బిల్లు... గొల్లు

ABN , First Publish Date - 2021-12-30T05:39:25+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జగన్న ఇళ్లు’ కట్టుకుంటున్న లబ్ధిదారుల పరిస్థితి ముందు గొయ్యి వెనుక నుయ్యిలా... తయారైంది. స్థలం, ఇల్లు మంజూరై సొంతింటి కల నెరవేర్చుకుంటున్నామన్న ఆనందం వారిలో ఎక్కువ

బిల్లు... గొల్లు
పోరుమామిళ్లలో జగనన్న ఇంటికి స్లాబ్‌ లెవల్‌ వరకు జరిగిన నిర్మాణం

ఫోటో

పేరుకుపోయిన జగనన్న ఇళ్ల బకాయిలు 

రూ.22 కోట్లకు పైగా పెండింగ్‌ 

లబ్ధిదారుల నిరీక్షణ

కడప, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జగన్న ఇళ్లు’ కట్టుకుంటున్న లబ్ధిదారుల పరిస్థితి ముందు గొయ్యి వెనుక నుయ్యిలా... తయారైంది. స్థలం, ఇల్లు మంజూరై సొంతింటి కల నెరవేర్చుకుంటున్నామన్న ఆనందం వారిలో ఎక్కువ రోజులు నిలువలేదు. ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి ఇస్తున్న నిధులు సరిపోనప్పటికీ ఇల్లు కడతారా... లేక రద్దు చేసి వేరే వారికి ఇవ్వాల్నా అంటూ.. అధికారులు లబ్ధిదారుల మెడపై కత్తి పెట్టడంతో అప్పో సొప్పో చేసి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దశల వారీగా బిల్లులు మంజూరు అవుతాయనుకుంటే కొందరికి గృహాలు స్లాబుల వరకు వచ్చినప్పటికి కూడా అందలేదు. దీంతో ఇళ్ల నిర్మాణం మూడు అడుగులు ముందుకు... ఏడు అడుగులు వెనక్కు అన్నట్లుగా తయారైంది. జగనన్న ఇళ్లకు సంబంఽధించి సుమారు రూ.22 కోట్లకు పైగా బిల్లులను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. బిల్లు ఎప్పుడా..? అంటూ లబ్ధిదారులు నిరీక్షిస్తున్నారు.


ఓటిఎస్‌ పేరుతో వసూళ్లు

ప్రభుత్వం మాత్రం ఎప్పుడో దివంగత ఎన్టీఆర్‌ హయాంలో మంజూరైన ఇళ్లకు వనటైమ్‌ సెటిల్మెంట్‌ పేరుతో డబ్బు కట్టండి రిజిస్ర్టేషన చేయిస్తామంటూ పేదలపై ఒత్తిడి తెస్తోంది. డబ్బు కట్టకపోతే పింఛన్లు, సంక్షేమ పథకాలు నిలిపేస్తామని వలంటీర్ల ద్వారా బెదిరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పేదల నుంచి ఓటీఎస్‌ పేరుతో నిధులు వసూలు చేసుకునేందుకు నిక్కచ్చిగా వ్యవహరిస్తున్న సర్కార్‌ మరి పేదలకు ఇంటి బిల్లులు కేటాయింపులో ఎందుకు జాప్యం చేస్తుందంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


బిల్లుల కోసం నిరీక్షణ

జిల్లాకు 1,06,828 పక్కా గృహాలను ప్రభుత్వం మంజూరు చేసింది. మూడు నెలల క్రితం పక్కా ఇళ్లకు గ్రౌండింగ్‌ పేరుతో పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించింది. గృహాల నిర్మాణానికి ప్రభుత్వం మూడు ఆప్షన్లు ఇచ్చింది. ప్రభుత్వ అంచనా ప్రకారం ఇంటి నిర్మాణ విలువ రూ.1.50 లక్షలు. బహిరంగ మార్కెట్‌లో సిమెంటు, ఇతర నిర్మాణ సామాగ్రి ధరలు భగ్గుమంటున్నాయి. దీంతో ఇల్లు కట్టుకోవాలంటే కనీసం రూ.మూడు నుంచి నాలుగు లక్షల అవుతుంది. ఈ భారం భరించలేక చాలా మంది లబ్ధిదారులు ప్రభుత్వమే ఇంటి నిర్మాణం చేసివ్వాలనే ఆప్షన ఎంచుకున్నారు. అయితే పలుచోట్ల వారిపై ఒత్తిడి తెచ్చి లబ్ధిదారులే నిర్మించుకునేలా ఆప్షనకు మార్చారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఒకేసారి భారీ ఎత్తున ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇల్లు కట్టుకోకపోతే స్థలం రద్దు చేస్తామంటుండడంతో చేతిలో డబ్బులు లేకున్నా అప్పులు తెచ్చి బేస్మట్టం వేశారు. ఇప్పటి వరకు 66,097 గృహాల నిర్మాణాలకు శ్రీకారం చుట్టగా పునాదుల స్థాయిలో 56,518 ఇళ్లు ఉన్నాయి. బీఎల్‌లో 6,451, రూఫ్‌ లెవల్‌లో 1,299, స్లాబ్‌ లెవల్‌లో 1,651 ఇళ్లు ఉన్నాయి. ఇప్పటి వరకు 178 ఇళ్లు పూర్తి అయ్యాయి. దశల వారీ బిల్లులు రాకపోవడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సుమారు రూ.22 కోట్ల పైగా బిల్లులు రావావాల్సి ఉంది. 


వారంలో బిల్లులు క్లియర్‌ చేస్తాం

- కృష్ణయ్య, గృహ నిర్మాణశాఖ పీడీ 

జగనన్న ఇళ్లకు సంబంధించిన బిల్లు బకాయిలు సుమారు రూ.22 కోట్లు ఉన్నాయి. వీటిని వారం రోజుల్లో చెల్లిస్తాం. ఇటీవలే రూ.21 కోట్ల బకాయిలు చెల్లించాం.

Updated Date - 2021-12-30T05:39:25+05:30 IST