బ్లాక్‌ ఫంగస్‌కు చెక్‌ పెట్టండిలా!

ABN , First Publish Date - 2021-05-21T16:07:29+05:30 IST

ప్రస్తుతం కొవిడ్‌ మహమ్మారితో..

బ్లాక్‌ ఫంగస్‌కు చెక్‌ పెట్టండిలా!

కడప: ప్రస్తుతం కొవిడ్‌ మహమ్మారితో ప్రభుత్వం, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీనిని మించి బ్లాక్‌ ఫంగస్‌ అందరినీ భయపెడుతోంది. జిల్లాలో సైతం ముగ్గురు దీనిబారిన పడ్డారు. బ్లాక్‌ఫంగస్‌ సోకితే ముఖంపైన తీవ్ర ప్రభావం చూపుతుంది. అవసరం అయితే కన్ను, దవడ తొలగించాల్సి ఉంటుందని వైద్యులు అంటున్నారు. ఇలా చేసినా కొందరి ప్రాణాలు దక్కడం లేదు. ఈ వ్యాధి సోకితే ఆర్థికంగా కూడా భారమే. ఈ ఇబ్బందులన్నీ అధిగమించాలంటే నోటిని శుభ్రంగా ఉంచుకోవాలి. నోటిశుభ్రతతో 100 శాతం బ్లాక్‌ఫంగస్‌ దరి చేరదంటున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్‌) వైద్యులు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ మెడిసిన్‌ విభాగానికి చెందిన డాక్టర్‌ కె.మనోహర్‌ సూచనలు సలహాలు అందించారు.


బ్లాక్‌ఫంగస్‌ బారిన పడకూడదంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?

ప్రతి ఒక్కరూ నోటి శుభ్రత పాటించాలి. రోజూ రెండుసార్లు బ్రష్‌ చేయాలి. చిగుర్లు వాపులు లేకుండా చూసుకోవాలి. అలా ఎవరికైనా వాపు ఉంటే మెట్రోజెల్‌తో రుద్దుకోవాలి. పళ్లకు సంబంధించి ఏవైనా సమస్యలుంటే పంటి డాక్టర్‌కు చూపించాలి. అవసరం అయితే ఐదురోజులు యాంటిబయటిక్స్‌ వాడాలి. ఉదయం సాయంత్రం ఉప్పునీటితో పుక్కలించాలి.


ఈ వ్యాధి ఎవరికి సోకుతుంది..?

షుగర్‌ వ్యాధి ఉండి కరోనాతో చికిత్స పొందుతున్న వారు, చికిత్సనుంచి కోలుకున్న వారూ దీనిబారిన పడే అవకాశం ఉంది. ముఖ్యంగా వక్కాకు, మావా, ఖైనీ, పొగాకు, పాన్‌ మసాలా తినేవాళ్లలో షుగర్‌ లేకపోయినా ఈ వ్యాధి వస్తా ఉంది. ఇవి నమలడం వలన వీరి చిగుర్లు దెబ్బతిని ఉంటాయి. దీంతో వీరు బ్లాక్‌ఫంగస్‌ బారినపడే అవకాశాలు ఎక్కువ. 


షుగర్‌ ఉన్నవారు ఏం చేయాలి?

షుగర్‌ ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించాలి. తప్పనిసరిగా షుగర్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవాలి. నోటి శుభ్రత తప్పనిసరి.


ఒకవేళ బ్లాక్‌ఫంగస్‌ బారినపడితే..?

వీలయినంత త్వరగా డాక్టర్‌ను కలవాలి. ట్రీట్‌మెంట్‌ వెంటనే మొదలుపెట్టాలి. అలా తగ్గకపోతే ఎంత త్వరగా వీలైతే అంతత్వరగా ఆపరేషన్‌ చేసి ఇన్ఫెక్ట్‌ అయిన భాగాన్ని తీసేయాలి. ఒక్కోసారి కన్నుకూడా తీసేయాల్సి వస్తుంది. ఇదంతా చాలా శ్రమతో కూడుకున్న వ్యవహారం. బ్లాక్‌ఫంగస్‌ వ్యాధికి వైద్యం చేయడం అనేది ప్రభుత్వానికి, ప్రభుత్వ వైద్యులకు బర్డన్‌. రోగులకు కూడా ఆర్థికంగా చాలా భారంగా మారుతుంది. ఈ ఇబ్బందులన్నీ ఉండకూడదంటే.. కేవలం నోటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దీనిద్వారా 100శాతం బ్లాక్‌ఫంగస్‌ బారినపడకుండా ఉండే అవకాశం ఉంది. ప్రజలు జాగ్రత్తలు పాటించకపోతే ముఖమంతా చీల్చేసి, ఒక కన్ను కోల్పోయిన వారిని చూడాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి రాకూడదనే భావిద్దాం.


జాగ్రత్తలు ఎవరు పాటించాలి?

కరోనా సోకి హోమ్‌ ఐసోలేషన్‌లో ఉండేవాళ్లు, ఆసుపత్రిలో అడ్మిట్‌ అయినవాళ్లు, షుగర్‌ ఉండే వాళ్లు, వక్కాకు, పాన్‌మసాలా, పొగాకు నమిలే అల వాటు ఉండేవాళ్లు, చిగుర్ల వాపు సమస్యలుండేవాళ్లు.. వీరందరూ తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. నోటిశుభ్రత అనేది ప్రతిఒక్కరికీ తప్పనిసరి.

Updated Date - 2021-05-21T16:07:29+05:30 IST