తెనాలిలో.. బ్లాక్‌ ఫంగస్‌

ABN , First Publish Date - 2021-05-18T16:00:03+05:30 IST

తెనాలిని ఇప్పటికే..

తెనాలిలో.. బ్లాక్‌ ఫంగస్‌

కొవిడ్‌ తగ్గిన మహిళకు లక్షణాలు

విజయవాడ, గుంటూరు ఆస్పత్రుల్లో అందని వైద్యం

విశాఖ వెళ్లాలనే సూచనతో ఇంటి వద్దనే ఉంటున్న మహిళ


తెనాలి(ఆంధ్రజ్యోతి): తెనాలిని ఇప్పటికే కరోనా రెండో దశ కుదిపేస్తుంటే, తాజాగా బ్లాక్‌ ఫంగస్‌ కలకలం రేపుతోంది. పట్టణంలోని సుల్తానాబాద్‌కు చెందిన కౌతవరపు మల్లీశ్వరికి ఈ లక్షణాలు కనిపించాయి. మల్లీశ్వరి, ఆమె భర్త భద్రయ్యకు గత నెలలో కరోనా వచ్చింది. చికిత్స తీసుకుని సురక్షితంగా ఇంటికి చేరారు. ప్రాణాలు నిలిచాయని వారు సంతోషపడినా, అది ఎన్నో రోజులు నిలవలేదు. ఆమె కన్ను ఎర్రబడి, వాపువచ్చి, ద్రవం కారుతూ ఉంది. అంతేగాక దవడ, గొంతు భాగాల్లో సమస్య వచ్చింది. దీంతో ఆమెను కుటుంబసభ్యులు మొదట తెనాలిలోని ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు తీసుకెళ్లారు. ఈ లక్షణాలకు మెరుగైన చికిత్సకు గుంటూరు సమగ్ర వైద్యశాలకు వెళ్లాలని అక్కడి వైద్యులు సూచించారు.


గుంటూరులోనూ వారికి చికిత్స అందలేదు. దీంతో విజయవాడలోని ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లారు. అక్కడ సిటీ స్కాన్‌ తీసి, రెండో దశలో ఉందని, దీనికి సరైన చికిత్స అందాలంటే విశాఖకు వెళ్లాలని సూచించారని, అయితే అంతదూరం వెళ్లలేక ఇంటి దగ్గరే ఉండిపోయామని కుటుంబసభ్యు లు తెలిపారు. గుంటూరు, విజయవాడలో కూడా అనేక సార్లు తిప్పుకున్నారే కానీ, సరైన చికిత్స అందించలేదని వాపోయారు. చేతలు దాటిపోయే పరిస్థితి వచ్చిందనిపిస్తోందని వారు కన్నీటి పర్యంతమయ్యారు. సోమవారం ఏఎన్‌ఎంలు, ఇతర వైద్య సిబ్బంది వారి ఇంటికి వెళ్లి ఆమె వివరాలు తీసుకున్నారు. దీనిపై తెనాలి జిల్లా వైద్యశాల సూపరింటెండెంట్‌ సౌభాగ్యవాణిని వివరణ కోరితే తమ ఆసుపత్రికి ఆ మహిళ వచ్చి వెళ్లినట్టు తెలియదన్నారు. ప్రస్తుతం ఆ కేసు విషయంలో వైద్యపరమైన పరిశీలన చేస్తున్నామని, మురుగైన చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. 

Updated Date - 2021-05-18T16:00:03+05:30 IST