అభివృద్ధికి ఆమడ దూరంలో ఏపీ
ABN , First Publish Date - 2021-12-27T05:21:35+05:30 IST
రాష్ట్రంలో ఇంతవరకు ఏమాత్రం అభివృద్ధి జరుగలేదని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు మూలె వెంకటసుబ్బారెడ్డి ధ్వజమెత్తారు.

జమ్మలమడుగు రూరల్, డిసెంబరు 26: రాష్ట్రంలో ఇంతవరకు ఏమాత్రం అభివృద్ధి జరుగలేదని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు మూలె వెంకటసుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం భారత కమ్యూనిస్టు పార్టీ 97వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని పాత బస్టాండు ఆటోస్టాండు వద్ద ఉన్న ఎద్దుల ఈశ్వరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం, రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాయని ఇందుకు ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా సమితి సభ్యుడు ప్రసాదు, ఏఐటీయూసీ కార్యదర్శి లోకేష్, సీనియర్ నాయకులు దండు రవి, ఎద్దుల జగదీశ్వర్‌రెడ్డి, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు నాగేంద్ర, శ్రీను, ఆటోయూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యలపై సీపీఐ పోరాటం
ఎర్రగుంట్ల, డిసెంబరు 26: ప్రజా సమస్యలపై సీపీఐ పోరాటం చేస్తోందని ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎంవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఎర్రగుంట్లలో సీపీఐ 97వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన కార్యకర్తలతో కలిసి పార్టీ జెండాను అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1925 డిసెంబరు 26వ తేదీన సీపీఐ ఆవిర్భవించిందన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేసోందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఘనంగా ఆవిర్భావ వేడుకలు
కొండాపురం, డిసెంబరు 26: భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల సీపీఐ కార్యదర్శి మనోహర్‌బాబు పార్టీ కార్యాలయంలో జెండా ఎగురవేసి కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీపీఐ ఎప్పటికి పేద బడుగు బలహీన వర్గాల కోసం పోరాడుతూనే ఉంటుందన్నారు. కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకుడు వెంటరమణ, ఏఐటీయూసీ అధ్యక్ష, కార్యదర్శులు విద్యాసాగర్‌రెడ్డి, చిన్న, రాధ, జాఫర్, కరీం మోహన్ తదితరులు పాల్గొన్నారు.
