ఆంక్షలు.. అరెస్టులు..
ABN , First Publish Date - 2021-10-21T05:38:08+05:30 IST
టీడీపీ కేంద్ర కార్యాలయం, నాయకులపై దాడులకు నిరసనగా బుధవారం జిల్లావ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా జరిగింది.

పోలీసు నిర్బంధాల మధ్యే బంద్
శాంతి ప్రదర్శనలు, ధర్నాలు, రాస్తారోకోలు
ఎక్కడికక్కడ టీడీపీ నేతల గృహ నిర్బంధం
పోలీసుల వైఖరితో పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత
రోడ్డెక్కిన నాయకులు, కార్యకర్తలను స్టేషన్లకు తరలింపు
గుంటూరులో టీడీపీ జిల్లా కార్యాలయానికి పోలీసుల తాళాలు
టీడీపీ ఆందోళనలకు ఆటంకాలు.. వైసీపీ నిరసనలకు పోలీసు అనుమతులు
ఆందోళనలు.. ఆంక్షలు.. అరెస్టుల మధ్య బుధవారం జిల్లావ్యాప్తంగా టీడీపీ బంద్ ప్రశాంతంగా జరిగింది. పోలీసుల నిర్బంధాల మధ్యే టీడీపీ నాయకులు బంద్ నిర్వహించారు. బుధవారం తెల్లవారుజామునే గుంటూరు నగరం నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు ఎక్కడికక్కడ నాయకులను ఇంటి నుంచి బయటకు రానీయకుండా గృహ నిర్బంధం చేశారు. రోడ్డెక్కిన నాయకులను, కార్యకర్తలను బలవంతంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని వివిధ స్టేషన్లకు తరలించి సాయంత్రం విడుదల చేశారు. గుంటూరులో అయితే పోలీసులు ఒక అడుగు ముందుకేసి పార్టీ జిల్లా కార్యాలయానికే తాళాలు వేశారు. అదేవిధంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పార్టీ కార్యాలయాల్లోకి అడుగుపెట్టకుండా బందోబస్తు నిర్వహించారు. ఎక్కడికక్కడ బంద్‌ను విఫలం చేసేలా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నా.. కార్యకర్తలు, నాయకులు వాటిని అధిగమించి ధర్నాలు, రాస్తారోకోలు, ప్రదర్శనలు చేపట్టారు. టీడీపీ కార్యక్రమాలకు ఆంక్షలు విధించిన పోలీసులు వైసీపీ నిరసనలకు మాత్రం ఎటువంటి ఆటంకం కలగకుండా ప్రత్యేకంగా బందోబస్తు నిర్వహించడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గుంటూరు శంకర్‌విలాస్ సెంటర్లో వైసీపీ నాయకులు టీడీపీ జెండాలను దహనం చేశారు. అయినా పోలీసులు అటువైపు కూడా చూడకపోవటం గమనార్హం.
ఆంధ్రజ్యోతి - న్యూస్‌నెట్‌వర్క్, అక్టోబరు 20: టీడీపీ కేంద్ర కార్యాలయం, నాయకులపై దాడులకు నిరసనగా బుధవారం జిల్లావ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా జరిగింది. తెల్లవారుజాము నుంచే నాయకులు, కార్యకర్తలు నిరసనలు హోరెత్తించారు. పలు ప్రాంతాల్లో పార్టీ నాయకులు ఆందోళనకు సిద్ధమవగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో నేతలకు పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పొన్నూరులో ఆందోళనకు దిగిన మాజీ ఎమ్మెల్యే ధూళ్లిపాళ్ల నరేంద్రను పోలీసులు అరెస్టు చేసి రూరల్ స్టేషన్‌కు తరలించారు. తెనాలిలో టీడీపీ శ్రేణులు బస్సులను అడ్డుకున్నాయి. రేపల్లె బస్టాండ్ సెంటర్లో సీఎం మీడియాకు చెందిన పత్రికలను దగ్ధం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వినుకొండలో టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీ చేపట్టాయి. కాకుమానులో పాఠశాలలకు సెలవు ఇవ్వాలని నాయకులు డిమాండ్ చేయగా పోలీసులు అడ్డుకున్నారు. రాజధాని ప్రాంతం మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరు మండల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగింది. మందడంలో మహిళలు రోడ్డుపై బైఠాయించారు. తాడేపల్లి సెంటర్లో ఆందోళన చేస్తున్న తమను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని స్టేషన్లు తిప్పే క్రమంలో అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు దూషించారని గుంటూరు చెందిన మహిళా నేతలు కంభంపాటి శిరీష, వేగుంట రాణి, ఆశా, వినీలా ఆరోపించారు. నకరికల్లుకి చెందిన నాయకులు అద్దంకి-నార్కెట్‌పల్లి ప్రధాన రహదారిపై నకరికల్లు అడ్డరోడ్డులో, పిడుగురాళ్ల - వాడరేవు రహదారిలో 42వ మైలు రాయి వద్ద రూపెనగుంట్ల నాయకులు, కార్యకర్తలు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.
- టీడీపీ బంద్ పిలుపుతో గుంటూరు నగరంలోని ప్రధాన కూడళ్లలో పెద్దఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. తూర్పు నియోజకవర్గ పరిధిలో బైక్ ర్యాలీ చేశారు. అనంతరం పోలీసు వలయాలను దాటుకుని ఆర్టీసీ బస్టాండ్ చేరుకొని బస్సులను ఆపేయాలంటూ డిమాండ్ చేస్తూ సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బస్సులను అడ్డుకునేందుకు యత్నించిన నసీర్ తదితరులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి పార్సిల్ వ్యాన్‌లో కుక్కి నల్లపాడు స్టేషన్‌కు తరలించారు. పశ్చిమ నియోజకవర్గంలోని జిల్లా కార్యాలయం వద్ద ఆందోళనకు సిద్ధమవుతున్న గుంటూరు పార్లమెంటరీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్, పశ్చిమ ఇన్చార్జి కోవెలమూడి రవీంద్ర, కార్పొరేటర్లు ఈరంటి వరప్రసాద్, కొమ్మినేని కోటేశ్వరరావులను పోలీసులు అదుపులోకి తీసుకొని నల్లపాడు స్టేషన్‌కు తరలించారు. నల్లపాడు స్టేషన్లో ఉన్న నాయకులను ఎవరూ కలిసేందుకు వీలు లేకుండా కట్టుదిట్టం చేశారు. వారి వద్ద ఫోన్లను కూడా లాగేసుకుని సాయంత్రం 6 గంటల సమయంలో వదిలిపెట్టారు.
- వినుకొండకు చెందిన నాయకులను అరెస్టు చేసిన పోలీసులు మొదట శావల్యాపురం అని ఆ తర్వాత బొల్లాపల్లికి తరలిస్తామని చెప్పడంతో వాగ్వివాదం చోటుచేసుకుంది. వారిని ఈపూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారన్న సమాచారంతో కార్యకర్తలు పెద్దసంఖ్యలో వినుకొండలోని జీవీ గృహం వద్దకు చేరుకున్నారు. పోలీసులు అడ్డుకున్నా వారు ఆర్టీసీ బస్టాండ్‌కు వరకు ప్రదర్శన నిర్వహించి శివయ్యస్థూపం సెంటర్లో ధర్నా చేపట్టారు. ఈ క్రమంలో రూరల్ సీఐ అశోక్‌కుమార్ సిబ్బందితో కలిసి ధర్నాను భగ్నం చేసేందుకు పలు మార్లు ప్రయత్నించినప్పటికీ కార్యకర్తల ఆగ్రహానికి వెనుతిరగాల్సి వచ్చింది. బొమ్మరాజుపల్లి, ఈపూరు గ్రామాలలో ర్యాలీలు జరిగాయి. వినుకొండ, నూజెండ్ల టీడీపీ నాయకులను ఈపూరు పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. శావల్యాపురం మండలంలోని కారుమంచి గ్రామంలో బీసీ నాయకుల ఆధ్వర్యంలో బంద్ జరిగింది.
- ప్రత్తిపాడులో బంద్ నిర్వహించకుండా పార్టీ కార్యాలయం వద్ద ఉన్న నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. దీంతో మరికొందరు గుంటూరు పర్చూరు రహదారిలో కోయవారిపాలెం వద్ద రాస్తారోకో చేపట్టారు. పుల్లడిగుంట వద్ద రాస్తారోకో చేపట్టగా పోలీసులు విఫలం చేశారు. పోలీసులు గ్రామాల్లో పెట్రోలింగ్ నిర్వహించి మరీ ఆందోళన కార్యక్రమాలను అడ్డుకున్నారు.
- చిలకలూరిపేట నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు బంద్ చేయకుండా పోలీసులు అడ్డుకున్నారు. నాయకులను ముందుగానే పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. అయినా పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు జాతీయ రహదారి వరకు ర్యాలీగా చేరుకుని ఆందోళన చేపట్టగా పోలీసులు స్టేషన్‌కు తరలించారు. చిలకలూరిపేట-నరసరావుపేట మార్గంలో నాదెండ్ల మండలం కనపర్రు బావి వద్ద టీడీపీ నాయకులు, కార్యకర్తలు రహదారిపై టైరు తగలబెట్టి ధర్నా చేశారు.
- బాపట్లలో నియోజకవర్గ ఇన్చార్జి వేగేశన నరేంద్రవర్మ, పార్టీశ్రేణులను పోలీసులు అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు. దీంతో టీడీపీశ్రేణులు, పట్టణ పోలీసుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. అంబేద్కర్సర్కిల్లో పెద్దఎత్తున నిరసనకు దిగారు.
- వేమూరు మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలను స్వచ్ఛందంగా మూసి వేసిన వ్యాపారులు, ప్రజలు బంద్‌కు మద్దతు తెలిపారు. గ్రామంలో నాయకులను ఉదయం 9 గంటల లోపే పోలీసులు గృహ నిర్బంధం చేశారు. వేమూరులో పార్టీ శ్రేణులు ర్యాలీ నిర్వహించగా, జంపనిలో ప్రధాన రహదారిపై ధర్నా చేశారు. అమృతలూరులో ర్యాలీగా వెళ్లి ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, పాఠశాలలను మూయించారు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెనాలి - చెరుకుపల్లి ప్రధాన రహదారిపై ధర్నా చేశారు.
- భట్టిప్రోలు బస్టాండ్ వద్ద రాస్తారోకో చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం అక్కడి నుంచి రఽథం సెంటర్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. తహసీల్దారు కార్యాలయం వద్ద ధర్నాకు ఉపక్రమించగా పోలీసులు చెదరగొట్టారు.
- తెనాలిలో బంద్ విజయవంతమైంది. ఉదయం 5గంటలకు ఆర్టీసీ బస్టాండ్‌కు చేరి బస్సులను నిలిపివేశారు. విజయవాడ, తెనాలి, గుంటూరు రహదారుల్లో ఎటువంటి వాహనాలు ముందుకు కదలకుండా అడ్డుపడ్డారు. మహిళలు, యువకులు ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, బ్యాంకులకు వెళ్లి బంద్ అవసరాన్ని తెలిపి మూసివేయించారు. పోలీసులు అడ్డుకున్నా పార్టీ శ్రేణులు వారిని చేధించుకుని ముందుకు వెళ్లి కార్యక్రమాలను నిర్వహించాయి. చివరకు కొంతమంది నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

- సత్తెనపల్లి బస్టాండ్‌సెంటర్, తాలుకా సెంటర్, నరసరావుపేట రోడ్డులో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఆందోళన చేస్తున్న పార్టీ నాయకులను, కార్యకర్తలను పట్టణ ఇన్చార్జ్ సీఐ నరసింహరావు ఆధ్వర్యంలో పోలీసులు అరెస్టు చేశారు.
- పొన్నూరులో ఐలాండ్ సెంటర్ నుంచి నిరసన ప్రదర్శన చేపట్టగా పోలీసులు నాయకులను అరెస్టు చేశారు. నరేంద్ర అరెస్టు విషయం తెలిసిన టీడీపీ శ్రేణులు ఐలాండ్ సెంటర్లో పోలీసుల వాహన శ్రేణిని చుట్టుముట్టారు. పట్టణంలో ప్రదర్శన నిర్వహించి దుకాణాలు, వాణిజ్య సముదాయాలను మూసివేయించారు.
- గురజాల పెద్దపాలకేంద్రం వద్ద టీడీపీ శ్రేణులు ధర్నా చేశాయి. అనంతరం బ్రహ్మనాయుడు విగ్రహం వద్ద మరోసారి రోడ్డుపై బైఠాయించారు. పిడుగురాళ్లలోని పార్టీ కార్యాలయం వద్ద పోలీసులు పహారా కాసి ఎవరిని బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఎర్రవాగువద్ద అద్దంకి-నార్కెట్‌పల్లి రహదారిపై ఽ పాత టైర్లను దహనం చేశారు.
నరసరావుపేటలో ఆర్టీసీ బస్టాండ్ వద్దకు వెళుతున్న పార్టీ శ్రేణులను ఓవర్ బ్రిడ్జిపై పోలీసులు అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులకు పార్టీ శ్రేణుల మద్య తోపులాట జరిగింది. అరెస్టు చేసిన అరవింద బాబును శావల్యాపురం పోలీసు స్టేషన్‌కు తరలించారు. తెలుగుదేశం కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. కాకాని వద్ద వినుకొండ రహదారిపై, రావిపాడు వద్ద హైదరాబాదు రహదారిపై రాస్తారోకో నిర్వహంచారు.
- మంగళగిరిలో పోలీసులు ముఖ్యనేతలను హౌస్ అరెస్టు చేశారు. పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్న వారిని అరెస్టు చేసి పట్టణ, రూరల్ పోలీసుస్టేషన్లకు తరలించారు. కొందరు కార్యకర్తలు తాలూకా సెంటర్ వైపుకు ప్రదర్శనగా వస్తుండగా వారిని కూడా అరెస్టు చేశారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారు బస్టాండ్ సెంటర్లో తెలుగు మహిళలతో కలిసి కొద్దిసేపు రాస్తారోకో చేశారు. దుగ్గిరాల మండలం చిలువూరు, రేవేంద్రపాడు, తుమ్మపూడి గ్రామాల్లో బంద్ విజయవంతంగా నిర్వహించారు. అయితే ఎస్ఐ శ్రీనివాసరెడ్డి పలు గ్రామాల్లో దుకాణాదారులు, ప్రభుత్వ కార్యాలయాల వద్దకు వెళ్లి యథావిధిగా తమ విధులు నిర్వర్తించుకోవాలని అడ్డుకుంటే ఫిర్యాదు చేయాలని సూచించారు.
- తాడికొండ మండలంలో బంద్ విజయవంతమైంది. మోతడక గ్రామంలో సీఎం జగన్ దిట్టబొమ్మను దగ్ధం చేశారు. కంతేరు గ్రామంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాం వద్ద నిరసనలు తెలిపారు. తాడికొండ పోలీస్‌స్టేషన్ వద్ద నుంచి చింత చెట్టు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. తుళ్లూరులో ఆర్టీసీ బస్సులను అడ్డుకున్నారు. దొండపాడు, మందడంలో ధర్నా చేశారు.
- పెదకూరపాడులో ర్యాలీని, రాస్తారోకోను నిర్వహించారు. అమరావతిలో పాఠశాలలు, బ్యాంక్‌లను మూయించారు. సీఐ శివప్రసాద్ టీడీపీ నాయకులను అరెస్టు చేయడంతో పార్టీ శ్రేణులు స్టేషన్ బయట ధర్నాకు దిగారు.
నాయకుల అరెస్టు.. ఉద్రిక్తత
టీడీపీ తలపెట్టిన బంద్‌ను పోలీసులు విఫలం చేసుందుకు ముందస్తుగా పలువురు నేతలను గృహ నిర్బంధం చేశారు. గుంటూరులో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ మోహనకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రామకృష్ణ, మహిళా నేత పానకాల వెంకట మహాలక్ష్మి, తదితరులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. తొలుత ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆనందబాబును పోలీసులు అడ్డుకోగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బైక్‌పై వెళ్లేందుకు యత్నించగా మళ్లీ అడ్డుకోవడంతో పోలీసులకు, టీడీపీ నేతల మధ్య వాగ్వివాదం, తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు బలవంతగా ఆనందబాబును ఆయన క్యాంపు కార్యాలయంలోకి తీసుకెళ్లారు. వట్టిచెరుకూరులో పార్టీ మండల అధ్యక్షుడు మన్నవ పూర్ణచంద్రరావును గృహ నిర్బంధం చేయడంతో నాయకులు, కార్యకర్తలు కొర్నెపాడు గ్రామానికి తరలివచ్చి ఆందోళన చేశారు. బంద్‌లో పాల్గొనేందుకు సిద్ధమైన ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ను అడ్డుకున్న పోలీసులు గృహ నిర్బంధం చేశారు. నిరసన తెలిపే హక్కు ఉందని భీష్మించగా ఆయనను స్వగ్రామం చింతలపూడి నుంచి పట్టణంలోని రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పిడుగురాళ్ల పట్టణ అధ్యక్షుడు పాండురంగ శ్రీను, జిల్లా మైనార్టీసెల్ అధ్యక్షుడు సయ్యద్ అమీర్‌ఆలి, గుత్తికొండ సుభానితోపాటు మరికొంత మంది నాయకులను ముందుగానే హౌస్అరెస్టు చేశారు. కారంపూడి మండల అధ్యక్షుడు ఉన్నం లక్ష్మీనారాయణ, మాజీ అధ్యక్షుడు పంగులూరి అంజయ్యలను గృహ నిర్బంధం చేశారు.
=========================================================================
