వైసీపీలో భగ్గుమన్న విభేదాలు

ABN , First Publish Date - 2021-12-29T05:25:13+05:30 IST

సాక్షాత్తూ.. రాజంపేట ఎంపీ మిఽథున్‌రెడ్డి, ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ అమర్‌నాధరెడ్డిల సాక్షిగా మంగళవారం సుండుపల్లె మండలంలో అధికార పార్టీ వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి.

వైసీపీలో భగ్గుమన్న విభేదాలు
సుండుపల్లె మండల మీట్‌లో గొడవ పడుతున్న ఆకేపాటి, మేడా వర్గీయులు

సుండుపల్లె మండల సమావేశం రసాభాసా

పోలీసుల జోక్యంతో.. సద్దుమణిగిన గొడవ


రాయచోటి / సుండుపల్లె, డిసెంబరు 28: సాక్షాత్తూ.. రాజంపేట ఎంపీ మిఽథున్‌రెడ్డి, ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ అమర్‌నాధరెడ్డిల సాక్షిగా మంగళవారం సుండుపల్లె మండలంలో అధికార పార్టీ వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. మేడా మల్లికార్జునరెడ్డి వర్గం, అమర్‌నాధరెడ్డి వర్గం బాహాబాహీకి దిగాయి. పోలీసులు జోక్యం చేసుకోవడంతో.. సమస్య సద్దుమణిగింది. వివరాల్లోకి వెళితే..

మంగళవారం సుండుపల్లె మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ మండలానికి వైసీపీ ఇన్చార్జిగా మేడా విజయశేఖర్‌రెడ్డి ఉన్నారు. ఈయన సమావేశంలో వేదికపై కూర్చున్నారు. దీంతో ఈయనకు వ్యతిరేకంగా మండల సర్వసభ్య సమావేశంలో అమర్‌నాధరెడ్డి వర్గీయులు తొలుత కేకలు వేశారు. పార్టీ కోసం ముందు నుంచి పనిచేస్తున్న వారిని పక్కన పెట్టి.. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వారికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. ఏ హోదాతో విజయశేఖర్‌రెడ్డి సమావేశంలో వేదిక మీద ఉన్నారని ప్రశ్నించారు. దీంతో ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. ఒకరిపై మరొకరు దాడులకు పాల్పడ్డారు. పిడిగుద్దులు గుద్దుకున్నారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి.. ఇరు వర్గాలను చెదరగొట్టారు. 

అనంతరం సోమవారం తనకు, మేడా విజయశేఖర్‌రెడ్డికి మధ్య వివాదం జరిగిందని ఎంపీపీ రాజమ్మ ఎంపీకి ఫిర్యాదు చేశారు. పేరుకు మాత్రం తాము ప్రజా ప్రతినిధులుగా ఉన్నామని, తమకు తెలియకుండానే.. మండలంలో పనులు జరుగుతున్నాయని, బిల్లులు పెడుతున్నారని ఆమె ఫిర్యాదు చేశారు. అమర్‌నాధరెడ్డితో ఈ విషయం మాట్లాడానన్నారు. అయితే మాకు వ్యతిరేకంగా గ్రూపు చేస్తున్నావా ..? అంటూ విజయశేఖర్‌రెడ్డి తనను హెచ్చరించారని ఆమె పేర్కొన్నారు. పార్టీలో కష్టపడి పనిచేస్తున్న వారికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని, ఇతర పార్టీలకు చెందిన వారికే పనులు జరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర సోషియల్‌ వెల్ఫేర్‌ డైరెక్టర్‌ అజంతమ్మ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వంలోనే తమకు అవమానాలు ఎదురవుతున్నాయని అన్నారు. మేడా విజయశేఖర్‌రెడ్డి ఎంపీపీ రాజమ్మను అవమానపర్చాడని అన్నారు. మేడా విజయశేఖర్‌రెడ్డి వల్ల పార్టీకి తీరని నష్టం జరుగుతోందని పలువురు ఎంపీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఎంపీ మిఽథున్‌రెడ్డి అందరి సమక్షంలోనే.. విజయశేఖర్‌రెడ్డితో ఆయా ఫిర్యాదులపై ప్రశ్నించారు. తాను చిన్న పిల్లవాడిని కాదని, తనకు అన్నీ తెలుసునని, పార్టీకి నష్టం జరిగే పనులు ఎందుకు చేస్తున్నావని నిలదీశారు.


గొడవకు ముందస్తుగానే ప్రణాళికా..? 

ఈ గొడవ జరగడానికి ముందస్తుగానే.. ప్రణాళిక జరిగిందా ? అని పలువురు వైసీపీ నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రెండు మూడు రోజులుగా వైసీపీలోని రెండు గ్రూపుల మధ్య జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందని పలువురు పేర్కొంటున్నారు. దాదాపు రెండు సంవత్సరలుగా మండలంలో ఎమ్మెల్యే, ఆయన వ్యతిరేక వర్గం తలపడుతున్న సంగతి తెలిసిందే. సాక్షాత్తూ.. ఎంపీ, ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్‌ సమక్షంలోనే.. ఘర్షణ జరగడంతో.. ముందుముందు ఇంకా ఏం జరుగుతుంతోనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-12-29T05:25:13+05:30 IST