తంగెడలో అసలేం జరిగింది?

ABN , First Publish Date - 2021-10-11T05:29:12+05:30 IST

గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లి మండలంలో ఉన్న తంగెడ గ్రామంలో భారీ భూకుంభకోణానికే రెవెన్యూవర్గాలు తెరతీశాయి.

తంగెడలో అసలేం జరిగింది?

తెర వెనక సూత్రదారులపై చర్యలు శూన్యం

కేవలం వీఆర్‌వో సస్పెన్షన్‌తో సరిపెట్టిన అధికారులు

గుంటూరు, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లి మండలంలో ఉన్న తంగెడ గ్రామంలో భారీ భూకుంభకోణానికే రెవెన్యూవర్గాలు తెరతీశాయి. సుమారుగా 9 ఎకరాల వరకు వివాదంలో ఉన్న భూమి, నకిలీ దస్తావేజులను నలుగురు వ్యక్తుల పేర్ల మీద వెబ్‌ల్యాండ్‌లోకి చేర్చిన ఉదంతం వెనక పెద్దఎత్తున డీల్‌ జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వెబ్‌ల్యాండ్‌లోకి ఖాతాదారుని పేరు చేర్చాలంటే పెద్ద తతంగం ఉంటుంది. ప్రధానంగా తహసీల్దార్‌దే బాధ్యత. అయితే తంగెడలో జరిగిన భూ అక్రమాల్లో మాత్రం చిరుద్యోగి అయిన వీఆర్‌వో ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించినట్లుగా ఉన్నతాధికారులకు నివేదించి చర్య తీసుకొన్నారు. అయితే వీఆర్‌వో కంటే పైన ఉండే రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌, డిప్యూటీ తహసీల్దార్‌, తహసీల్దార్‌పై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. 

దాచేపల్లి మండలంలోని తంగెడలో వివిధ సర్వే నెంబర్లలో 13 ల్యాండ్‌ పార్శిల్స్‌ని వేర్వేరు వ్యక్తుల పేర్లతో వెబ్‌ల్యాండ్‌లోకి చేర్చారు. ఒకే వ్యక్తి పేరు మీద 3.32 ఎకరాలు, మరొకరి పేరు మీద 3.10 ఎకరాలను చేర్చారు. ఇంకొకరి పేరు మీద 2.02 ఎకరాలు, వేరొకరి పేరు మీద 2.08 ఎకరాల భూమిని వెబ్‌ల్యాండ్‌లో చేర్చారు. అయితే ఈ భూములు వివాదంలో ఉన్నాయి. దస్తావేజులు కూడా నకిలీవి. నిబంధనల ప్రకారం మీ-సేవ/సచివాలయాల నుంచి వచ్చిన అర్జీలను తొలుత వీఆర్‌వో ఫీల్డ్‌ ఎంక్వయిరీ చేసి ప్రతిపాదనలు పంపించాలి.  ఆ తర్వాత రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌, డిప్యూటీ తహసీల్దార్‌ వాటిని పరిశీలించి అన్ని సవ్యంగా ఉంటేనే తహసీల్దార్‌ ఆమోదం కోసం పంపించాలి. ఈ ముగ్గురు రిమార్కులు ఆధారంగా తహసీల్దార్‌ ఫీల్డ్‌ ఇన్‌స్పెక్షన్‌ చేసిన తర్వాతనే డిజిటల్‌ సిగ్నేచర్‌ చేసి వెబ్‌ల్యాండ్‌లోకి చేర్చాలి. అయితే ఈ విధానాన్ని తంగెడలో ఎక్కడా పాటించలేదు. 

వీఆర్‌వో తనని తప్పుదోవ పట్టించాడని తహసీల్దార్‌గా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారి కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌కి ఫైల్‌ పెట్టడంపై అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. భూమి విషయంలో తహసీల్దారుదే పూర్తి బాధ్యత అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే తంగెడలో మాత్రం ఇందుకు విరుద్ధంగా వాస్తవాలను కప్పి పెట్టి కలెక్టర్‌కి నివేదించి అందరికంటే చిరుద్యోగి అయిన వీఆర్‌వోపై సస్పెన్షన్‌ చర్యలు తీసుకొనేలా చేశారు. కాగా ఈ వ్యవహారంలో అసలు సూత్రదారులు ఎంచక్కా తప్పించుకొన్నారు. ఇందుకు కారణం సూత్రదారులకు వైసీపీ నేత నుంచి అండదండలు పుష్కలంగా లభించడమేనన్న చర్చ జరుగుతోంది. ఇదిలావుంటే జిల్లాలోని కొన్ని మండలాల్లో డిప్యూటీ తహసీల్దార్లు నేతల అండదండలతో తహసీల్దార్లుగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సీసీఎల్‌ఏ మార్గదర్శకాల ప్రకారం మూడు నెలలకు మించి ఎఫ్‌ఏసీ ఇవ్వడానికి వీల్లేదు. అయినప్పటికీ నెలలు/సంవత్సరాల తరబడి కొంతమంది డీటీలు తహసీల్దార్లుగా కొనసాగుతోన్నారు. ఇది కూడా భూఅక్రమాలకు ఒక కారణంగా మారింది. 


Updated Date - 2021-10-11T05:29:12+05:30 IST