కరోనా వైద్యం ఇక చేయలేం..

ABN , First Publish Date - 2021-05-31T05:21:30+05:30 IST

కొవిడ్‌ సెకండ్‌వేవ్‌ జిల్లాను గడగడలాడిస్తోంది. తీవ్ర లక్షణాలు కనిపించడంతో ఆసుపత్రిలో చేరే బాధితుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. చాలామందికి ఆక్సిజన అవసరమైంది. చిన్న,

కరోనా వైద్యం ఇక చేయలేం..

తనిఖీల పేరుతో వేధింపులు

మమ్మల్ని దొంగల్లా చూస్తున్నారు

డాక్టర్లు, నర్సులు, సిబ్బంది జీతభత్యాలు రె ట్టింపయ్యాయి

ప్రభుత్వ ధరలకు కరోనా వైద్యం ఎలా సాధ్యం..?

కలెక్టర్‌కు లేఖ రాసిన ప్రైవేటు ఆసుపత్రులు


జిల్లాను వణికిస్తున్న డేంజర్‌ వైరస్‌ కరోనాకు వైద్యం చేయలేమంటూ కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు చేతులెత్తేశాయి. ప్రభుత్వం సూచించిన ధరలకు కరోనా వైద్యం చేస్తే అప్పులపాలవుతాం.. సిబ్బంది వేతనాలు రెండింతలు పెరిగాయి. తనిఖీల పేరుతో అవమానాలకు గురవుతున్నాం. మేం కరోనా ట్రీట్‌మెంటు చేయలేమంటూ కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఆరు ప్రైవేటు ఆసుపత్రులు వివిధ  కారణాలు చూపుతూ కరోనా వైద్యసేవలు చేయలేమని తేల్చి చెప్పేశారు. ఇప్పుడీ వ్యవహారం కడపలో హాట్‌టాపిక్‌గా మారిపోయింది. 


కడప, మే 30 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ సెకండ్‌వేవ్‌ జిల్లాను గడగడలాడిస్తోంది. తీవ్ర లక్షణాలు కనిపించడంతో ఆసుపత్రిలో చేరే బాధితుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. చాలామందికి ఆక్సిజన అవసరమైంది. చిన్న, పెద్ద తేడా లేకుండా కరోనా బారిన  పడే వారి సంఖ్య పెరిగిపోయింది. దీంతో కడ ప రిమ్స్‌, ఫాతిమాతో పాటు ప్రొద్దుటూరు, పులివెందుల ప్రభుత్వాసుపత్రులతో పాటు ప్రైవేటు ఆసుపత్రులలో వైద్యానికి అనుమతించారు. ఆరోగ్యశ్రీ ద్వారా కొన్ని ప్రైవేటు ఆసుపత్రులకు కేటాయించాయి. ప్రభుత్వ, ప్రైవేటు కలుపుకుని పై ఆసుపత్రులు చికిత్సలందిస్తూ వచ్చేవి. పదిరోజుల క్రితం వరకూ కూడా ఆక్సిజన బెడ్లకు తీవ్ర డిమాండ్‌ ఉండేది. పాజిటివ్‌ వచ్చి ఆక్సిజన అవసర మైన వారికి బెడ్డు దొరికితే చాలనే పరిస్థితి నెలకొంది. బెడ్ల కోసం పెద్ద ఎత్తున సిఫారసులు కూడా చేయించుకున్నారు.


ప్రభుత్వ ధరలు ఇవే

ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా ట్రీట్‌మెంటుకు ప్రభుత్వం ధరలను కేటాయించి రెండు కేటగిరీలుగా విభజించింది. నేషనల్‌ అక్రిడేటెడ్‌ బోర్డ్‌ ఆఫ్‌ హాస్పిటల్‌ (ఎనఏబీహెచ) నాన ఎనఏబీహెచగాలుగా విభజించి రేట్లను ఖరారు చేసింది. నాన క్రిటికల్‌ కొవిడ్‌కు ఎనఏబీఎహెచలో రోజుకు రూ.4 వేలు, నాన ఎనఏబీహెచలో రూ.3600, నాన క్రిటికల్‌ ఓ-2 ఎనఏబీహెచలో రూ.6500, నాన ఎనఏబీహెచలో రూ.5850, క్రిటికల్‌ ఐసీయూ ఎనఏబీహెచలో రూ.12 వేలు, నాన ఎనఏబీహెచలో రూ.10,800, క్రిటికల్‌ ఐసీయూ వెంటిలేటర్‌ ఎనఏబీహెచలో రూ.16 వేలు, నాన ఎనఏబీహెచలో రూ.14,400గా ప్రభుత్వం ధర నిర్ణయించింది. అంతకు మించి ఒక్క పైసా నుంచి వసూలు చేసినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. 


ప్రభుత్వ ధరలకు వైద్యం చేయలేం

ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు కరోనా వైద్యం తమకు భారంగా మారుతోందని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాల వారు చెబుతున్నారు. కొవిడ్‌ బాధితులకు ట్రీట్‌మెంటు ఇచ్చే వైద్యులు ఇతర సిబ్బంది జీతభత్యాలు రెండింతలకు పైగా పెరిగాయి. కొవిడ్‌ ముందు జనరల్‌ సర్జనకు రూ.40 వేలు ఇస్తుంటే కొవిడ్‌ ట్రీట్‌మెంటుకు రూ.లక్ష అడుగుతున్నారు. డ్యూటీ డాక్టర్లు, నర్సులు ఇతర  సిబ్బంది సెక్యూరిటీ గార్డ్సు, బాయిస్‌, స్వీపర్స్‌ వీరంతటికీ రెండింతలకు పైగా జీతం ఇవ్వాల్సి వస్తోంది. ప్రాణాంతక వ్యాధి కావడంతో విధులు నిర్వహించేందుకు సిబ్బంది ముందుకు రావడం లేదు. దీంతో ప్రభుత్వం సూచించిన ధరకు వైద్యం చేయాలంటే భారంగా మారుతోంది. దీంతో పాటు తనిఖీల పేరుతో వైద్యరంగానికి సంబంధం లేని అధికారులు వచ్చి ఇబ్బంది పెడుతున్నారు. మమ్మల్ని దొంగలుగా చూపిస్తున్నారని, ఇది చాలా అవమానకరంగా ఉందని కొందరు చెబుతున్నారు. కొందరు రకరకాల కారణాలు చూపుతూ వైద్య సేవలు అందించలేమని లేఖ రాశారు. కడపలో సిటీకేర్‌, మెడికేర్‌, పల్లాభాస్కర్‌, లైఫ్‌లైన, ఆర్‌ఆర్‌ ఆసుపత్రులకు, బద్వేలులోని శ్రీనివాస హాస్పిటల్‌లో వైద్య సేవలు చేయలేమని కలెక్టరుకు లేఖ రాశారు. ప్రస్తుతం జిల్లాలో 20 ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. 

Updated Date - 2021-05-31T05:21:30+05:30 IST