ప్రభుత్వ చర్యలతో తగ్గుతున్న కొవిడ్ కేసులు
ABN , First Publish Date - 2021-05-21T04:56:13+05:30 IST
దేశంలో కరోనా యాక్టివ్ కేసులు కొద్దికాలంగా తగ్గుముఖం పట్టాయని, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని సరికొత్త వ్యూహంతో సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపు నిచ్చారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని నరేంద్రమోదీ
కడప (కలెక్టరేట్) మే 20 : దేశంలో కరోనా యాక్టివ్ కేసులు కొద్దికాలంగా తగ్గుముఖం పట్టాయని, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని సరికొత్త వ్యూహంతో సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపు నిచ్చారు. గురువారం ఢిల్లీ నుంచి కొవిడ్ నియంత్రణపై అన్ని రాష్ట్రాల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కొవిడ్ నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై అధికారులు తీసుకుంటున్న చర్యలు, వారి అనుభవాలను ప్రధాని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ కరోనా వ్యాప్తి కారణంగా దేశవ్యాప్తంగా అధికారులందరికీ బాధ్యతలు పెరగడంతో పాటు సరికొత్త సవాళ్లు ఎదురవుతున్నాయన్నారు. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు సరికొత్త వ్యూహరచనలతో ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రెండో దశ కొవిడ్ వ్యాప్తిని ఎదుర్కొనేందుకు, మూడో దశ కొవిడ్‌కు అవకాశం లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని దిశా నిర్దేశం చేశారు. ప్రతి జిల్లాకు వేర్వేరు సవాళ్లు ఉంటాయని జిల్లాలో ఎదురవుతున్న సమస్యలు అధికారులకే తెలుసన్నారు. రెండో దశ కొవిడ్ వ్యాప్తి నేపధ్యంలో ప్రతిఒక్కరూ ప్రభుత్వ నిబంధనలతో పాటు స్వీయజాగ్రత్తలు తీసుకోనేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో కడప కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి కలెక్టర్ హరికిరణ్‌తో పాటు, జేసీ సాయికాంత్‌వర్మ, డీఎంహెచ్‌వో డాక్టర్ అనిల్‌కుమార్, డీఐఓ డాక్టర్ మల్లీశ్వరి, కొవిడ్ టెస్టింగ్ అధికారి డాక్టర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు