సర్వే.. ‘సా..గు’తోంది..!

ABN , First Publish Date - 2021-08-26T05:18:25+05:30 IST

శ్రీశైలం జలాశయానికి వరద రోజులు ఏటేటా తగ్గిపోతుండడం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ వరద నీటిని తీసుకోవాలనే లక్ష్యంగా రాయలసీమ దుర్భిక్ష నివారణ మిషనకు జగన ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

సర్వే.. ‘సా..గు’తోంది..!
గాలేరు-నగరి ప్రధాన కాలువ

రాయలసీమ దుర్భిక్ష నివారణ మిషనలో భాగంగా..

రూ.10,388.90 కోట్లతో చేపట్టిన ప్రాజెక్టులు

ఇప్పటికే టెండర్లు పూర్తి

డిజైన, సర్వే పనుల్లో కాంట్రాక్ట్‌ సంస్థలు

నిధుల కొరతతో పనులు చేపట్టేందుకు వెనకడుగు..?

జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి


పలు సాగునీటి ప్రాజెక్టులకు రూ.10,388.9 కోట్లతో శ్రీకారం చుట్టారు. టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేశారు. అయితే.. వరద కాలువ, టన్నెల్‌ పనులు మినహా వివిధ ప్రాజెక్టుల డిజైన, ఇన్వెస్టిగేషన (సర్వే)లోనే నెలలు గడిపేస్తున్నారు. నిర్మాణాలు మొదలు పెట్టలేదు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఏమంత బాగాలేదు. ఈ పరిస్థితుల్లో పనులు చేస్తే బిల్లులు సకాలంలో వస్తాయో.. రావో..? అని కాంట్రాక్ట్‌ సంస్థలు సర్వేల పేరుతో కాలయాపన చేస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. కడప, చిత్తూరు జిల్లాల్లో లక్షల ఎకరాలకు సాగునీరు, పలు గ్రామాల ప్రజల దాహం తీర్చే పనులపై ప్రత్యేక కథనం.


(కడప-ఆంధ్రజ్యోతి): శ్రీశైలం జలాశయానికి వరద రోజులు ఏటేటా తగ్గిపోతుండడం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ వరద నీటిని తీసుకోవాలనే లక్ష్యంగా రాయలసీమ దుర్భిక్ష నివారణ మిషనకు జగన ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా జిల్లాలో గాలేరు నగరి-హంద్రీనీవా ఎత్తిపోతల పథకం, గాలేరు-నగరి వరద కాలువ విస్తరణ, టన్నెల్‌, గండికోట అదనపు టన్నెల్‌, చిత్రావతి-ఎర్రబల్లి ఎత్తిపోతల పథకం, కుందూ-టీజీపీ ఎత్తిపోతల పథకం వంటి సాగునీటి పనులు చేపట్టారు. టెండర్ల ప్రకియ కూడా పూర్తి చేసి నెలలు గడుస్తోంది. పనులు చేపట్టాల్సిన కాంట్రాక్ట్‌ సంస్థలు డిజైన, ఇన్వెస్టిగేషన (సర్వే) పనులతో కాలయాపన చేస్తున్నట్లు తెలుస్తోంది. నిధుల కొరతే ఇందుకు మూల కారణమని సమాచారం. అలాంటిది ఏమీ లేదని, ఇ-ప్రొక్యూర్మెంట్‌ నిబంధనల ప్రకారం కాంట్రాక్ట్‌ సంస్థలు డిజైన, సర్వేలు చేస్తున్నాయని ఇంజనీరింగ్‌ అధికారులు అంటున్నారు. టెండరు అగ్రిమెంట్‌ గడువులోగా పనులు చేస్తే ఓకే.. లేదంటే స్టీల్‌, సిమెంట్‌, డీజిల్‌, కూలీల రేట్లు పెరిగి నిర్మాణం వ్యయం ఏటేటా పది శాతానికి పైగా పెరిగి ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం తప్పదని సాగునీటి నిపుణులు అంటున్నారు. అంతేకాదు.. సాగునీటి లక్ష్యం సాకారం కాదని అంటున్నారు. 


గాలేరు నగరి - హంద్రీనీవా లిఫ్ట్‌ ఎప్పుడో..?

హంద్రీనీవా కాలువ ద్వారా జిల్లాలో రాయచోటి నియోజకవర్గంలో చిన్నమండెం, సంబేపల్లి, రాయచోటి మండలాల్లో 20 వేల ఎకరాలకు సాగునీరు అందాలి. చిత్తూరు జిల్లాలో మదనపల్లె, పుంగనూరు, పీలేరు ప్రాంతాలకు సాగు, తాగునీరు ఇవ్వాలని లక్ష్యం. అయితే.. అనంతపురం జిల్లాను దాటి కడప, చిత్తూరు జిల్లాలకు హంద్రీనీవా ద్వారా నీటిని ఇవ్వడం భవిష్యత్తులో ఇబ్బందికర పరస్థితులు ఉంటాయని, జిల్లాలోని వేంపల్లి సమీపంలో గాలేరు-నగరి కాలువ నుంచి హంద్రీనీవా కాలువకు 20 టీఎంసీలు ఎత్తిపోసేందుకు రాయలసీమ దుర్భిక్ష నివారణ మిషనలో భాగంగా జీఎనఎ్‌సఎ్‌స - హెచఎనఎ్‌సఎ్‌స ఎత్తిపోతల పథకం రూ.4,555.45 కోట్లతో చేపట్టారు. ఎస్టిమేట్‌ కాంట్రాక్ట్‌ విలువ (ఈసీవీ) రూ.4,373.93 కోట్లు. ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్న ఓ ప్రజాప్రతినిధికి చెందిన పీఎల్‌ఆర్‌ నిర్మాణ సంస్థ 0.016 శాతం లెస్‌కు ఈ పనులు సొంతం చేసుకుంది. టెండర్లు, అగ్రిమెంట్‌ పూర్తయ్యి నెలలు గడుస్తోంది. ఇప్పటివరకు పనులు మాత్రం మొదలు కాలేదు. డిజైన, ఇన్వెస్టిగేషన చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. సర్వే పూర్తి అయ్యేదెన్నడో..? పనులు మొదలు పెట్టేదోన్నడో..? కరువు రైతుల నిట్లూర్పు ఇది.


ఈ ప్రాజెక్టు పనులు ఎప్పుడో..?

- గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు వరద కాలువ (ఫ్లడ్‌ ఫ్లో కెనాల్‌) విస్తరణ, టన్నెల్‌ పనులు రూ.588.90 కోట్లు, గండికోట అదనపు టన్నెల్‌ (సొరంగ మార్గం కాలువ) రూ.531.80 కోట్లు, చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ (సీబీఆర్‌) - ఎర్రబల్లి ఎత్తిపోతల పథకం పనులు రూ.853.64 కోట్లతో చేపట్టారు. రూ.1,974.34 కోట్లతో చేపట్టిన ఈ మూడు పనులకు ఒకే ప్యాకేజీ కింద టెండర్లు పిలిస్తే.. జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధికి చెందిన ఎంఆర్‌కేఆర్‌ నిర్మాణ సంస్థతో పాటుగా రాఘవ కనస్ట్రక్షన, పీఎనసీ ఇనఫ్రాస్ట్రక్చర్‌ సంస్థలు టెండర్‌ షెడ్యూల్‌ దాఖలు చేశాయి. 0.101 శాతం తక్కువ రేట్లతో ఎంఆర్‌కేఆర్‌ సంస్థ దక్కించుకుంది. ఈ పనులు కూడా మొదలు పెట్టలేదు. సర్వేతోనే కాలయాపన చేస్తున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి.

- పులివెందుల నియోజకవర్గంలో పీబీసీ, సీబీఆర్‌, జీకేఎల్‌ఐ కాలువల పరిధిలో 1,22,480 ఎకరాలకు సూక్ష్మసేద్యం కింద సాగునీరు ఇవ్వాలని మైక్రో ఇగిరేషన ప్రాజెక్టు చేపట్టారు. టెండరు కాస్ట్‌ విలువ (ఈసీవీ) రూ.1,019.96 కోట్లు. గుండికోట జలాశయం నుంచి చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ (సీబీఆర్‌)కు 2,200 క్యూసెక్కులు, పైడిపాలెం రిజర్వాయర్‌కు 110 క్యూసెక్కులు ఎత్తిపోస్తున్నారు. ఈ లిఫ్టుల సామర్థ్యం రెట్టింపు చేసేందుకు రూ.2,601.28 కోట్లతో ఎత్తిపోతల పథకం చేపట్టారు. అలాగే.. కుందూ-టీజీపీ ఎత్తిపోతల పథకం పనులు రూ.419.42 కోట్లతో చేపట్టారు. రూ.4,040.63 కోట్లతో ఈ మూడు పనులను ఒకే ప్యాకేజీ కింద టెండర్లు పిలిస్తే.. మెగా ఇనఫ్రా సంస్థ 0.16 శాతం లెస్‌కు దక్కించుకుంది. టెండర్లు, అగ్రిమెంట్‌ పూర్తయ్యి రెండు నెలలు కావొస్తోంది. ఇప్పటికే సర్వే పనుల్లో కాలం గడుపుతున్నారే తప్ప పనులకు అంకురార్పణ చేయలేదు.


అప్పు పుడితేనే బిల్లులు

రాయలసీమ దుర్భిక్ష నివారణ మిషన కింద కర్నూలు, కడప జిల్లాల్లో పలు ప్యాకేజీ కింద చేపట్టే పనుల టెండర్లు సొంతం చేసుకున్న కాంట్రాక్ట్‌ సంస్థల్లో కొందరు ఇప్పటికే పనులు మొదలు పెట్టారు. ప్రధానంగా కర్నూలు జిల్లాలో కొంతమేరకు పనులు జరిగాయి. ఏ ఒక్కరికి కూడా బిల్లులు రాలదేని తెలుస్తోంది. జీఎనఎ్‌సఎ్‌స హెడ్‌ ఆఫ్‌ అకౌంట్‌కు బిల్లులు పంపుతున్నట్లు ఇంజనీర్లు పేర్కొంటున్నారు. ప్రభుత్వానికి అప్పు పుడితేనే బిల్లులు వస్తాయని తేలిపోవడంతో జిల్లాలో టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్ట్‌ సంస్థలు పనులు మొదలు పెట్టేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదని విశ్వసనీయ సమాచారం. 


సర్వే చేస్తున్నారు

- మల్లికార్జునరెడ్డి, ఎస్‌ఈ, గాలేరు-నగరి ప్రాజెక్టు, కడప

రాయలసీమ దుర్భిక్ష నివారణ మిషన కింద రూ.10,388.9 కోట్లతో వివిధ పనులకు మూడు ప్యాకేజీలుగా టెండర్లు పూర్తి చేశాం. పనులు దక్కించుకున్న కాంట్రాక్ట్‌ సంస్థలతో ప్రభుత్వ నిబంధనల మేరకు అగ్రిమెంట్‌ చేసుకున్నాం. ఇ-ప్రొక్యూర్మెంట్‌ విధానంలో పనులు చేస్తుండడంతో పనులు దక్కించుకున్న కాంట్రాక్ట్‌ సంస్థలు డిజైన, ఇన్వెస్టిగేషన వంటి పనులు చేస్తున్నారు. ఇవి పూర్తికాగానే నిర్మాణాలు చేపడతాం. గాలేరు-నగరి వరద కాలువ, టన్నెల్‌ పనులు ఇప్పుడిప్పుడే మొదలు పెట్టారు.

Updated Date - 2021-08-26T05:18:25+05:30 IST