ఓటమి భయంతో ప్రలోభాలకు గురిచేస్తున్నారు

ABN , First Publish Date - 2021-10-30T05:21:13+05:30 IST

బద్వేలు ఉప ఎన్నికలో ఓటమి భయంతో అడ్డదారుల్లో గెలిచేందుకు అధికార పార్టీ నాయకులు ప్రలోభాలకు గురిచేస్తున్నారని, దీనిని ధైర్యంగా ఎదుర్కొనేందుకు తమ పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి అన్నారు.

ఓటమి భయంతో ప్రలోభాలకు గురిచేస్తున్నారు
పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతున్న ఆదినారాయణరెడ్డి

వైసీపీ ఆగడాలను కేంద్ర ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్తాం

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి


కడప(మారుతీనగర్‌), అక్టోబరు 29: బద్వేలు ఉప ఎన్నికలో ఓటమి భయంతో అడ్డదారుల్లో గెలిచేందుకు అధికార పార్టీ నాయకులు ప్రలోభాలకు గురిచేస్తున్నారని, దీనిని ధైర్యంగా ఎదుర్కొనేందుకు తమ పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక మానస ఇన్‌ రెస్టారెంట్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చట్టానికి విరుద్ధంగా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు బద్వేలులో తిష్టవేసి ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. అన్ని మండలాల్లో ఆధిక్యత వచ్చేలా చూడాలని ఇప్పటికే ఆయా మండలాల్లో ఆ పార్టీ ముఖ్యనాయకులకు ముఖ్యమంత్రి టార్గెట్‌ ఇచ్చినట్లు హాట్‌ టాపిక్‌గా ఉందన్నారు. దీంతో ఇతర పార్టీల సానుభూతిపరులను, ప్రజలను కేసుల్లో ఇరికిస్తామని బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ఎన్నిక సమయంలో వైసీపీ ఆగడాలను కేంద్ర ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఇప్పటికే డబ్బుల పంపకాల పర్వానికి తెరలేపారన్నారు. తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికలో ఎలాగైతే ఇతర ప్రాంతాలనుంచి ప్రజలను ఆర్టీసీ బస్సుల ద్వారా తిరుమలకు వెళ్లే భక్తుల ముసుగులో రప్పించి నోట్లు పంచి ఓట్లు వేయించుకున్నారో అదే తరహాలో బద్వేలు ఉప ఎన్నికలో చక్రం తిప్పేందుకు వైసీపీ నాయకులు పన్నాగం పన్నుతున్నారనే సంగతి తెలిసిందన్నారు. ఏదిఏమైనా ఎన్నికను సజావుగా నిర్వహించగలరనే విశ్వాసం జిల్లా అధికారులపై ఉందన్నారు.

Updated Date - 2021-10-30T05:21:13+05:30 IST