ఎరువుల ధరువు

ABN , First Publish Date - 2021-07-13T05:16:42+05:30 IST

గిట్టుబాటు ధరలు లేక.. కరుణించని వరుణుడు.. నకిలీ, కల్తీ విత్తనాలతో ఇప్పటికే అల్లాడుతున్న రైతన్నలపై ఎరువులు దరువు మొదలైంది.

ఎరువుల ధరువు
ఎరువుల బస్తాలను దింపుతున్న కూలీలు

రైతులపై అదనపు భారం

పెరిగిన కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు

బస్తాకు రూ.150 - రూ.200 పెరుగుదల

పెట్రో ధరలు తరహాలోనే రోజువారీగా పెంపు 


(గుంటూరు - ఆంధ్రజ్యోతి) 

గిట్టుబాటు ధరలు లేక.. కరుణించని వరుణుడు.. నకిలీ, కల్తీ విత్తనాలతో ఇప్పటికే అల్లాడుతున్న రైతన్నలపై ఎరువులు దరువు మొదలైంది. ఇప్పటికే సాగు ఖర్చులకు దిగుబడుల నుంచి వచ్చే ఆదాయానికి పొంతన లేదు. ఈ పరిస్థితుల్లో పెరిగిన ఎరువుల ధరలతో రైతులపై పెనుభారం పడింది. దీనికితోడు ఇక నుంచి ఎరువుల ధరల పెంపుదలను కంపెనీలకు ప్రభుత్వం వదిలేసింది. దీంతో ప్రస్తుతం పెట్రోలు, డీజిల్‌ ధరలు రోజురోజుకు ఏవిధంగా మారుతున్నాయో అదే తరహాలో ఎరువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని సమాచారం. అంతర్జాతీయ మార్కెట్‌లో రసాయనిక ఎరువులు తయారు చేసే ముడి సరుకు ధరలు గణనీయంగా పెరిగాయి. ఆ ధరలకు అనుగుణంగా కేంద్రప్రభుత్వం సబ్సిడీలు పెంచలేదు. దీంతో కంపెనీలు ఆ భారాన్ని కొనుగోలుదారులైన రైతులపై వేసేందుకు నిర్ణయించాయి. ఇందుకు కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది. దీంతో కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు పెరిగాయి. కాంప్లెక్స్‌ ఎరువుల బస్తా రూ.150- రూ.200 చొప్పున పెరిగాయి. కాంప్లెక్స్‌ ఎరువులను తయారు చేసే నత్రజని - ఫాస్పేట్‌ - పొటాష్‌ (ఎన్‌-పీ-కే) న్యూట్రియంట్‌ బేస్‌డ్‌ సబ్సిడీకి సంబంధించి పీ2వో5లో కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్పులు చేసింది. దీంతో కాంప్లెక్స్‌ ఎరువుల ధరలను తయారీదారులు పెంచారు. పెంచిన ఎరువుల ధరలు జూలై 1 నుంచి అమలులోకి వచ్చాయని వ్యాపారులు చెబుతున్నారు.  యూరియా, డీఏపీల ధరలు మాత్రం నిలకడగా ఉన్నాయి. యూరియా బస్తా ధర రూ.266-50, డీఏపీ ధర బస్తా రూ.1,200గా ఉంది.   


అన్ని రేట్లు పెంచుతున్నారు

వ్యవసాయరంగంలో రైతులు ఉపయోగించే అన్ని వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరగడంతో ఎకరానికి రూ. 5 వేలు అదనపుభారం పడుతుంది. మరలా ఎరువుల ధరలు పెరగడం వల్ల రైతులపై భారం మరింత పెరుగుతుంది. అదేతరహాలో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పెరగడంలేదు. పండించిన సరుకును అమ్మడానికి కూడా రైతులు ఎన్నోఇబ్బందులు పడుతున్నారు.

- రావిపాటి నానయ్య, పీఏసీఎస్‌ మాజీ అధ్యక్షుడు, మాదల.

Updated Date - 2021-07-13T05:16:42+05:30 IST