జిల్లా అంతటా క్రిస్మస్‌ వేడుకలు

ABN , First Publish Date - 2021-12-26T05:41:49+05:30 IST

జిల్లా అంతాట క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. క్రీస్తు జననం మానవాళికి అద్భుత వరమని, ఆయన రాకతో లోకాన ఒక నూతన వెలుగు ప్రసరించిందని ఫాదర్‌ జ్ఞానప్రకాశం, ఆరోగ్యమాత పుణ్యక్షేత్రం డైరెక్టర్‌,

జిల్లా అంతటా క్రిస్మస్‌ వేడుకలు
పులివెందుల సీఎస్‌ఐ చర్చిలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న సీఎం వైఎస్‌ జగన, ఆయన తల్లి వైఎస్‌ విజయలక్ష్మి తదితరులు

క్రిస్మస్‌ ప్రత్యేక ప్రార్థనల్లో సీఎం

కుటుంబ సభ్యులతో సీఎస్‌ఐ చర్చికి

కేక్‌ కట్‌ చేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన జగన 

పులివెందుల, డిసెంబరు 25: ముఖ్యమంత్రి వైఎస్‌ జగనమోహనరెడ్డి పులివెందుల సీఎస్‌ఐ చర్చిలో క్రిస్మస్‌ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన క్రిస్మస్‌ పురస్కరించుకొని మూడు రోజుల పాటు జిల్లా పర్యటనకు వచ్చారు. మూడవ రోజు శనివారం ఉదయం 9:30 గంటలకు ఇడుపులపాయ నుంచి పులివెందులకు హెలికాప్టర్‌ ద్వారా వచ్చారు. హెలిప్యాడ్‌ వద్ద నుంచి సీఎస్‌ఐ చర్చి వద్దకు 9:43గంటలకు చేరుకున్నారు. అప్పటికే తల్లి విజయలక్ష్మి, సతీమణి భారతి, వైఎస్‌ ప్రతాప్‌రెడ్డి, వైఎస్‌ మనోహర్‌రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌రెడ్డి తదితరులు అక్కడకు చేరుకున్నారు. సీఎస్‌ఐ చర్చిలో క్రిస్మస్‌ ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమాల్లో జగన పాల్గొన్నారు. ప్రార్థనల అనంతరం కేక్‌ కట్‌ చేసి పులివెందుల మాజీ ఎమ్మెల్యే వైఎస్‌ విజయలక్ష్మికి, బంధువులకు తినిపించారు. ఈ సందర్భంగా తల్లి విజయలక్ష్మి జగనను ముద్దాడారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులు వైఎస్‌ జగన ఒడిలో కూర్చుని ఫొటోలు దిగారు. అనంతరం నూతన క్యాలెండర్‌, డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికి క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం 10:45 గంటలకు చర్చి నుంచి సీఎం బయటకు వచ్చారు. అక్కడి నుంచి హెలిప్యాడ్‌కు చేరుకొని హెలికాప్టర్‌ ద్వారా కడపకు అక్కడి నుంచి గన్నవరం వెళ్లారు. ప్రార్థనా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన సమయంలో సీఎం సీఎస్‌ఐ చర్చి న్యూ కాంప్లెక్స్‌ ప్రారంభ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా, మంత్రి ఆదిమూలపు సురేశ, కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంతరెడ్డి, ఎమ్మెల్సీలు రమేశయాదవ్‌, కల్పలత, జడ్పీ చైర్మన అమర్‌నాథరెడ్డి, కడప మేయర్‌ సురేష్‌బాబు, కలెక్టర్‌ విజయరామరాజు, జేసీలు గౌతమి, సాయికాంతవర్మ, ధ్యాన్‌చంద్ర, ఎస్పీ అన్బురాజన, ఫాదర్‌ ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. 


కడప (మారుతీనగర్‌), డిసెంబరు 25: జిల్లా అంతాట క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. క్రీస్తు జననం మానవాళికి అద్భుత వరమని, ఆయన రాకతో లోకాన ఒక నూతన వెలుగు ప్రసరించిందని ఫాదర్‌ జ్ఞానప్రకాశం, ఆరోగ్యమాత పుణ్యక్షేత్రం డైరెక్టర్‌, ఫాదర్‌ అబ్రహాం పేర్కొన్నారు. క్రిస్మస్‌ను పురస్కరించుకొని కడప రైల్వేస్టేషన్‌ సమీపంలో గల ఆరోగ్యమాత పుణ్యక్షేత్రంలో వారు విశ్వాసులనుద్దేశించి దైవసందేశం వినిపించారు. ప్రపంచవ్యాపితంగా సకల జాతి జనులు నిర్వహించుకునే ఏకైక పండుగ క్రీస్తు జయంతి క్రిస్మస్‌ అన్నారు. యేసు ప్రభువుకు జన్మనిచ్చిన మరియతల్లి ఎంతో ధన్యురాలని కాలగమనంలో తరాలు మారుతున్నా ప్రజలు ఆ తల్లిని ఎప్పటికీ మరువలేరన్నారు. నీవలే నీ పొరుగువారిని ప్రేమించమని, ఈ జీవితం దేవుడిచ్చిన భిక్ష అని కావున చెడు మార్గంలో కాకుండా మంచి మార్గంలో నడిచి తద్వారా ఇతరులకు ఆదర్శవంతగా జీవించాలని కోరారు. ముఖ్యంగా బాలయేసును దర్శించడం ద్వారా మన జీవితాలలో శాంతి, సమాదానం సిద్దించగలదన్నారు. అనంతరం క్రిస్మ్‌స్‌ కేక్‌ కట్‌ చేసి అందరికీ పంచిపెట్టారు. తదుపరి దివ్యబలిపూజను సమర్పించారు. కార్యక్రమంలో గురువులు రాజేష్‌, సహాయక గురువులు బాలశౌరి, విచారణ కమిటీ సభ్యులు, విశ్వాసులు పాల్గొన్నారు.


కన్నుల పండువగా బాలయేసు జన్మదిన వేడుకలు

బాలయేసు పుట్టినరోజును జిల్లా వ్యాప్తంగా క్రైస్తవులు అత్యంత భక్తిశ్రద్ధలతో కన్నులపండువగా జరుపుకున్నారు. చర్చిలలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన పశువుల పాకలో జన్మించిన బాలయేసును చూసేందుకు విశ్వాసులు తరలివచ్చారు. ఈ సందర్భంగా చర్చిలలో కేక్‌లు కట్‌చేసి పంచుకున్నారు. ఆ మేరకు నగరరంలోని మరియాపురం, సీఎస్‌ఐ చర్చి, రైల్వేస్టేషన్‌ సమీప ఆరోగ్యమాతచర్చి, ప్రకాశ్‌నగర్‌, అశోక్‌నగర్‌, పాతకలెక్టరేట్‌, తదితర చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఇందులో విశ్వాసులతో పాటుగా వివిధ మతాలకు చెందిన వారు హాజరై క్రీస్తు సందేశాన్ని విన్నారు. ప్రార్థనల అనంతరం ఫాదర్ల ఆశీర్వాదాలు తీసుకొని ఒకరికొకరు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. జిల్లా వ్యాప్తంగా చర్చిలన్నీ క్రీస్తు విశ్వాసులతో కిటకిటలాడాయి.



Updated Date - 2021-12-26T05:41:49+05:30 IST