ఊరూర.. నోరూర.. తింటే Biryani నే తినాలి.. తగ్గేదేలే..!

ABN , First Publish Date - 2021-12-19T05:40:53+05:30 IST

అమ్మ.. ఈ రోజు బిర్యానీ చేయలేదు.. అంటూ ఓ పిల్లవాడు ముద్దుముద్దుగా అనే మాటలు ఓ మధ్య యాడ్‌లో అందరినీ ఆకర్షించాయి..

ఊరూర.. నోరూర.. తింటే Biryani నే తినాలి.. తగ్గేదేలే..!

  • ఆహార వ్యాపారంలో అగ్రస్థానం
  • జిల్లాలో రోజుకు రూ.లక్షల్లో వ్యాపారం
  • సాధారణ భోజనశాలల స్థానంలో బిర్యానీ పాయింట్లు
  • బిర్యానీ మాస్లర్లకు ఫుల్‌ డిమాండ్‌
  • ఎవరికైనా ఆకలైందంటే చాలు బిర్యానీ ఆన్‌లైన్‌ ఆర్డర్‌ 
  • నలుగురు కలిస్తే చాలు.. బకెట్‌ బిర్యానీ
  • స్టాటిస్టిక్‌ ది క్వారంటైన్‌ సర్వేలో వెల్లడి
  • కొత్త కొత్త రుచులు కోరుతున్న ఆహార ప్రియులు 


పలావ్‌, కిడిచి, బిర్యానీ.. ఈ మూడింటిలో మీకెదిష్టమని ఎవరినైనా అడిగితే టక్కున బిర్యానీ అనే చెబుతారు. హోటల్‌ భోజనం చేయాల్సి వచ్చినా.. సంప్రదాయ ఆహారాన్ని కాదని ఈ బిర్యానీ వైపే మొగ్గు చేపుతున్నారు. చిన్న చిన్న పార్టీల్లో, పెద్ద ఫంక్షన్లలో.. సందర్భం ఏదైనా ఇదే వడ్డిస్తున్నారు. దీంతో ఆహార వ్యాపారంలోనూ ఇదే అగ్రస్థానంలో ఉంది. ఆన్‌లైన్‌ ఆర్డర్లలోనూ దీని పెద్దపీట వేస్తున్నారు. పలు సర్వేలు ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నారు. ఆహార ప్రియుల కోసం బిర్యానీలోనే కొత్తకొత్త ఫ్లేవర్లు వచ్చి చేరుతున్నాయి. 


గుంటూరు, డిసెంబరు 18: అమ్మ.. ఈ రోజు బిర్యానీ చేయలేదు.. అంటూ ఓ పిల్లవాడు ముద్దుముద్దుగా అనే మాటలు ఓ మధ్య యాడ్‌లో అందరినీ ఆకర్షించాయి.. గతంలో పండుగ సమయాల్లో.. వేడుకల్లో మాత్రమే తయారు చేసుకునే బిర్యానీ ఇప్పుడు తరచూ వంటింట్లో ఘుమఘుమ లాడుతోంది. లేదంటే వీకెండ్‌ పార్టీల్లో తప్పనిసరిగా ఉంటోంది. అంతెందుకు.. ఆకలైందంటే చాలు.. ఆన్‌లైన్‌ ఆర్డర్‌ పెట్టాలంటే ముందుగా గుర్తుకు వచ్చేది బిర్యానీనే. ఇది ఓ వ్యాపారంగా కూడా అభివృద్ధి చెందింది. ఫుడ్‌ మార్కెటింగ్‌లో ప్రస్తుతం బిర్యానీనే ప్రథమ స్థానంలో ఉందంటే.. దీనిపై ప్రజలెంత మక్కువ చూపుతున్నారో అర్ధమతువుతోంది. గతంలో శాఖాహార భోజనశాల, ఆర్యవైశ్య భోజనశాల, మిలటరీ భోజనశాల... ఇలా ఉండేవి. ఇప్పుడు బూతద్దం వేసి వెతికినా అటువంటివి కనిపించడం లేదు. ఎక్కడ చూసినా బిర్యానీ హోటళ్లే. గతంలో శాఖాహార హోటళ్లు నడిపిన వారు కూడా కస్టమర్లను, వ్యాపారాన్ని దృష్టిలో ఉంచుకుని నాన్‌వెజ్‌ బాటలో నడుస్తున్నారు. 


జిల్లాలో రూ.లక్షల్లో వ్యాపారం

జిల్లాలో రోజూ రూ.లక్షల్లో వ్యాపారం జరుగుతోందంటే ఆశ్చర్యపోవాల్సిందే. గుంటూరు నగరంలో బ్రాండెడ్‌ బిర్యానీ హోటళ్లు దాదాపు 20కి పైగానే  ఉండగా.. బిర్యానీ పాయింట్లు, హోటళ్లు దాదాపు వెయ్యికిపైగా ఉన్నట్లు ఓ అంచనా. ఒక్కో హోటల్‌లో రోజుకు 20 నుంచి 100 కేజీల వరకు బిర్యానీ వండుతున్నారు. నరసరావుపేట, తెనాలి వంటి మునిసిపల్‌ కేంద్రాల్లోనే కాదు.. దాదాపు అన్ని పట్టణాల్లోనూ బిర్యానీ సెంటర్లు ఉన్నాయి. రూ.వంద కంటే తక్కువే బిర్యానీ లభిస్తుండడంతో శాఖాహార భోజనం చేసేవారు కూడా దీనిపైపు మొగ్గు చూపుతున్నారు. ఓ హోటల్‌లో రోజుకు 25 కేజీల బిర్యానీ తయారు చేస్తే రూ.5000 మేరకు ఖర్చవుతుంది. ఇందులో ఖర్చులు పోను రూ.2,500 మిగులుతుందని బిర్యానీ వ్యాపారి తెలిపారు. దీంతో అన్నిచోట్ల ఈ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది. 


ఎంతో మందికి ఉపాధి.. 

బిర్యానీ బిజినెస్‌ జిల్లాలో వేలమందికి ఉపాధి చూపుతోంది. రోజుకు 50 కేజీల బిర్యానీ వండే హోటలలో సుమారు 20 మంది పని చేస్తుంటారు. కూరగాయలు తరగడం నుంచి వడ్డించడం వరకు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఇక వంటమాస్టర్ల విషయానికొస్తే వీరికి ఎక్కడ లేని డిమాండ్‌ ఉంది. రోజుకు రూ.వెయ్యి కి పైగా కూలీ తీసుకునే మాస్టర్లు కూడా ఉన్నారు. స్థానికంగా చేయితిరిగినవారు కొందరు వంటమాస్టర్లుగా ఉండగా హైదరాబాద్‌ నగరం, బీహార్‌, రాజస్తాన్‌  రాష్ర్టాల నుంచి వచ్చిన వారు ఇక్కడ వంటమాస్టర్లుగా ఉపాధి పొందుతున్నారు. పెద్ద హోటళ్లలో ఉత్తరాదికి చెందిన వంటమాస్టర్లను కూడా పిలిపిస్తున్నారు. 


కొత్త కొత్త ఫ్లేవర్లలో..

బిర్యానీ వంటకాల్లో కొత్త రుచులు కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. చికెన్‌తో చేసినా, మటన్‌తో చేసినా అందులో కొత్తదనం చూపిస్తే.. చాలు ఆహార ప్రియులు వాటికి ఆకర్షితులవుతున్నారు. బిర్యానీలో ఎప్పటికీ అగ్రస్థానంలో ఉండేది హైదరాబాద్‌ బిర్యానీ. గుంటూరు నగరంలో ఆ పేరుతో చాలా హోటళ్లలో బిర్యానీ విక్రయిస్తున్నారు. చికెన్‌ వంటకాలతో గతంలో ఫ్రైడ్‌ బిర్యానీ, వింగ్స్‌ బిర్యానీ, బొంగు బిర్యానీ.. ఇలా రకరకాలుగా ఉండేవి. ఇప్పుడు కచ్చీ బిర్యానీ కొత్తగా మార్కెట్‌లో వచ్చింది. సగం బిర్యానీ రైస్‌, సగం వైట్‌ రైస్‌తో ఇది ఉంటుంది. కచ్చీ బిర్యానీ పేరుతో నగరంలో పలు హోటళ్లు కూడా వెలిశాయి. నలుగురు కలిసి తినాలంటే బకెట్‌ బిర్యానీ ఆర్డర్‌ చేస్తున్నారు. 


బిర్యానీ బియ్యం, పదార్ధాలూ ప్రత్యేకమే..

గతంలో మామూలు బియ్యాంతో పలావు చేసేవారు. మార్కెట్‌లో ఇప్పుడు పలావుకు, బిర్యానీకి వేర్యేరుగా బియ్యం లభ్యమవుతున్నాయి. ముఖ్యంగా ఇందులో బాస్మతీ రైస్‌ వాడతారు. ఇవి కేజీ రూ.60 నుంచి రూ.200 వరకు ధర పలుకుతున్నాయి. పంజాబ్‌ ప్రాంతం నుంచి దిగుమతి అయ్యే ఈ బియ్యాన్ని ప్రముఖ కంపెనీలు ఆకర్షణీయమైన ప్యాక్‌లలో విక్రయిస్తున్నాయి. ఒక్కో కుటుంబం సరాసరి నెలకు నాలుగు కేజీల బిర్యానీ రైస్‌ను వాడుతున్నారు. దీంతో పాటు బిర్యానీలో వాడే పదార్ధాలకు(ఇన్‌గ్రీడియెంట్స్‌) డిమాండ్‌ పెరిగింది. షాజీరా, జాజికాయ, జాపత్రి, బిర్యానీ ఆకు.. ఇలా పలు పదార్ధాలు ఆహార ప్రియులు ప్రత్యేకంగా కొనుగోలు చేస్తున్నారు. చికెన్‌, మటన్‌, ఫిష్‌.. ఇలా నాన్‌వెజ్‌ వంటకాలకు ఇవి వేర్వేరుగా దొరుకుతున్నాయి కూడా..!


వంటపాత్రలు, కొలతలు ప్రత్యేకమే..

బిర్యానీ తయారు చేసేందుకు వంట పాత్రలూ ప్రత్యేకంగా మార్కెట్‌లోకి వస్తున్నాయి. ఎత్తు తక్కువగా వెడల్పాటి ఆకారంలో వీటిని విక్రయిస్తున్నారు. బిర్యానీ అండీ అని పిలిచే వీటిని షాపింగ్‌ మాల్స్‌లోనూ వీటిని విక్రయిస్తున్నారు. వీటిలో వండితో బిర్యానీ సరిగ్గా ఉడుకుతుందని మహిళలు చెబుతున్నారు. బిర్యానీ తయారు చేసే క్రమంలో ఉడికించే సమయం, కొలతలు.. అన్నీ ప్రత్యేకంగా ఉంటాయి. ఇవే ప్రత్యేక రుచిని తీసుకువస్తాయి. 

 

స్టాటిస్టిక్స్‌ ద క్వారంటైన్‌ ఎడిషన్‌ చేసిన సర్వేలో అత్యధికంగా ఆర్డర్‌ చేసింది బిర్యానీనే. కరోనా సమయంలో ఓ డెలివరీ సంస్థ నుంచి 5 లక్షల మందికి పైగా బిర్యానీ ఆర్డర్‌ చేయగా.. ఆ తర్వాతి స్థానంలో బటర్‌నాన్‌, మసాలా దోశ ఉన్నాయి.

 

ఇంటిలోనూ నలభీములు..

గతంలో బిర్యానీ ఎప్పుడో పండుగ రోజుల్లోనే తయారు చేసేవారు. కానీ ఇప్పుడు యూట్యూబ్‌ పుణ్యమా అని నెలకు ఒకటి రెండు సార్లు ఇంట్లోనే బిర్యానీ వండేస్తున్నారు. మహిళల సహా సెలవు రోజుల్లో మగవాళ్లు కూడా తమ పాక ప్రావీణ్యాన్ని చూపుతున్నారు. మాంసం ముట్టనివారు వెజ్‌ బిర్యానీలో ఫ్లేవర్లను ఇష్టపడుతున్నారు. వీరికోసం మష్రూమ్‌ బిర్యానీ, పనస బిర్యానీ వంటివి అందుబాటులో ఉన్నాయి. 


వాట్సప్‌లో బిర్యానీ గ్రూపులు 

ఈ మధ్య కొత్తగా బిర్యానీ ప్రియులు వాట్సప్‌లలో ఓ గ్రూప్‌గా ఏర్పడుతున్నారు. నగరంలో ఎక్కడ బిర్యానీ కొత్తగా వచ్చింది..? ఫ్లేవర్‌ ఎలా ఉంది..? ధర ఎంత..? ఇలాంటివి ఇందులో షేర్‌ చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఆహార ప్రియులైన యువత ఇలాంటి గ్రూప్‌లను క్రియేట్‌ చేస్తోంది. 

Updated Date - 2021-12-19T05:40:53+05:30 IST