కరోనా సునామి

ABN , First Publish Date - 2021-05-02T06:44:22+05:30 IST

కరోనా మహమ్మారి జిల్లాలో సునామీ సృష్టిస్తోంది. దేశంలో వైరస్‌ ఎంత స్పీడ్‌గా వ్యాప్తి చెందుతుందో అదే స్పీడ్‌ జిల్లాలో కూడా ఉంటోంది. గత ఏడాది ఏప్రిల్‌లో 79 కేసులే నమోదయ్యాయి.

కరోనా సునామి

గత ఏడాది ఏప్రిల్‌లో 79 కేసులు

ఈ ఏడాది 8118

31 మంది మృతి

కడప, మే 1 (ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారి జిల్లాలో సునామీ సృష్టిస్తోంది. దేశంలో వైరస్‌ ఎంత స్పీడ్‌గా వ్యాప్తి చెందుతుందో అదే స్పీడ్‌ జిల్లాలో కూడా ఉంటోంది. గత ఏడాది ఏప్రిల్‌లో 79 కేసులే నమోదయ్యాయి. రెండో దశలో మాత్రం ఈసారి 8118 మంది వైరస్‌ బారిన పడ్డారు. సరాసరి రోజుకొకరు చొప్పున 31 మందిని బలి తీసుకుంది. సెకండ్‌వేవ్‌ వైరస్‌ వేగాన్ని చూస్తే రాబోయే రోజుల్లో మహమ్మారి మరింత విజృంభిస్తుందన్న ఆందోళన నెలకొంటోంది. ఈనెల మొదటి వారం నుంచి కేసుల సంఖ్య క్రమేపీ పెరుగుతూ వస్తోంది. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటలలోపు 792 మంది వైరస్‌ బారిన పడ్డారు. ఇప్పటి వరకు 64,174 కేసులకు చేరింది. మరో ఇద్దరు మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 564కు చేరింది. ప్రభుత్వ, ప్రైవేటు కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో 1273 మంది చికిత్స పొందుతున్నారు. 2522 మంది హోం ఐసోలేషనలో చికిత్స పొందుతున్నారు.


కరోనా కల్లోలం

రెండో దశ కరోనా వేగంగా విస్తరిస్తూ కలకలం రేపుతోంది. ఈ మహమ్మారి జిల్లాలోకి గత ఏడాది ఏప్రిల్‌ 1న ప్రవేశించింది. ఒకేరోజు 15 కేసులు నమోదై అప్పట్లో కలకలం రేపింది. ఆ ఏడాది ఏప్రిల్‌ నెలలో మొత్తం 79 కేసులు నమోదయ్యాయి. అప్పట్లో కడపలో 14, పులివెందులలో 4, వేములలో 2, బద్వేలులో 4, మైదుకూరులో 4, ఎర్రగుంట్లలో 12, కమలాపురం, సీకేదిన్నె, పుల్లంపేట, చెన్నూరులలో ఒక్కో కేసు నమోదయ్యాయి. అయితే ఈ ఏడాది మాత్రం ఏప్రిల్‌లో మాత్రం 8,118 నమోదు కావడం, 31 మంది మృతి చెందారంటే సెకండ్‌వేవ్‌ ఎంత తీవ్రంగా వ్యాప్తి చెందుతుందో అర్థమవుతుంది. 


ఆంక్షలు ఉన్నా పెరుగుతున్న కేసులు

కరోనా ఉధృతి తీవ్రం కావడంతో జన సంచారాన్ని తగ్గించేందుకు జిల్లాలో సాయంత్రం 6 నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ అమల్లో ఉంది. రైల్వేకోడూరు, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో ముందుగానే ఆంక్షల్లోకి వెళ్లిపోయారు. సాయంత్రం వేళ జనసమూహం గుమికూడకుండా చూసినప్పటికీ వైరస్‌ వ్యాప్తి మాత్రం తీవ్రంగానే ఉంది. మూడురోజులను పరిశీలిస్తే ఏప్రిల్‌ 28న 669 కేసులు, 29న 751, 30న 792 కేసులు నమోదయ్యాయంటే మూడురోజుల వ్యవధిలోనే 2212 కేసులు నమోదయ్యాయి. కడప సిటీలో అయితే  వైరస్‌ చాలా స్పీడ్‌గా సోకుతుంది. కడపలో రోజూ మూడంకెల కేసులు నమోదవుతున్నాయి. జిల్లాలో అత్యధికంగా కడపలోనే కేసులు నమోదై హాట్‌ స్పాట్‌గా మారడం కనిపిస్తుంది. కరోనా వేవ్‌ తీవ్రంగా ఉండడంతో అత్యవసరమైతే తప్ప జనం ఇళ్ల నుంచి బయటకు రాకూడదు. షాపింగ్‌మాల్స్‌, సూపర్‌మార్కెట్లు తదితర వాణిజ్య సముదాయాల్లో జనాల రద్దీ ఎక్కవగా ఉంటుంది. కనుక నిత్యావసర వస్తువులను వీలైనంతగా ఆనలైన ద్వారానే ఆర్డరు తెచ్చుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. నగదు లావాదేవీలకు సంబంధించి బ్యాంకుకు వెళ్లకుండానే వీలైనంత వరకు నెట్‌ బ్యాంకింగ్‌, ఫోనపే, గూగుల్‌ పే, పేటీయం ద్వారా లావాదేవీలు నిర్వహించుకోవడం ఉత్తమమని చెబుతున్నారు. ఇళ్ల నుంచి బయటికి వస్తే ముక్కుపైకి మాస్కులు వేసుకోవడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్‌తో చేతులు కడుక్కోవడం, ఇంటికి వెళ్లిన తరువాత స్నానం చేయడం లాంటివి చేయాలని సూచిస్తున్నారు. 


జిల్లాలో 48 మండలాల్లో పాజిటివ్‌ కేసులు

జిల్లాలో 48 మండలాల్లో 792 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటినలో వెల్లడించింది. మండలాల వారీగా పరిశీలిస్తే.. కడపలో 229 కేసులు నమోదయ్యాయి. ప్రొద్దుటూరులో 58, రాజంపేటలో 45, రాయచోటి 44, పులివెందుల 43, టి.సుండుపల్లె 36, జమ్మలమడుగు 36, బద్వేలు 30, రైల్వేకోడూరు 21, ముద్దనూరు 17, సీకేదిన్నె 17, ఓబులవారిపల్లె 15, యర్రగుంట్ల 14, రాజుపాలెం 13, నందలూరు 11, బి.మఠం 10, మైదుకూరు 10, సంబేపల్లె 10, అట్లూరు 7, గాలివీడు 8, కాశినాయన 8, సిద్దవటం 7, తొండూరు 7, వీఎనపల్లె 6, రామాపురం 3 కేసులు నమోదయ్యాయి. అలాగే కాశినాయన 8, సిద్దవటం 7, సింహాద్రిపురం 16, వీరబల్లె 9, లింగాల 4, ఖాజీపేట 3, కొండాపురం 3, బిమఠం 10, పోరుమామిళ్ల 5, వల్లూరు 4, వేముల 4, ఒంటిమిట్ట 4, గోపవరం 3, ఖాజీపేట 3, కమలాపురం 1, వేంపల్లె 3, చాపాడు 2, చెన్నూరు 2, చిన్నమండెం 2, లక్కిరెడ్డిపల్లె 2, పెండ్లిమర్రి 2, పెనగలూరు 9, చిట్వేలు 1, నందలూరు 11, కలసపాడు 1, మైలవరం 1 నమోదైంది. ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారిలో 3 కేసులు నమోదయ్యాయి. 

Updated Date - 2021-05-02T06:44:22+05:30 IST