తొలివిడతలో 2,770 స్థానాల్లో పోటీ

ABN , First Publish Date - 2021-02-05T06:34:52+05:30 IST

తొలివిడత పంచాయతీ పోరులో మొత్తం 2,770 స్థానాల్లో పోటీ అనివార్యమైంది.

తొలివిడతలో 2,770 స్థానాల్లో పోటీ

 సర్పంచ్‌ పదవికి 276 పంచాయతీల్లో 

వార్డులకు 2,494 లో పోలింగ్‌  

మొత్తం 67 స్థానాలు ఏకగ్రీవం


  తెనాలి, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): తొలివిడత పంచాయతీ పోరులో మొత్తం 2,770 స్థానాల్లో పోటీ అనివార్యమైంది. నామినేషన్‌ల పరిశీలన, ఉపసంహరణల గడువు ముగిశాక సర్పంచ్‌ పదవికి 276 పంచాయతీల్లో అభ్యర్థులు పోలింగ్‌కు సిద్దపడుతుంటే, వార్డులకు మాత్రం 2,494 స్థానాల్లో పోటీ జరగనుంది. తెనాలి డివిజన్‌లోని 18 మండలాల్లో 337 పంచాయతీలు, 3,442 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే వీటిలో నామినేషన్‌ల ఉపసంహరణల తర్వాత కొన్ని పంచాయతీలు, వార్డులు ఏకగ్రీవమయ్యాయి. అయితే సర్పంచ్‌, వార్డులు మొత్తం ఏకగ్రీవమైన పంచాతీలు 67 వరకు ఉన్నాయి. డివిజన్‌లో ఒక్క పొన్నూరులోనే అత్యధికంగా 10 పంచాయతీలు ఏకగ్రీవమయితే, చేబ్రోలు, దుగ్గిరాల మండలాల్లో ఒక్క పంచాయతీ కూడా ఏకగ్రీవం కాలేదు. వీటిలో మొత్తం పోటీ నెలకొంది. అయితే సర్పంచ్‌ పదవులు ఏకగ్రీవమైన పంచాయతీల్లో కొన్ని మాత్రం వార్డులుకూడా ఏకగ్రీవమయ్యాయి. బాపట్ల, కాకుమాను, కర్లపాలెం, నగరం, తెనాలిలో సర్పంచ్‌ ఏకగ్రీవమైన పంచాయతీలలో వార్డులూ ఏకగ్రీవమయ్యాయి. అయితే పిట్టలవానిపాలెంలో మాత్రం 6 పంచాయతీల్లో సర్పంచ్‌ పదవులు ఏకగ్రీవమైతే, వార్డులు మాత్రం నాలుగు పంచాయతీలలోనే ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన రెండింటిలో వార్డులకు పోటీ నెలకొంది. సర్పంచ్‌లు ఏకగ్రీవమైనా, వార్డుల్లో మాత్రం భట్టిప్రోలు, చెరుకుపల్లి, కొల్లిపర, కొల్లూరు, పొన్నూరు, రేపల్లె, చుండూరు, వేమూరులలో వార్డులకు పోటీ తప్పనిసరి అయింది. వార్డుల్లో అయితే భారీగా పిట్టలవానిపాలెం, రేపల్లెలలో భారీగా ఏకగ్రీవాలయ్యాయి. ఒక్కో మండలంలో 100కుపైగా వార్డులు ఏకగ్రీవం కావటం విశేషం. బాపట్ల, కాకుమాను, కొల్లిపర మండలాల్లనూ 80 నుంచి 95కుపైగా వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. 

Updated Date - 2021-02-05T06:34:52+05:30 IST