాగునీటి పైప్‌లైన్ కలుషతమౌతోందని తెలిపినా పట్టించుకోవడం లేదన్నారు. 12,13వార్డుల్లో డ్రైనేజీ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. 14వ వార్డులో లెట్రిన్, బాత్‌రూంల నుంచి ఊటలు వస్తున్నాయని, వీటి కంపు భరించలేకున్నామని ప్రజలు తమ దృష్టికి తెచ్చారన్నారు. ఇందుకు శానటరీ ఇన్స్‌స్పెక్టర్ మధుకుమార్ మాట్లాడుతూ పారిశుధ్యం పనులు నిర్వహించేందుకు సిబ్బంది చాలా తక్కువగా ఉన్నారన్నారు. 60మంది ఉండాల్సి వుండగా 20 మంది మాత్ర మే ఉన్నారని తెలిపారు. ఇందులో కొందరు మద్యం సేవించి విధులకు వస్తున్నారని, ఏ పనిచెప్పినా ఎదురు చెబుతున్నారన్నారు. ఇందుకు స్పం దించిన చైర్మన్ హర్షవర్దన్‌రెడ్డి, కమిషనర్ రంగస్వామి మాట్లాడుతూ ఇకపై ఎవరు పనిచేయకపోయినా ఉపేక్షించమన్నారు. అందరూ సమన్వయంతో పనిచేస్తేనే నగర పంచాయతీ అభివృద్ధి సాధ్యమని, ఆ దిశగా చర్యలు చేపడతామన్నారు.