ప్రేమ పేరుతో వల!

ABN , First Publish Date - 2021-11-03T05:12:25+05:30 IST

ప్రేమ పేరుతో గురజాల రూరల్‌ ఎస్‌ఐ చంగా నాగార్జున తమను మోసం చేశాడని పలువురు బాధిత మహిళలు మంగళవారం రూరల్‌ ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

ప్రేమ పేరుతో వల!
గురజాల రూరల్‌ ఎస్‌ఐ నాగార్జున

భార్య ఫిర్యాదుతో ఎస్‌ఐపై కేసు నమోదు

వీఆర్‌కు పంపుతూ రూరల్‌ ఎస్పీ ఆదేశాలు

 గుంటూరు, నవంబరు 2: ప్రేమ పేరుతో గురజాల రూరల్‌ ఎస్‌ఐ చంగా నాగార్జున తమను మోసం చేశాడని పలువురు బాధిత మహిళలు మంగళవారం రూరల్‌ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో అతనిని వీఆర్‌కు పంపుతూ మంగళవారం ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి..  నెల్లూరు జిల్లా సంగంకు చెందిన లావణ్య, నాగార్జున 2017లో ప్రేమించి వివాహం చేసుకున్నారు. అచ్చంపేటలో ఎస్‌ఐగా పనిచేస్తున్న సమయంలో భార్యతో అక్కడే కాపురం పెట్టాడు. పెళ్లయిన కొద్ది నెలలకే అదనపు కట్నం కోసం వేధిస్తుండటంతో బాధితురాలు పోలీస్‌స్టేషన వద్దే ధర్నాకు దిగటంతో పెద్దలు రాజీ కుదిర్చి కాపురం సరి చేశారు. ఆ తర్వాత 15 రోజులకు తనను కొట్టి ఇంటి నుంచి గెంటేశాడని బాధితురాలు లావణ్య అప్పట్లోనే ఎస్పీని ఆశ్రయించారు. ఈ కేసు కోర్టు విచారణలో ఉంది. అదేసమయంలో ఎస్‌ఐ నాగార్జున కూడా భార్య నుంచి విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించాడు. ఇదిలావుంటే నెల్లూరు జిల్లా చిట్టుమూరు మండలంలో టీచర్‌గా పనిచేస్తున్న ఓ యువతిని నాగార్జున ట్రాప్‌ చేసి మోసం చేశాడని ఆమె తల్లిదండ్రులు రూరల్‌ ఎస్పీని ఆశ్రయించారు.  ఇదిలావుంటే తన నగలు విషయంలో ఎస్‌ఐను ఆశ్రయిస్తే రాజీ చేస్తానని డబ్బులు తీసుకుని మోసం చేశాడని మరో మహిళ ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.  భార్య లావణ్య, మరో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై శాఖాపరమైన విచారణకు ఎస్పీ ఆదేశించారు. విచారణలో ఆరోపణలు రుజువైతే తగు చర్యలు తీసుకుంటామని ఎస్పీ విశాల్‌గున్నీ తెలిపారు.  


Updated Date - 2021-11-03T05:12:25+05:30 IST