పోటాపోటీగా నామినేషన్లు

ABN , First Publish Date - 2021-11-05T05:30:00+05:30 IST

జిల్లాలో రాజంపేట మునిసిపాలిటీ, కమలాపురం నగర పంచాయతీతో పాటు 7 ఎంపీటీసీ స్థానాలు, మూడు సర్పంచలు, లింగాల జడ్పీటీసీ, 39 వార్డులకు 3వ తేదీన రిటర్నింగ్‌ అధికారులు నోటిఫికేషన జారీ చేశారు.

పోటాపోటీగా నామినేషన్లు
రాజంపేటలో నామినేషన దాఖలు చేసిన టీడీపీ చైర్మన అభ్యర్థి చెన్నూరు సుధాకర్‌

రాజంపేట మున్సిపాలిటీకి 290, కమలాపురంకు 110 

ఎంపీటీసీ, వార్డు సభ్యులకు 51

ముగిసిన నామినేషన్ల పర్వం 

నేడు పరిశీలన, 7న వితడ్రాలకు చివరి తేదీ 


రాజంపేట మునిసిపాలిటీ, కమలాపురం నగరపంచాయతీతో పాటు ఖాళీగా ఉన్న ఎంపీటీసీ, పంచాయతీ వార్డుల నామినేషన్ల పర్వం శుక్రవారంతో ముగిసింది. చివరిరోజు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికలు జరిగే మునిసిపాలిటీలలో అత్యధిక వార్డులు ఏకగ్రీవం చేసుకోవాలని వైసీపీ కీలక నేతల ఎత్తులను టీడీపీ నాయకులు బ్రేక్‌ చేశారు. ఒక్కో వార్డుకు ఇద్దరు ముగ్గురు చొప్పున నామినేషన్లు వేశారు.


కడప, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రాజంపేట మునిసిపాలిటీ, కమలాపురం నగర పంచాయతీతో పాటు 7 ఎంపీటీసీ స్థానాలు, మూడు సర్పంచలు, లింగాల జడ్పీటీసీ, 39 వార్డులకు 3వ తేదీన రిటర్నింగ్‌ అధికారులు నోటిఫికేషన జారీ చేశారు. అదే రోజు నామినేషన్ల స్వీకరణకు శ్రీకారం చుట్టారు. తొలి రోజు పెద్దగా నామినేషన్లు దాఖలు కాలేదు. రెండవ రోజు దీపావళి పర్వదినం, అమావాస్య కావడంతో నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు ముందుకు రాలేదు. చివరిరోజు పోటాపోటీగా నామినేషన్లు వేశారు.


రాజంపేట మున్సిపాలిటీలో...

రాజంపేట మునిసిపాలిటీలో 29 వార్డులు ఉన్నాయి. రెండు రోజులుగా 64 నామినేషన్లు వేయగా చివరి రోజు శుక్రవారం మాత్రమే 225 నామినేషన్లు వచ్చాయి. మొత్తంగా వైసీపీ 101 నామినేషన్లు దాఖలు చేయగా టీడీపీ 108 నామినేషన్లు దాఖలు చేసింది. బీజేపీ అభ్యర్థులు 17, జనసేన 12, స్వతంత్రులు 52మంది నామినేషన్లు వేశారు. మూడు రోజులుగా టీడీపీ ఇనచార్జి బత్యాలచెంగల్‌రాయులు రాజంపేటలోనే తిష్టవేశారు. అధికార పార్టీ ఎత్తులను చిత్తు చేస్తూ అన్నివార్డులకు అభ్యర్థులను నిలిపారు. పరిశీలన, నామినేషన్ల వితడ్రా రోజున వైసీపీ నాయకులు బెదిరింపు, దౌర్జన్యాలకు పాల్పడి టీడీపీ అభ్యర్థులను వితడ్రా చేయించే అవకాశంఉందని ముందే పసిగట్టిన బత్యాల ఒక్కోవార్డుకు రెండుమూడు నామినేషన్లు వేయించడం కొసమెరుపు. వైసీపీని బలంగా ఢీకొట్టి మెజారిటీ వార్డుల్లో పాగా వేయాలన్న లక్ష్యంగా టీడీపీ ముందుకు వెళుతోంది. అయితే ఎక్కువ వార్డులను ఏకగ్రీవం చేసుకోవడానికి ప్రతిపక్ష అభ్యర్థులను వితడ్రా చేయించే దిశగా వైసీపీ నాయకులు అప్పుడే పావులుకదుపుతున్నారు. దీంతో 7వ తేదీ ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమవుతుందోనని రాజకీయంగా పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


కమలాపురంలో..

కమలాపురం నగర పంచాయతీలో 20 వార్డులకు అధికార పార్టీ వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. నగర పంచాయతీ కార్యాలయం వద్ద ఆయా పార్టీల అభ్యర్థులు, పోలీసు బందోబస్తుతో సందడి నెలకొంది. వైసీపీ నుంచి 43 మంది, టీడీపీ 54మంది, సీపీఐ ఇద్దరు, జనసేన నలుగురు, స్వతంత్రులు ఏడుగురు నామినేషన్లు వేశారు. ఉదయం 11గంటలకే పెద్ద సంఖ్యలో అభ్యర్థులు చేరుకోవడంతో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి నామినేషన వేసేందుకు మూడు గంటల వరకు అవకాశమిచ్చారు. ఆ సమయం వరకు ఆఫీసు ప్రాంగణంలోకి వచ్చిన అభ్యర్థులందరి చేత నామినేషన్లు స్వీకరించారు. వైసీపీ అభ్యర్థులను ఎమ్మెల్యే రవీంద్రనాఽథరెడ్డి ముందే ఎంపిక చేస్తే టీడీపీ అభ్యర్థులను వ్యూహాత్మకంగా టీడీపీ ఇనచార్జి పుత్తా నరసింహారెడ్డి శుక్రవారం నేరుగా రిటర్నింగ్‌ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఒక్కో వార్డుకు ఇద్దరు లేదా ముగ్గురి చేత నామినేషన్లు వేయించారు. లేనిపోని కారణాలతో నామినేషన్లు తిరస్కరించడం, భయపెట్టి, బతిమలాడి టీడీపీ అభ్యర్థులను వితడ్రా చేయించే అవకాశం ఉండటంతో ఎక్కువ మందిని బరిలోకి దించినట్లు తెలుస్తోంది. టీడీపీ ఇనచార్జి పుత్తా నరసింహారెడ్డి, కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు లింగారెడ్డి, ఎమ్మెల్సీ బీటెక్‌ రవి, పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శులు హరిప్రసాద్‌, రెడ్యం వెంకటసుబ్బారెడ్డి తదితరులు పుత్తాకు మద్దతుగా కమలాపురం చేరుకున్నారు. అభ్యర్థులందరి చేత నామినేషన్లు వేయించారు. రేపటి నుంచి ప్రచారాన్ని ముమ్మరం చేస్తామని, అన్ని వార్డుల్లో టీడీపీని గెలిపించుకునేందుకు కృషి చేస్తామని పుత్తా నరసింహారెడ్డి పేర్కొన్నారు.


మళ్లీ ఎన్నికల బహిష్కరణ

ఏడు ఎంపీటీసీ స్థానాలు, మూడు సర్పంచలు, 39 పంచాయతీ వార్డులు, లింగాల జడ్పీటీసీ స్థానానికి నామినేషన్ల పర్వం ముగిసింది. కె.సుగుమంచిపల్లె-1, 2, ఓబన్నపేట ఎంపీటీసీ స్థానాలకు, సుగుముంచిపల్లె పంచాయతీ సర్పంచతో పాటు 14 వార్డులకు జరగాల్సిన ఎన్నికలను ఆయా గ్రామస్థులు మళ్లీ బహిష్కరించారు. గండికోట జలాశయంలో దత్తాపురం, బుక్కపట్నం, బొమ్మేపల్లె పంచాయతీలు ముంపునకు గురయ్యాయి. ఆయా గ్రామాల పునరావాస కాలనీలను కొండాపురం మండలం కె.సుగుమంచిపల్లె రెవెన్యూ గ్రామం ఆనుకొని నిర్మాణం చేశారు. ఆ పంచాయతీ పక్కనే పునరావాసం నిర్మించడంతో అన్నింటినీ కలిపి ఒకే పంచాయతీగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేశారు. ప్రస్తుతం ఆ పంచాయతీలో 4500మంది ఓటర్లు ఉన్నారు. గండికోట నిర్మాణానికి ముందు కె.సుగుమంచిపల్లె, దత్తాపురం, బుక్కపట్నం, బొమ్మేపల్లె పంచాయతీలకు వేర్వేరుగా ఎన్నికలు జరిగేవి. ప్రస్తుతం పునరావాసం పేరుతో ఒకే గ్రామం దగ్గర కాలనీలు నిర్మించి ఒకే పంచాయతీకి ఎన్నికలు నిర్వహించడం ఎంతవరకు సబబని, పాత పంచాయతీల తరహాలో ఎన్నికలు జరపాలని డిమాండ్‌ చేస్తూ ఎంపీటీసీ, పంచాయతీ ఎన్నికలు బహిష్కరించారు. ఇలా బహిష్కరించడం ఇది రెండవసారి. ఇక ఎన్నికలు జరుగుతున్న లింగాల జడ్పీటీసీ స్థానానికి మూడు నామినేషన్లు, ఒంటిమిట్ట మండలం కొత్తమాధవరం ఎంపీటీసీ స్థానానికి ఇద్దరు వైసీపీ అభ్యర్థులు, టి.సుండుపల్లె మండలం రాయవరం ఎంపీటీసీ స్థానానికి వైసీపీ, స్వతంత్య్ర అభ్యర్థులు ఇద్దరు, లింగాల మండలం మురారిచింతల ఎంపీటీసీ స్థానానికి వైసీపీ తరపున ఒక నామినేషన మాత్రమే దాఖలయ్యాయి. అలాగే వేంపల్లె మండలం రామిరెడ్డిపల్లె పంచాయతీ సర్పంచ స్థానానికి 1, లింగాల మండలం కోమనూతల పంచాయతీ సర్పంచకి రెండు నామినేసన్లు దాఖలయ్యాయి. మొత్తం 39 వార్డులకు 51 నామినేషన్లు వచ్చాయి. వచ్చిన నామినేషన్లను శనివారం పరిశీలించనున్నారు. నామినేషన్ల వితడ్రాకు 7వ తేదీ చివరి రోజు.

Updated Date - 2021-11-05T05:30:00+05:30 IST