గ్రామాల్లో తలెత్తుకోలేక పోతున్నాం...

ABN , First Publish Date - 2021-11-28T05:39:37+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం పాలకవర్గాలతో కనీసం చర్చించకుండా పంచాయతీ నిఽధులను వెనక్కి తీసుకోవడాన్ని సర్పంచులు ఖండించారు.

గ్రామాల్లో తలెత్తుకోలేక పోతున్నాం...
వినతిపత్రం ఇచ్చేందుకు కలెక్టర్‌ కార్యలయంకు ర్యాలీగా వచ్చిన సర్పంచలు

సర్పంచల ఆవేదన

కలెక్టర్‌, జేసీ, డీపీవోలకు వినతిపత్రాలు అందజేత

గుంటూరు(తూర్పు), నవంబరు27: రాష్ట్ర ప్రభుత్వం పాలకవర్గాలతో కనీసం చర్చించకుండా పంచాయతీ నిఽధులను వెనక్కి తీసుకోవడాన్ని సర్పంచులు ఖండించారు. ప్రజలకు ఎన్నో హామీలిచ్చి ఎన్నికల్లో గెలిచామని నిధులు లేకపోతే కనీస సౌకర్యాలు కూడా కల్పించలేకపోతున్నామని వాపోయారు. సర్పంచల జిల్లాస్థాయి సమావేశాన్ని శనివారం ఇన్నర్‌రింగురోడ్డులోని ఓ కల్యాణమండపంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో నిధుల్లేక ఉత్సవ విగ్రహలుగా మారామని, ప్రజల ముందు తలెత్తుకు తిరగలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని, గ్రామాలకు రావల్సిన నిధులను మాత్రమే అడుగుతున్నామని స్పష్టం చేశారు. సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా పెట్టిన బిల్లులు నెలల తపబడి పెండింగ్‌లో ఉంటున్నాయని, పంచాయతీలకు సీఎఫ్‌ఎంఎస్‌ విధానాన్ని మినహాయించి, పాత విధానంతోనే బిల్లులను చెల్లించాలని డిమాండ్‌ చేశారు. సర్పంచల గౌరవవేతనం ఎప్పటికప్పుడు చెల్లించాలని, స్వచ్ఛసంకల్పం నిర్వహణ ఖర్చులను పంచాయితీలకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఇవ్వాలని కోరారు. సచివాలయ సిబ్బందిపై పూర్తి అజమాయిషీ సర్పంచులకే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సమావేశం అనంతరం కలెక్టరేట్‌కు చేరుకుని అక్కడ నిరసన తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌, జేసీ రాజకుమారి, డీపీవో కేశవరెడ్డిలకు వినతిపత్రాలను అందజేశారు.


సర్పంచల సంఘం జిల్లా అధ్యక్షుడిగా పాపారావు


అంతకుముందు సర్పంచల సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడిగా రేపల్లె మండలం, లంకవాని దిబ్బ సర్పంచ చిలకలపూడి పాపారావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశంలో గ్రామ సర్పంచలు ముప్పాళ్ల మనోహర్‌, ఆలీ, తోకల సరోజిని, టి.కృష్ణమోహన, మాజీ సర్పంచల సంఘం అధ్యక్షుడు  కాటూరి శ్రీనివాసరావు, పంచాయతీ పరిషత రాష్ట్ర  చైర్మన జాస్తి వీరాంజనేయులు వివిధ గ్రామాలకు చెందిన దాదాపు 200మంది సర్పంచలు పాల్గొన్నారు. 


Updated Date - 2021-11-28T05:39:37+05:30 IST