ప్రభుత్వ శాఖలన్నీ వ్యవస్థ కోసం పనిచేయాలి : ఆర్డీవో

ABN , First Publish Date - 2021-08-26T04:57:27+05:30 IST

ప్రభుత్వ శాఖలన్నీ ఏ ఒక్కరి కోసమో పనిచేయకూడదు, వ్యవస్థలను దృష్టిలో ఉంచుకుని పనిచేయాలని జమ్మలమడుగు ఆర్డీవో శ్రీనివాసులు అన్నారు.

ప్రభుత్వ శాఖలన్నీ వ్యవస్థ కోసం పనిచేయాలి : ఆర్డీవో
సమావేశంలో మాట్లాడుతున్న ఆర్టీవో శ్రీనివాసులు

ప్రొద్దుటూరు, ఆగస్టు 25 : ప్రభుత్వ శాఖలన్నీ ఏ ఒక్కరి కోసమో పనిచేయకూడదు,  వ్యవస్థలను దృష్టిలో ఉంచుకుని పనిచేయాలని జమ్మలమడుగు ఆర్డీవో శ్రీనివాసులు అన్నారు. బుధవారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్డీవో మాట్లాడుతూ ఎదైనా విగ్రహం పెట్టాలంటే సుప్రీం కోర్టు సూచనల మేరకు జిల్లా, రాష్ట్రస్థాయి కమిటీ అనుమతితో ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఇటీవల బొల్లవరం వద్ద ఒక విగ్రహం ఏర్పాటు చేశారని, కలెక్టర్‌ అదేశాల మేరకు గంటలోపు ఆ విగ్రహాన్ని తొలగించడం జరిగిందన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా చట్టాలకు లోబడి నిబంధనల మేరకు నడుచుకోవాలన్నారు. ప్రజాజీవనం ప్రశాంతంగా జరిగేందుకు ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఇందులో ప్రధానంగా మున్సిపల్‌, రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ శాఖలన్నీ చట్టాలను అమలు చేయాలి తప్ప ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టకూడదన్నారు. 

రెవెన్యూ సిబ్బందిపై మండిపాటు : బొల్లవరం ప్రాంతానికి సంబంధించిన రెవెన్యూ సిబ్బందిపై ఆర్డీవో మండిపడ్డారు. ఆర్‌ఐ, వీఆర్‌వో, వీఆర్‌ఏలు క్షేత్రస్థాయిలో ఏమి జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. బొల్లవరంలో విగ్రహం ఏర్పాటు చేస్తుంటే ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. మీ నిర్లక్ష్యం వల్ల ప్రజలు కొట్టుకునే పరిస్థితి వస్తుందన్నారు. విగ్రహం ఏర్పాటు చేస్తుంటే, కనీస సమాచారం తెలుసుకోకుండా ఏమీ చేస్తున్నారంటూ సంబంధిత వీఆర్‌వోను ప్రశ్నించా రు. నిన్ను ఉద్యోగంలో ఎందుకు కొనసాగించాలి, జీతం ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో మున్పిపల్‌ కమిషనర్‌ వెంకటశివారెడ్డి, డీఎస్పీ ప్రసాదరావు, రెవెన్యూ, పోలీసు, మున్సిపాలిటీ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

 

Updated Date - 2021-08-26T04:57:27+05:30 IST