రెండేళ్ల పాలనలో అన్నీ వైఫల్యాలే

ABN , First Publish Date - 2021-05-31T04:23:18+05:30 IST

వైసీపీ ప్రభుత్వ రెండేళ్ల పాలనలో అన్నీ వైఫల్యాలే అని టీడీపీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి పేర్కొన్నారు.

రెండేళ్ల పాలనలో అన్నీ వైఫల్యాలే
మాట్లాడుతున్న మల్లెల లింగారెడ్డి

టీడీపీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి


ప్రొద్దుటూరు క్రైం, మే 30 : వైసీపీ ప్రభుత్వ రెండేళ్ల పాలనలో అన్నీ వైఫల్యాలే అని టీడీపీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ గాలేరు నగరి ప్రాజెక్టు అంతర్భాగమైన గండికోట, వామికొండ, సర్వరాయసాగర్‌, మైలవరం జలాశయాలకు పూర్తిస్థాయిలో నీరు నింపడానికి పోతిరెడ్డిపాడు నుంచి కాలువలు, టర్నెల్‌ పనులు పూర్తి కాలేదన్నారు. ఎస్‌ఆర్‌బీసీ పనులు కూడా అసంపూర్తిగా ఉన్నాయన్నారు. గండికోట నిర్వాసితులకు నష్టపరిహరం పూర్తిగా చెల్లించలేదన్నారు. కెసీ కెనాల్‌కు సంబంధించి రాజోలి ఆనకట్ట సామర్ధ్యం పెంచే దిశగా పునాదిరాళ్లు వేసినా ఇంకా ప్రారంభం కాలేదన్నారు. ఇంకా తెలుగుగంగ ఎస్‌ఆర్‌-1, ఎస్‌ఆర్‌-2, తద్వారా బ్రహ్మంసాగర్‌కు నీటిని ఎత్తిపోసే పనుల్లోను పురోగతి లేదన్నారు. కడప స్టీల్‌ విషయంలో రూ.200 కోట్లు కేటాయించి, రూ.50 కోట్లు మాత్రమే విడుదల చేసి నిరుద్యోగులకు ఆశాభంగం కల్గించినారన్నారు. కరోనా కష్టకాలంలో ఆక్సిజన్‌, వెంటిలేటర్ల వసతి కల్పనలో ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. ఉచిత ఇసుక రద్దు చేసి భవన నిర్మాణ కార్మికుల జీవనానికి గండికొట్టారన్నారు. మద్యం, విద్యుత్తు, ఆర్టీసీ బస్సు, పెట్రోలు, డీజిల్‌ రేట్లను విపరీతంగా పెంచారన్నారు. ఉద్యోగులకు ఇచ్చిన సీపీఎస్‌ రద్దు, పీఆర్‌సీ అమలు చేయకపోగా, 5 డీఏల బకాయిలు చెల్లించలేదన్నారు.  టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడం తప్ప, ఈ రెండేళ్లల్లో నిర్మాణాత్మకమైన అభివృద్ది ఏమి జరగలేదన్నారు. మిగిలిన ఈ మూడేళ్లల్లోనైనా ఆరాచకాలకు స్వస్తి చెప్పి, అభివృద్దిపై దృష్టి పెట్టాలని లింగారెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2021-05-31T04:23:18+05:30 IST