వరికపూడిశెల భూసేకరణ వేగవంతం చేయాలి
ABN , First Publish Date - 2021-06-08T06:12:32+05:30 IST
వరికపూడిశెల ఎత్తిపోతల పథకం నిర్మాణానికి అటవీ శాఖ నుంచి తీసుకోబోయే భూములకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ భూమిని అందించే ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ వివేక్‌యాదవ్ ఆదేశించారు.
కలెక్టర్ వివేక్‌యాదవ్
గుంటూరు, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): వరికపూడిశెల ఎత్తిపోతల పథకం నిర్మాణానికి అటవీ శాఖ నుంచి తీసుకోబోయే భూములకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ భూమిని అందించే ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ వివేక్‌యాదవ్ ఆదేశించారు. సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి భూసేకరణ అంశంపై వర్చువల్ విధానంలో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) ఏఎస్ దినేష్‌కుమార్, నీటిపారుదల, రెవెన్యూ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వరికపూడిశెల ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం రూ.340 కోట్లు కేటాయించిందన్నారు. త్వరితగతిన ఆప్రజెక్టు నిర్మాణానికి అవసరమైన 50ఎకరాల అటవీభూమిని సేకరించాలన్నారు. కేంద్ర అటవీచట్టం ప్రకారం ఆ భూమికి ప్రత్యామ్నాయంగా అంతే భూమిని ఆ శాఖకు స్వాధీనం చేయాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ భూముల గుర్తింపు ప్రక్రియని వేగవంతం చేయాలని, ఏప్రాంతాల్లో భూములను గుర్తించారో చెప్పాలన్నారు. బొల్లాపల్లి, వెల్దుర్తి రెవెన్యూ అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకొన్నారు.
జాయింట్ కలెక్టర్ దినేష్‌కుమార్ మాట్లాడుతూ ఇప్పటికే బొల్లాపల్లి, వెల్దుర్తి మండలాల్లో ప్రభుత్వ భూముల గుర్తింపు ప్రక్రియని వేగవంతం చేశామన్నారు. రెవెన్యూ డివిజనల్ అధికారుల ఆధ్వర్యంలో భూముల గుర్తింపు జరుగుతోందని చెప్పారు. రెవెన్యూ భూములను అటవీశాఖ అధికారులకు చూపించి వారి సమ్మతితో సర్వే చేయిస్తామన్నారు. అవసరమైతే అటవీ, రెవెన్యూశాఖల అధికారులు సమన్వయం చేసి భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేస్తామన్నారు. వచ్చేవారంలో మరోసారి సమావేశం నిర్వహించి పనుల వేగాన్ని పెంచి భూములను అప్పగించేందుకు చర్యలు తీసుకొంటామని తెలిపారు. సమావేశంలో నీటిపారుదల శాఖ ఎస్‌ఈ ఎం.బాబూరావు, సర్వే శాఖ ఏడీ రామకృష్ణారెడ్డి, మార్కాపురం డీఎఫ్‌వో బబిత, గుంటూరు డీఎఫ్‌వో రామచంద్రరావు, గురజాల ఆర్డీవో పార్థసారధి, నరసరావుపేట సబ్ కలెక్టర్ శ్రీవాస్ నుపుర్ అజయ్‌కుమార్, బొల్లాపల్లి, వెల్దుర్తి తహసీల్దార్లు పాల్గొన్నారు.