‘కావాలనే సబ్సిడీ ఆపేశారు’

ABN , First Publish Date - 2021-10-29T05:02:55+05:30 IST

జిల్లాలో పరిశ్రమను ఏర్పాటు చేసి పది మందికి ఉపాధి అవకాశం కల్పించాలనుకుంటే కావాలనే తనకు సబ్సిడీ డబ్బు అందకుండా చేశారని భారతి ఫీడ్‌ మిక్సింగ్‌ ప్లాంట్‌ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ ఎన్‌.కృష్ణారెడ్డి అన్నారు. ఈయనకు రావాల్సిన సబ్సిడీ వ్యవహారంపై తనను చంపేస్తా నంటూ జిల్లా పరిశ్రమల శాఖ సలహాదారు రాజోలి వీరారెడ్డి బెదిరించాడంటూ ఆ శాఖ జిల్లా ఎండీ బుధవారం మీడియాతో చెప్పిన సంగతి తెలిసిందే.

‘కావాలనే  సబ్సిడీ ఆపేశారు’

కడప(మారుతీనగర్‌)/కడప, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పరిశ్రమను ఏర్పాటు చేసి పది మందికి ఉపాధి అవకాశం కల్పించాలనుకుంటే కావాలనే తనకు సబ్సిడీ డబ్బు అందకుండా చేశారని భారతి ఫీడ్‌ మిక్సింగ్‌ ప్లాంట్‌ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ ఎన్‌.కృష్ణారెడ్డి అన్నారు. ఈయనకు రావాల్సిన సబ్సిడీ వ్యవహారంపై తనను చంపేస్తా నంటూ జిల్లా పరిశ్రమల శాఖ సలహాదారు రాజోలి వీరారెడ్డి బెదిరించాడంటూ ఆ శాఖ జిల్లా ఎండీ బుధవారం మీడియాతో చెప్పిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై గురువారం ఎన్‌.కృష్ణారెడ్డి కడప ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. 2018 ఏప్రిల్‌లో కడప నగర ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌లో తాను కోట్ల రూపాయలు వెచ్చించి భారతి ఫీడ్‌ మిక్సింగ్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేశానన్నారు. ఆ పరిశ్రమకు ప్రభుత్వం నుంచి అందాల్సిన సబ్సిడీని తనకు అందకుండా సంబంధిత పరిశ్రమల శాఖ ముఖ్య అధికారి కావాలనే కుట్ర చేశారని ఆరోపించారు. సబ్సిడీ రూపంలో సుమారు రూ.72 లక్షలా 50 వేలు తనకు అందకుండా చేయడం బాధాకరమన్నారు. ఈ విషయంగా ఆ అధికారి తనను రూ.5 లక్షలు ఇవ్వాలని కోరగా తాను ఒక లక్ష ఇచ్చానన్నారు. అతను అడిగి నంత డబ్బు ఇవ్వలేదని తనకు న్యాయబద్ధంగా ప్రభుత్వం నుంచి అందాల్సిన సబ్సిడీ నిధులు దక్కకుండా చేశారన్నారు. ఇలాంటి అధికారుల వలన జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఎవ్వరూ ముందుకురావడం లేదన్నారు. ఈ విషయంగా పరిశ్రమల శాఖ సలహాదారు రాజోలు వీరారెడ్డి దృష్టికి తీసుకెళ్లానన్నారు.


లంచం డిమాండ్‌ చేసింది అవాస్తవం: పరిశ్రమల శాఖ జీఎం 

భారతి ఫీడ్‌ మిక్సింగ్‌ ప్లాంట్‌ యజమాని నుంచి తాను రూ.5 లక్షలు లంచం డిమాండ్‌ చేసినట్లు పరిశ్రమల శాఖ సలహాదారు రాజోలి వీరారెడ్డి చేసిన ఆరోపణలు అవాస్తవమని జిల్లా పరిశ్రమల శాఖ జీఎం చాంద్‌బాషా గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. భారతి ఫీడ్‌ మిక్సింగ్‌ ప్లాంట్‌ను స్టేట్‌ లెవల్‌ కమిటీ ముందస్తు అనుమతి లేకుండానే అమ్మేశారని పేర్కొన్నారు. అమ్మిన తరువాత మంజూరైన రూ.20 లక్షల సబ్సిడీని కాజేసేందుకు విశ్వప్రయత్నాలు చేశారని వివరించారు. జీవో నెంబర్‌ 108 ప్రకారం అనుమతి లేకుండా అమ్మిన మిక్సింగ్‌ ప్లాంట్‌కు సబ్సిడీ నిధులు రావని, ఆ పరిశ్రను కొనుగోలు చేసిన ఆర్గాన్‌ ఫీడ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో ఉన్న వారికి మాత్రమే సబ్సిడీ వస్తుందని వివరించారు. ప్రభుత్వం సొమ్మును కాజేసేందుకు అసత్య ఆరోపణలు చేస్తున్నారని, జిల్లాలో ముందస్తు అనుమతి లేకుండా అమ్మేసిన 11 పరిశ్రమలకు, ప్రాజెక్టులకు సబ్సిడీ నిలిపేశామని తెలిపారు.

Updated Date - 2021-10-29T05:02:55+05:30 IST