వ్యాక్సినేషన్‌.. అరకొరే

ABN , First Publish Date - 2021-05-21T05:30:00+05:30 IST

కరోనా విజృంభిస్తోంది. ప్రజలు వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు బారులు తీరుతున్నారు. వ్యాక్సిన్‌ సరఫరా మాత్రం అంతంతగానే ఉంది.

వ్యాక్సినేషన్‌.. అరకొరే

శాశ్వత కేంద్రాల్లోనూ అంతంతే

రెండో డోస్‌ టీకా కోసం 5.07 లక్షల మంది నిరీక్షణ

ఇప్పటికి 1.86 లక్షల మందికే రెండు డోసులు పూర్తి

రెండో డోసు కాల వ్యవధి దాటి పోతున్న వారిలో ఆందోళన

తమకు టీకా ఎప్పటికోనని మొదటి డోసు వారిలో అయోమయం



కరోనా మహమ్మారి వణికించేస్తోంది. గ్రామం, పట్టణం అన్న తేడా లేకుండా జిల్లా మొత్తాన్ని చుట్టేస్తోంది. ఈ పరిస్థితుల్లో కరోనా నుంచి రక్షణకు వ్యాక్సినే ఏకైక మార్గమని ప్రజలు భావించారు. అయితే వ్యాక్సిన్‌ అందరికీ అందడంలేదు. ప్రభుత్వం రూపొందించిన ప్రణాళిక ప్రకారం కూడా వ్యాక్సినేషన్‌ సక్రమంగా జరగడంలేదు. రెండు రోజులు వ్యాక్సిన్‌ వేస్తే నిల్వలు అయిపోతున్నాయి. ఇదే క్రమంలో జిల్లాలో పాజిటివ్‌రేట్‌ తగ్గినట్లే తగ్గి శుక్రవారం మళ్లీ పెరిగింది. ఇక ప్రభుత్వం చేపట్టిన ఫీవర్‌ సర్వే సక్రమంగా జరగడంలేదు. తూతూమంత్రంగా సర్వే చేసినట్లు రికార్డులు నింపుతున్నారు. దీంతో కొవిడ్‌ పీడితులు ఎంతమంది ఉన్నారు.. వారు హోం ఐసోలేషన్‌లో సక్రమంగా ఉంటున్నారా లేదా అని తెలుసుకోలేకపోతున్నారు. అందువల్లే వైరస్‌ వ్యాప్తి జరుగుతోందని అధికారులు కూడా భావిస్తున్నారు. 



నరసరావుపేట, మే 21: కరోనా విజృంభిస్తోంది. ప్రజలు వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు బారులు తీరుతున్నారు. వ్యాక్సిన్‌ సరఫరా మాత్రం అంతంతగానే ఉంది. వారంలో నాలుగైదు రోజులే వ్యాక్సినేషన్‌ ప్రక్రియ సాగుతోంది. వ్యాక్సిన్‌ సరఫరా కొరతతో మిగిలిన రోజుల్లో టీకాల కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వ్యాక్సిన్‌ ప్రక్రియ వేగవంతం కావడంలేదు. శాశ్వత కేంద్రాలు ఏర్పాటు చేసినా అరకొరగా వ్యాక్సిన్‌ పంపిణీ  జరుగుతున్నది.  తమకు టీకా ఎప్పుడు అందుతుందో అర్థం కాక రెండో డోసు వ్యాక్సిన్‌ కాల వ్యవధి ముగిసిపోతున్న వారు ఆందోళన చెందుతున్నారు. ఇక మొదటి డోసు వేయించుకోవాలి అనుకునే వారి ఆశలు అడియాశలుగానే మిగిలిపోయాయి. తమకు ఎప్పటికి వ్యాక్సిన్‌ అందుతుందో తెలియని అయోమయ పరిస్థితుల్లో ఆందోళన చెందుతున్నారు. కరోనా విజృంభిస్తుండటంతో వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. ఈ నెలాఖరు లోగా రెండో డోస్‌ వ్యాక్సిన్‌ పంపిణీ పూర్తి చేస్తామని అధికారులు చెప్తున్నా అందుకు తగ్గట్టు వ్యాక్సిన్‌ సరఫరా కావడంలేదు. శుక్రవారం జిల్లాలో నామమాత్రంగా టీకా కార్యక్రమం జరిగింది. కొన్ని సెంటర్లలోనే 2,406 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చారు. 


షెడ్యుల్‌ ప్రకారం జరగని పంపిణీ 

జిల్లాలో ఇప్పటివరకు 6,94,305 మందికి టీకా ఇచ్చారు. రెండు డోసులు పూర్తి చేసుకున్న వారు 1,86,554 మంది ఉన్నారని వైద్య శాఖ అధికారులు తెలిపారు. ఈ లెక్కల ప్రకారం ఇంకా 5,07,751 మందికి రెండో డోసు టీకా ఇవ్వాల్సి ఉంది.  వీరందరూ వ్యాక్సిన్‌ కోసం ఎదురు చూస్తున్నారు.  మొదటి డోసు తీసుకున్న వారిలో 2,74,001 మంది పురుషులు, 2,33,694 మంది మహిళలు, ఇతరులు 56 మంది ఉన్నారు. కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ అధికంగా ఇచ్చారు. వీరందరికీ రెండో డోసు షెడ్యుల్‌ను ప్రకటించినప్పటికీ ఆ మేరకు వ్యాక్సిన్‌ పంపిణీ జరగడంలేదు. కొవిషీల్డ్‌ 5,26,071 మందికి, కోవాక్సిన్‌ టీకా 1,68,234 మందికి ఇచ్చారు. 60 ఏళ్ళు పైబడిన వారు 1,68,262 మంది వ్యాక్సిన్‌ తీసుకున్నారు. 18 నుంచి 30 ఏళ్ళలోపు వారు 42,322 మంది, 30 నుంచి 45 ఏళ్ల వారు 63,699, 45 నుంచి 60 ఏళ్ళ వారు 2,33,341 మంది వ్యాక్సిన్‌ తీసుకున్నారు.


14.20 శాతం మందికే వ్యాక్సిన్‌ 

జిల్లాలో 2011 లెక్కల ప్రకారం 48,89,230 మంది జనాభా ఉన్నారు. ఈ ప్రకారం వ్యాక్సిన్‌ ఇప్పటి వరకు 14.20 శాతం మందికి మాత్రమే వ్యాక్సిన్‌ ఇచ్చారు. కరోనా మహమ్మారి ఉధృతంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో వ్యాక్సిన్‌ అందరికీ త్వరతగతిన అందించాలని జిల్లావాసులు కోరుతున్నారు. 


1,463 మందికి కరోనా

16.35గా పాజిటివ్‌ శాతం

కొవిడ్‌తో మరో ఏడుగురు మృతి


గుంటూరు, మే 21 (ఆంధ్రజ్యోతి): కరోనా సెకండ్‌ వేవ్‌ జిల్లాలో కొనసాగుతోన్నది. శుక్రవారం ఉదయం వరకు 8,946 శాంపిల్స్‌ టెస్టింగ్‌ చేయగా 1,463 మందికి వైరస్‌ సోకింది. పాజిటివ్‌ శాతం 16.35గా నమోదైంది. కొవిడ్‌-19తో ఆరోగ్యం క్షీణించి తాడేపల్లిలో ముగ్గురు, గుంటూరు నగరంలో ఇద్దరు, మేడికొండూరు, గుంటూరు రూరల్‌లో ఒక్కొక్కరు చనిపోయినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. గత వారం నుంచి గుంటూరు నగరంలో తగ్గుతూ వచ్చిన కేసులు శుక్రవారం మళ్లీ పెరిగాయి. 412 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. ఏటీ అగ్రహారంలో 13, గోరంట్లలో 11, ఐపీడీ కాలనీలో 13, స్వర్ణభారతీనగర్‌లో 13, విద్యానగర్‌లో 11తో పాటు 128 కాలనీల్లో కొత్త కేసులు వచ్చినట్లు నగరపాలకసంస్థ కమిషనర్‌ చల్లా అనురాధ తెలిపారు. నరసరావుపేటలో 79, మంగళగిరిలో 73, చిలకలూరిపేటలో 50, తాడేపల్లిలో 49, బాపట్లలో 47, సత్తెనపల్లిలో 44, అమరావతిలో 41, అచ్చంపేటలో 22, బెల్లంకొండలో 3, గుంటూరు రూరల్‌లో 21, క్రోసూరులో 8, మేడికొండూరులో 7, ముప్పాళ్లలో 6, పెదకూరపాడులో 34, పెదకాకానిలో 31, పెదనందిపాడులో 10, ఫిరంగిపురంలో 15, ప్రత్తిపాడులో 5, రాజుపాలెంలో 10, తాడికొండలో 31, తుళ్లూరులో 24, వట్టిచెరుకూరులో 6, దాచేపల్లిలో 16, దుర్గిలో 8, గురజాలలో 12, కారంపూడిలో 11, మాచవరంలో 9, మాచర్లలో 36, పిడుగురాళ్లలో 39, రెంటచింతలలో 4, వెల్దుర్తిలో 6, బొల్లాపల్లిలో 6, యడ్లపాడులో 15, ఈపూరులో 9, నాదెండ్లలో 26, నూజెండ్లలో 8, నకరికల్లులో 21, రొంపిచర్లలో 8, శావల్యాపురంలో 8, వినుకొండలో 9, అమర్తలూరులో 2, భట్టిప్రోలులో 3, చేబ్రోలులో 15, చెరుకుపల్లిలో 5, దుగ్గిరాలలో 6, కాకుమానులో 8, కర్లపాలెంలో 6, కొల్లిపరలో 12, కొల్లూరులో 4, నగరంలో 12, నిజాంపట్నంలో 6, పిట్టలవానిపాలెంలో 11, పొన్నూరులో 16, రేపల్లెలో 27, తెనాలిలో 34, చుండూరులో 10, వేమూరులో 7 కేసులు నమోదైనట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన్‌ తెలిపారు. కొవిడ్‌ నుంచి కోలుకుని 617 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం జిల్లాలో 16,805 యాక్టివ్‌ కేసులున్నాయి. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా కరోనా అనుమానిత లక్షణాలు, కొవిడ్‌ సోకిన వారి కాంటాక్ట్స్‌ 8,946 మంది టెస్టులు చేయించుకున్నారు. కాగా వ్యాక్సినేషన్‌ సెకండ్‌ డోస్‌ని శుక్రవారం 2,489 మంది తీసుకొన్నారు. జిల్లా యంత్రాంగం పెట్టుకొన్న 2,01,872 లక్ష్యానికి చేరువైంది. మరో 10 రోజుల వ్యవధిలో సెకండ్‌ డోస్‌ ప్రక్రియ మొత్తం పూర్తి చేయాల్సిందిగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. జూన్‌ ఒకటో తేదీ నుంచి మళ్లీ ఫస్టు డోస్‌ ప్రక్రియని ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.


యూపీస్కూల్‌ హెచ్‌ఎం మృతి

యడ్లపాడు: మండలంలోని చెంఘీజ్‌ఖాన్‌పేట ఎంపీయూపీ స్కూల్‌ ప్రధానోపాధ్యాయుడు గుండాల అనిల్‌కుమార్‌(46) కరోనా లక్షణాలతో మృతిచెందారు. ఇరవై రోజుల క్రితం అనారోగ్యానికి గురైన ఆయనకు కొవిడ్‌ పరీక్ష నిర్వహించగా పాజిటివ్‌ వచ్చింది. ఆయనతోపాటు భార్యకు కూడా పాజిటివ్‌ రావడంతో ఒంగోలు రిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. భార్య కరోనా నుంచి కోలుకోగా అనిల్‌ చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం మృతి చెందారు. ఫిరంగిపురం గ్రామానికి చెందిన అనిల్‌ కుమార్‌ 2017 నుంచి చెంఘీజ్‌ఖాన్‌పేట ఎంపీయూపీ స్కూల్‌ హెచ్‌ఎంగా విధులు నిర్వహిస్తున్నారు. అనిల్‌కుమార్‌ మృతి పట్ల మండలంలోని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు సంతాపం వ్యక్తం చేశారు.


మండల స్థాయిలో వార్‌ రూమ్‌లు

గుంటూరు, మే 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొవిడ్‌-19 నియంత్రణ కోసం సత్వర చర్యలు తీసుకునేందుకు మండల స్థాయి కొవిడ్‌ వార్‌ రూమ్‌లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతీ మండల కేంద్రంలో వార్‌ రూమ్‌లు 24 గంటలు పని చేసేలా ఏర్పాటు చేయాలని మండలాధికారులను ఆదేశించారు. వార్‌ రూమ్‌ కమిటీకి తహసీల్దార్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఎంపీడీవో, ఎస్‌హెచ్‌వో, మండల వైద్య అధికారి, మెడికల్‌ సూపర్‌వైర్లు సభ్యులుగా ఉంటారు.  ఈ వార్‌ రూమ్‌లో కాల్‌సెంటర్‌ని ఏర్పాటు చేస్తామన్నారు. మునిసిపాలిటీల్లోనూ కొవిడ్‌ వార్‌ రూమ్‌ కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. ప్రతీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ట్రైఏజింగ్‌ నిర్వహించడానికి వీలుగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఇంటింటికి తిరిగి ఫీవర్‌ సర్వే సక్రమంగా జరిగేలా పరిశీలన చేయాలని ఆదేశించామన్నారు.


జీజీహెచ్‌కు 450 రెమ్‌డెసివర్‌

గుంటూరు(తూర్పు): జీజీహెచ్‌కు 450 డోసుల రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్లు శుక్రవారం సరఫరా చేసినట్లు ఈఈ శ్రీనివాసరావు తెలిపారు. నరసరావుపేట ఏరియా ఆస్పత్రికి 30, సత్తెనపల్లి ఏరియా ఆస్పత్రికి 18, గుంటూరు జ్వరాల ఆస్పత్రికి 18 ఇంజక్షన్లు సరఫరా చేశామన్నారు. జిల్లాలోని 8 ప్రైవేటు ఆస్పత్రులకు 702 డోసుల ఇంజక్షన్లు అందజేసినట్టు డ్రగ్‌ కంట్రోలర్‌ ఏడీ అనిల్‌కుమార్‌ తెలిపారు. శుక్రవారం జిల్లాకు 67 టన్నుల ఆక్సిజన్‌ వచ్చిందన్నారు.

Updated Date - 2021-05-21T05:30:00+05:30 IST