పట్టా(క్కా)గా.. ముంచేశారు..!?

ABN , First Publish Date - 2021-07-12T05:30:00+05:30 IST

కడప నగర జనాభా 4.10 లక్షలు. విస్తీర్ణం 164.08 చ.కిలో మీటర్లు. నగరపాలక సంస్థగా 2006లో ఏర్పడింది. జనాభాతో పాటు నగరం రోజురోజుకు విస్తరిస్తోంది. స్థిరాస్తి విక్రయాలు కూడా పెరిగాయి.

పట్టా(క్కా)గా.. ముంచేశారు..!?
కాలనీలో చేరిన పక్కీరుపల్లె చెరువు నీరు

ఆక్రమణలో నగర చెరువులు

అలుగు, కాలువలు సైతం కబ్జా

రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లలో కలిపేసి విక్రయాలు

పక్క సర్వే నంబర్లతో రిజిస్ట్రేషన

చెరువు అలుగు పొంగి కాలనీలను ముంచెత్తుతున్న వైనం

అక్రమార్కులకు వైసీపీ కీలక నేతల అండ

ఆక్రమిత స్థలం రూ.75 కోట్లు


పక్కీరుపల్లి చెరువు అలుగు (సర్‌ప్లస్‌ వియర్‌) పక్కనే విద్యుత సబ్‌ స్టేషన నిర్మించారు. చెరువు నిండితే.. అలుగు దాటి వర్షపునీరు ప్రవహించే ప్రాంతం అన్యాక్రాంతం అయింది. నీటి ప్రవాహం కోసం ఏర్పాటు చేసిన కాలువను కూడా ఇటీవల ఓ నాయకుడు మూసేశారు. దీంతో వరద నీరంతా ఎటుబడితే అటు ప్రవహించి కాలనీలను ముంచెత్తుతోంది. నగర పరిధిలోని ప్రతి చెరువు పరిస్థితి ఇదే. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కొందరు సర్‌ప్లస్‌ కోర్సు, వంకలు కబ్జా చేసి సమీపంలోని సర్వే నంబర్లుతో రిజిస్ట్రేషన చేయిస్తున్నారు. అక్రమార్కులకు అధికార వైసీపీ కీలక నాయకుల అండ ఉండడడంతో అధికారులు చూసీచూడనట్టు ఉంటున్నారు. వానొస్తే నగరం జలదిగ్భంధం అవుతోంది. చెరువుల ఆక్రమణలపై క్షేత్రస్థాయి పరిశీలన కథనం.


(కడప-ఆంధ్రజ్యోతి): కడప నగర జనాభా 4.10 లక్షలు. విస్తీర్ణం 164.08 చ.కిలో మీటర్లు. నగరపాలక సంస్థగా 2006లో ఏర్పడింది. జనాభాతో పాటు నగరం రోజురోజుకు విస్తరిస్తోంది. స్థిరాస్తి విక్రయాలు కూడా పెరిగాయి. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు జోరందుకున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నా.. నగర పరిధిలో చెరువుల కడతూము (సర్‌ప్లస్‌ వియర్‌)కు అనుసంధానంగా ఉండే కాలువలు, చెరువుల్లోకి నీరొచ్చే దారులు, చెరువు స్థలం ఆక్రమణకు గురయ్యాయి. చెరువు నిండాక అదనపు వర్షపు నీరు ప్రవహించే కాలువలకు ఇరువైపులా కబ్జాకు గురికావడంతో ఆర్టీసీ బస్టాండ్‌, వై జంక్షన, ఎన్జీఓ కాలనీ, ఏఎ్‌సఆర్‌ నగర్‌, ఎస్‌బీఐ కాలనీ, ప్రకాష్‌ నగర్‌, జయనగర్‌ జలదిగ్బంధమై చెరువులను తలపిస్తున్నాయి. సామాన్య జనం పడే అవస్థలు ఎన్నో. 


కబ్జా కోరల్లో కాలువలు..

నగర పరిధిలో మైనర్‌ ఇరిగేషనకు చెందిన పక్కీరుపల్లి చెరువు, మృత్యుంజయ కుంట, పట్లంపల్లి, ఊటకూరు, బుడ్డాయపల్లి, చెర్లోపల్లి, ముత్తరాజుపల్లి, కొండాయపల్లి, రామన్న చెరువు, గురివిరెడ్డి కుంట, బచ్చారమ్మ చెరువులున్నాయి. వీటి విస్తీర్ణం 155.22 ఎకరాలు. వీటికి అనుబంధంగా వర్షపు నీరు చెరువులకు చేర్చే కాలువలు (ఫీడర్‌ చానల్స్‌), చెరువు నిండాక వర్షపు నీరు బయటకు వెళ్లేందుకు దారులు (సర్‌ప్లస్‌ కోర్సులు), వంకలు, తూములు ఉన్నాయి. కొన్ని చెరువులకు కాల్వలు కూడా ఉన్నాయి. కడప నగరం మొత్తం పాలకొండ దిగువ ప్రాంతంలో ఉంది. పాలకొండల్లో కురిసే వర్షపు నీరు వంకలు, వాగుల ద్వారా చెరువుల్లో చేరుతుంది. చెరువులు నిండిన తరువాత అదనపు వర్షపు నీరు సర్‌ప్లస్‌ కోర్సు గుండా బుగ్గ వంకకు.. అక్కడి నుంచి పెన్నా నదిలో కలుస్తుందని మైనర్‌ ఇరిగేషన ఇంజనీర్లు తెలిపారు. ముప్పాతిక శాతం సర్‌ప్లస్‌ కోర్సు, వంకల ఇరు వైపుల, కొంత భాగం చెరువు ఫోర్‌షోర్‌ ఏరియా కబ్జాకు గురైందని ఇంజనీర్లే అంటున్నారు. 


అక్రమార్కులకు అధికార పార్టీ నేతల అండ

నగరం ఏమైతే మాకేంటి..? అనుకున్నారో ఏమో..! చెరువు భూముల అక్రమణదారులకు అధికార పార్టీ కీలక నేతలు కొందరి అండదండలు ఉన్నాయనే ఆరోపణలు లేకపోలేదు. వంకలు, సర్‌ప్లస్‌ కోర్సు, చెరువు ఫోర్‌షోర్‌ ఏరియాలను ఆనుకొని ప్రైవేటు భూముల్లో రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు వేస్తున్నారు. ఆ వెంచర్లలో వంకలు, చెరువు ప్రభుత్వ భూములు కూడా కలిపేసి ప్లాట్లు విక్రయిస్తున్నట్లు సమాచారం. చెరువు స్థలాల్లో వేసిన ప్లాట్లకు సమీప ప్రైవేటు సర్వే నంబర్లతో రిజిస్ట్రేషన చేయిస్తున్నారు. ఈ ప్లాట్లు కొనుగోలు చేసిన ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇలా సుమారు 25 ఎకరాలకు పైగా కబ్జాకు గురై ఉంటుందని అధికారిక అంచనా. వీటి విలువ రూ.50-75 కోట్లకు పైగా ఉంటుందని ఓ అధికారి పేర్కొనడం కొసమెరుపు. 2009, 2015లో, గత ఏడాది, ప్రస్తుతం చెరువులు నిండడంతో ఈ చెరువుల సమీపంలోని కాలనీలు జలమయమయ్యాయి. ఆక్రమణలను తొలగించడంలో రెవిన్యూ, మైనర్‌ ఇరిగేషన, కార్పొరేషన అధికారుల మధ్య సమన్వయలోపం నగరవాసులకు శాపంగా మారింది. 


ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఎలా ఇచ్చారు..?

చెరువులు, పర్‌ప్లస్‌ కోర్సు, వంక పరంబోకు స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలకు టౌన ప్లానింగ్‌ అధికారులు అనుమతి ఇవ్వకూడదని అధికారులే అంటున్నారు. కబ్జా స్థలాల్లో సైతం ఇళ్ల నిర్మాణాలకు నగరపాలక టౌన ప్లానింగ్‌ అనుమతి ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. దీంతో ప్రధాన డైన్లు, వరద కాలువలు ఆక్రమణకు గురికావడంతో చిన్నపాటి వానొచ్చినా నగరం జలదిగ్భంఽధం అవుతోందని పలువురు ఆరోపిస్తున్నారు.


ఆక్రమణలు వాస్తవమే

- వెంకట్రామయ్య, ఈఈ, మైనర్‌ ఇరిగేషన, కడప

కడప నగర పరిధిలో ఉన్న చెరువుల సర్‌ప్లస్‌ కోర్సు, ఫోర్‌షోర్‌ ఏరియా, వంకలు కబ్జాకు గురైన మాట వాస్తవమే. ఇదే విషయాన్ని పలుమార్లు రెవిన్యూ అధికారులకు ఫిర్యాదు కూడా చేశాం. వంకలు, సర్‌ప్లస్‌ ఏరియాలో ప్లాట్లు వేసి సమీపంలోని ప్రైవేటు ల్యాండ్‌ సర్వే నంబర్లు వేసి రిజిస్ట్రేషన చేయిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. 


నగర పరిధిలోని చెరువుల విస్తీర్ణం ఎకరాల్లో (సుమారుగా)

------------------------------------

చెరువు విస్తీర్ణం

------------------------------------

పుట్లంపల్లి 12.39

ఊటకూరు 27.85

బుడ్డాయపల్లి 33.86

ముత్తరాజుపల్లి 6.54

రామరాజుపలి 5.31

కొండాయపల్లి 9.98

రామన్న చెరువు 12.39

చెర్లొపల్లె చెరువు 14.65

గురివిరెడ్డి కుంట 13.40

బచ్చరమ్మ చెరువు 18.85

పక్కీరుపల్లి --

మృత్యుంజయకుంట --

------------------------------------

మొత్తం 155.22

------------------------------------Updated Date - 2021-07-12T05:30:00+05:30 IST