నీటి ప్రాజెక్టులకు కేటాయింపులేవీ..?

ABN , First Publish Date - 2021-05-21T05:48:29+05:30 IST

జిల్లాను సస్యశామలం చేయాలనే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన ఏడు నూతన సాగునీటి ప్రాజెక్టులకు పునాది రాయి వేశారు. రాయలసీమ దుర్భిక్ష నివారణ మిషనలో భాగంగా గాలేరు నగరి - హంద్రీనీవా లిఫ్ట్‌ స్కీం, ఎర్రబల్లి ఎత్తిపోతల పథకం, గాలేరు-నగరి వరద కాలువ సామర్థ్యం పెంపు,

నీటి ప్రాజెక్టులకు కేటాయింపులేవీ..?
అట్లూరు వద్ద అసంపూర్తిగా ఉన్న తెలుగుగంగ మెయిన కెనాల్‌ అక్విడెట్‌

రాయలసీమ దుర్భిక్ష నివారణ మిషనలో భాగంగా..

రూ.10,388.23 కోట్లతో ఏడు కొత్త ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన

బడ్జెట్లో కేటాయింపులకు నోచుకోని వైనం

జిల్లా ప్రాజెక్టులకు రూ.500.41 కోట్లు

అందులో పనులకు రూ.399.78 కోట్లే

కీలకమైన తెలుగుగంగ ప్రాజెక్టుకు నిరాశే

వైఎ్‌సఆర్‌ స్టీల్‌ ప్లాంట్‌కు రూ.250 కోట్లు

పులివెందుల ఏరియా అథారిటీకి రూ.100 కోట్లు

మెగా ఇండిస్ర్టియల్‌ పార్కుకు ప్రాధాన్యం

ఆర్థిక మంత్రి బుగ్గన అంకెల పద్దు


ముఖ్యమంత్రి జగన సొంత జిల్లా కడపకు బడ్జెట్‌ కేటాయింపుల్లో అగ్రస్థానం ఉంటుందని ఆశించిన ప్రజలకు నిరాశే మిగిలింది. రాయలసీమ దుర్భిక్ష నివారణ మిషన కింద రూ.10,388.23 కోట్లతో చేపట్టే ఏడు నూతన ప్రాజెక్టులకు సీఎం జగన ఇప్పటికే శంకుస్థాపన చేశారు. టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి అయింది. పనులు చేపట్టాల్సి ఉంది. ఈ బడ్జెట్లో ఇవి కేటాయింపులకు నోచుకోలేదు. తెలుగుగంగ ప్రాజెక్టుకూ నిరాశే మిలిగింది. జిల్లా ప్రాజెక్టులకు రూ.500.41 కోట్లు కేటాయించారు. అందులో పనులు, భూసేకరణ, పునరావాసానికి రూ.399 కోట్లకు మించడం లేదు. వైఎ్‌సఆర్‌ స్టీల్‌ ప్లాంట్‌, పులివెందుల ఏరియా డెవల్‌పమెంట్‌ అథారిటీ (పాడా), కొప్పర్తి మెగా ఇండస్ర్టియల్‌ పార్కుకు అరకొర కేటాయింపులు చేశారు. పులివెందులతో సమానంగా ఇతర నియోజకవర్గాల ప్రగతిపై దృష్టి పెట్టలేదు. విత్త మంత్రి బుగ్గన 2020-21 బడ్జెట్లో జిల్లాకు చేసిన కేటాయింపులపై ప్రత్యేక కథనం.


(కడప-ఆంధ్రజ్యోతి): జిల్లాను సస్యశామలం చేయాలనే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన ఏడు నూతన సాగునీటి ప్రాజెక్టులకు పునాది రాయి వేశారు. రాయలసీమ దుర్భిక్ష నివారణ మిషనలో భాగంగా గాలేరు నగరి - హంద్రీనీవా లిఫ్ట్‌ స్కీం, ఎర్రబల్లి ఎత్తిపోతల పథకం, గాలేరు-నగరి వరద కాలువ సామర్థ్యం పెంపు, గండికోట అడిషినల్‌ టన్నల్‌ నిర్మాణం, కుందూ-టీజీపీ లిఫ్ట్‌, పులివెందుల బ్రాంచి కెనాల్‌ (పీబీసీ), సీబీఆర్‌, జీకేఎల్‌ఐ కాలువల పరిధిలో 1,22,480 ఎకరాలకు సూక్ష్మసేద్యం కింద సాగునీరు ఇవ్వాలని మైక్రో ఇరిగేషన ప్రాజెక్టు, గండికోట-చిత్రావతి, గండికోట-పైడిపాలెం లిఫ్టుల సామర్థ్యం పెంపు.. ఈ ఏడు ప్రాజెక్టులకు రూ.10,388.23 కోట్లతో సీఎం శంకుస్థాన చేశారు. టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి అయింది. వీటికి ఈ బడ్జెట్లో ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. అయితే.. రాయలసీమ దుర్భిక్ష నివారణ మిషన కింద రాష్ట్ర ప్రభుత్వం అప్పు కోసం ప్రయత్నాలు చేస్తోందని, అప్పు పుట్టగానే ప్రత్యేక కేటాయింపులు ఉంటాయని ఇంజనీరింగ్‌ అధికారులు పేర్కొనడం కొసమెరుపు.


తెలుగుగంగ ప్రాజెక్టుకు నిరాశే!

మైదుకూరు, బద్వేలు నియోజకవర్గాల జీవనాడి ఎన్టీఆర్‌ తెలుగుగంగ ప్రాజెక్టు. మైనర్‌, సబ్‌ మైనర్‌ కెనాల్స్‌, డిస్ర్టిబ్యూటరీలు నిర్మాణాల కోసం రూ.602 కోట్లు ఖర్చు చేసినా ఒక్క ఎకరా ఆయకట్టుకూ నీళ్లివ్వలేని పరిస్థితి. అసంపూర్తి పంట కాలువలు, డ్రాపులు, అక్విడెట్స్‌, వంతెనలు, మైనర్‌, మేజర్‌ డిసి్ట్రబ్యూటరీలు, 135 స్ట్రక్చర్స్‌ నిర్మాణాలు, బ్రహ్మంసాగర్‌ జలాశయం లీకేజీ అరికట్టేందుకు నిపుణుల కమిటీ సూచన మేరకు ‘ప్లాస్టిక్‌ కాంక్రీట్‌ డయాఫ్రం వాల్‌’, ఆనకట్ట బయట వైపున శాండ్‌ ఫిల్టర్‌ నిర్మాణం పనులకు రూ.139 కోట్లు తక్షణం కావాలని టీజీపీ ఇంజనీర్లు ప్రతిపాదనలు పంపారు. బుగ్గన అంకెల పద్దులతో నిరాశే మిగిల్చారు. కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాలకు కలిపి పనుల కోసం కేవలం రూ.126 కోట్లు మాత్రమే కేటాయించారు. అందులో మన జిల్లాకు వచ్చేదెంత..? ఈ ఏడాది కూడా చివరి ఆయకట్టుకు సాగునీరు ప్రశ్నార్థకమే.


వైవీయూకు రూ.89 కోట్లు

యోగివేమన యూనివర్శిటీకి 2021-22 విద్యాసంవత్సరానికి గాను రూ.89 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయించింది. వైవీయూ సిబ్బంది వేతనాల కోసం రూ.23 కోట్లు, మౌలిక వసతుల కోసం, ఆగిపోయిన భవనాల నిర్మాణాల కోసం రూ.66 కేటాయించారు. కొత్తగా ఏర్పాటు చేసిన డాక్టర్‌ వైఎ్‌సఆర్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన ఆర్ట్స్‌ యూనివర్సిటీ భవన నిర్మాణాలు, వసతులకు సుమారు రూ.100 కోట్లు అవసరమని అంచనా వేస్తే ఇచ్చింది కేవలం రూ.4.98 కోట్లే.


కేటాయింపులు ఇవీ..

- సీఎం జగన ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎ్‌సఆర్‌ స్టీల్‌ ప్లాంట్‌కు రూ.250 కోట్లు కేటాయించారు. గత ఏడాది బడ్జెట్లో రూ.275 కోట్లు కేటాయించినా కొంతమేర ప్రహరీ గోడ నిర్మించి వదిలేశారు. రూ.15 వేల కోట్లు పెట్టుబడి, దశలవారీగా 3 మిలియన టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మించే ఈ పరిశ్రమలో మౌలిక వసతుల కల్పనకు గతేడాదే రూ.500 కోట్లు అవసరమని ప్రతిపాదించారు. అందులో సగం కూడా ఇవ్వలేదు.

- కొప్పర్తి దగ్గర రూ.25 వేల కోట్ల పెట్టుబడి, 2.50 లక్షల మందికి ఉపాధి లక్ష్యంగా 3,155 ఎకరాల విస్తీర్ణంలో మెగా ఇండస్ర్టియల్‌ హబ్‌ ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే మౌలిక సౌకర్యాల పనులు జరుగుతున్నాయి. బుగ్గన బడ్జెట్‌ ప్రసంగంలో ప్రత్యేకంగా ఈ అంశం చేర్చడమే కాకుండా వైఎ్‌సఆర్‌ ఎలకా్ట్రనిక్‌ మ్యానిఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌ ఏర్పాటుకు రూ.200 కోట్లు కేటాయించారు. 

- ముఖ్యమంత్రి జగన స్వంత నియోజకవర్గం పులివెందుల అభివృద్ధిలో భాగంగా పాడాకు రూ.100 కోట్లు ఇచ్చి ఆర్థిక మంత్రి స్వామిభక్తి చాటారు. అయితే.. పులివెందులతో పాటు సమానంగా ఇతర నియోజకవర్గాల అభివృద్ధి కోసం బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.

- జిల్లాలో జీఎనఎ్‌సఎ్‌స, మైలవరం, లోయర్‌ సగిలేరు, బుగ్గవంక, అన్నమయ్య, వెలిగల్లు రిజర్వాయర్‌, పులివెందుల కెనాల్‌ స్కీం వంటి ప్రాజెక్టులకు.. ఇంజనీరింగ్‌ విభాగాల సిబ్బంది జీతాలు, నిర్వహణ, వాహనాలు తదితర ఖర్చులతో ఆయా ప్రాజెక్టుల పనులకు రూ.500.41 కోట్లు కేటాయించారు. అందులో పనులు, భూ సేకరణ, పునరావాసం కోసం కేటాయించింది కేవలం రూ.399.78 కోట్లే.


జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు కేటాయింపులు (రూ.కోట్లలో):

--------------------------------------------------------------

ప్రాజెక్టు 2020-21 2021-22

--------------------------------------------------------------

గాలేరు - నగరి 1,173.80 250.16

పులివెందుల బ్రాంచి కెనాల్‌ 68.75 149.16

మైలవరం ప్రాజెక్టు 5.93 6.79

వెలిగల్లు జలాశయం 1.31 1.51

బుగ్గవంక ప్రాజెక్టు 1.00 1.00

అన్నమయ్య ప్రాజెక్టు 1.00 1.00

లోయర్‌ పగిలేరు ప్రాజెక్టు 0.20 0.20

మేజర్‌ ఇరిగేషన 93.29 90.59

---------------------------------------------------------------

మొత్తం 1,345.28 500.41

---------------------------------------------------------------


అంకెల గారడి

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్‌.శ్రీనివాసరెడ్డి

కడప, మే 20 (ఆంధ్రజ్యోతి): గత బడ్జెట్‌లో చెప్పిన వాగ్దానాలే నిలబెట్టుకోలేకపోయారని, మళ్లీ అంకెల గారడి బడ్జెట్‌ విడుదల చేశారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్‌.శ్రీనివాసరెడ్డి గురువారం ప్రకటనలో తెలిపారు. గత రెండు సంవత్సరాలుగా అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా చేపట్టలేదని, నీటిపారుదల, రోడ్లు, నిర్మాణ రంగాలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురయ్యాయని పేర్కొన్నారు. బడ్జెట్‌లో అంకెలు పెడుతున్నారు తప్ప ఆచరణకు మాత్రం నోచుకోవడంలేదని తెలిపారు. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి పనులే తప్ప ఎక్కడా కూడా ఇతర అభివృద్ధి కార్యక్రమాలు లేవని వివరించారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన సీఎం మాస్కు లేకుండా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం ఈ నిబంధనలు ప్రజలకు మాత్రమే కానీ జగన అండ్‌ కో..కు వర్తించవా అని ప్రశ్నించారు. జగన సర్కారుప్రవేశపెట్టిన బడ్జెట్‌ పరిశీలిస్తే వడ్డీల కోసం వడ్డీలు చెల్లించేందుకు అప్పు తీసుకున్నట్లుగా ఉందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి అన్నారు.


ప్రజాసంక్షేమంపై నిబద్ధత ఉన్న బడ్జెట్‌

ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి

కరోనా కష్టకాలంలోనూ ప్రజాసంక్షేమంపై సీఎం జగనమోహనరెడ్డి ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతతను ఈ బడ్జెట్‌ ప్రతిబింబిస్తోంది. ఈ బడ్జెట్‌లో విద్య, వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేస్తూనే వైద్యరంగానికి అధిక ప్రాదాన్యత ఇస్తూ ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పించారు. ప్రతి పైసాను సద్వినియోగం చేస్తూ మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని సంక్షేమ పథకాలను వంద శాతం అమలు చేయడమే ధ్యేయంగా ఈ బడ్జెట్‌ రూపొందింది. మహిళల, పిల్లల సంక్షేమంకోసం ప్రత్యేకంగా బడ్జెట్‌ రూపొందించిన ఘనత ఈ ప్రభుత్వానిదే.

Updated Date - 2021-05-21T05:48:29+05:30 IST