నా భార్య మృతదేహాన్ని ఇవ్వండి..

ABN , First Publish Date - 2021-05-22T04:34:24+05:30 IST

అయ్యా నా రెండు కిడ్నీలు తీసుకోండి.. నా భార్య మృతదేహాన్ని ఇవ్వండి అంటూ పెదకాకానికి చెందిన ఓ వ్యక్తి కాకాని రోడ్డులోని ఉదయ్‌ ఆసుపత్రి యాజమాన్యాన్ని వేడుకున్నాడు.

నా భార్య మృతదేహాన్ని ఇవ్వండి..

కావాలంటే నా కిడ్నీలు తీసుకోండి..

ప్రైవేటు వైద్యశాల యజమాన్యానికి బాధితుడి వేడుకోలు

డబ్బులు కడితేనే మృతదేహాన్ని ఇస్తామన్నారు.. 

సీపీఎం ధర్నాతో దిగొచ్చిన ఆసుపత్రి యాజమాన్యం

పెదకాకాని, మే 21: అయ్యా నా రెండు కిడ్నీలు తీసుకోండి.. నా భార్య మృతదేహాన్ని ఇవ్వండి అంటూ పెదకాకానికి చెందిన ఓ వ్యక్తి కాకాని రోడ్డులోని ఉదయ్‌ ఆసుపత్రి యాజమాన్యాన్ని వేడుకున్నాడు. అప్పటికీ డబ్బు సరిపోకపోతే నా ద్విచక్రవాహనాన్ని కూడా మీరే తీసుకోండి అంటూ ప్రాధేయపడ్డాడు. దీనికి సంబంధించిన వివరాలివి.. పెదకాకానికి చెందిన సంకూరి ఏసురత్నం భార్య ఏసుదయమ్మ(45)కు కొద్దిరోజుల క్రితం కరోనా నిర్ధారణ అయింది. డీఎంహెచ్‌వో లెటర్‌తో ఈ నెల 15న కాకాని రోడ్డులోని ఉదయ్‌ ఆసుపత్రిలో చేర్పించాడు. ఆమె చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున చనిపోయింది. ఆమెకు మెడికల్‌ బిల్లుకింద రూ.3,50,000 చెల్లించి  మృతదేహం తీసుకెళ్ళమని ఆస్పత్రి యాజమాన్యం చెప్పారు. తాము ఆరోగ్యశ్రీ పథకం కింద ఆమెను చేర్పించామని అందుకోసం జిల్లా వైద్యాధికారి సిఫార్సు ఉత్తరం తెచ్చానని తాను అంతడబ్బు చెల్లించలేనని రూ.50వేలు కడతానని ఆసుపత్రి యాజమాన్యాన్ని ఏసురత్నం బతిమలాడాడు. ఆస్పత్రి యాజమాన్యం ఒప్పుకోకపోవడంతో సీపీఎం నాయకులను, ఎలక్ర్టానిక్‌ మీడియా ప్రతినిధులను ఆశ్రయించాడు. సాయంత్రం 5 గంటలకు సీపీఎం నాయకులు నన్నపనేని శివాజీతో పాటు 100 మంది కార్యకర్తలు తరలివచ్చి ఉదయ్‌ ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. మృతదేహాన్ని బాధితునికి అప్పగించాలని డిమాండ్‌ చేశారు. దీంతో ఆసుపత్రి యాజమాన్యం సీపీఎం నాయకులతో చర్చించి ఎట్టకేలకు మృతదేహాన్ని అప్పగించారు. 

Updated Date - 2021-05-22T04:34:24+05:30 IST