ఒంటరి మహిళలే లక్ష్యంగా చైన్‌ స్నాచింగ్‌

ABN , First Publish Date - 2021-05-22T04:37:28+05:30 IST

ఒంటరి మహిళలే లక్ష్యంగా దోపిడీలు, చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను శుక్రవారం నల్లపాడు పోలీసులు అరెస్టు చేశారు.

ఒంటరి మహిళలే లక్ష్యంగా చైన్‌ స్నాచింగ్‌
స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలు, నిందితులతో అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి, సౌత్‌ డీఎస్పీ ప్రశాంతి, నల్లపాడు సీఐ ప్రేమయ్య

ముగ్గురు సభ్యుల ముఠా అరెస్టు

30 గ్రాముల బంగారం, ద్విచక్రవాహనం స్వాధీనం

గుంటూరు, మే 21: ఒంటరి మహిళలే లక్ష్యంగా దోపిడీలు, చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను శుక్రవారం నల్లపాడు పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితులైన గుంటూరుకు చెందిన పఠాన్‌ మహబూబ్‌ సుభాని, వల్లేరు క్రాంతి, కొర్రా అనిల్‌కుమార్‌లను అర్బన్‌ఎస్పీ అమ్మిరెడ్డి మీడియా ఎదుట హాజరుపరచారు. వారి నుంచి 30 గ్రాముల బంగారు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఈనెల 10న విద్యానగర్‌ 3వ లైనులో ఓ ఇంట్లో వృద్ధురాలు ఒంటరిగా ఉండటం గమనించి ఆమె మెడలోని బంగారు ఆభరణాలు తెంచుకెళ్లారు. అలాగే ఈనెల 19న  జేకేసీ కాలేజి రోడ్డులో తల్లీకూతురు నడుచుకుంటూ వెళుతుండగా వారి మెడలోని బంగారు ఆభరణాల గొలుసును తెంచుకెళ్లారు. ఆయా కేసుల్లో అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి ఆదేశాల మేరకు సౌత్‌ డీఎస్పీ జెర్సీ ప్రశాంతి ఆధ్వర్యంలో నల్లపాడు సీఐ కె.ప్రేమయ్య, ఎస్‌ఐ పి.మహేష్‌కుమార్‌, కానిస్టేబుల్‌ ఆదిబాబు, డి.పోతురాజు, షేక్‌ జాన్‌సైదా, షేక్‌ ఎండీ హుస్సేన్‌బాషా, ఎం.సంగంనాయుడు తదితరులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. నిందితులను అరెస్టు చేసిన అధికారులు, సిబ్బందిని అర్బన్‌ ఎస్పీ అభినందించి రివార్డు ప్రకటించారు.


Updated Date - 2021-05-22T04:37:28+05:30 IST