బడుల్లో.. ఎక్కిళ్లు

ABN , First Publish Date - 2021-12-10T05:16:08+05:30 IST

పేరుకు మంచినీటి కోసం ఆర్వో ప్లాంట్లు ఉంటాయి.. కానీ వాటిల్లో తలెత్తే సాంకేతిక లోపాలు సవరించే నాథుడే ఉండడు.

బడుల్లో.. ఎక్కిళ్లు
గుంటూరు కేవీపీ కాలనీలోని మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్కూల్‌లో ట్యాప్‌ నీరు తాగుతున్న విద్యార్థులు

మరమ్మత్తుల్లో తాగునీటి పథకాలు

ప్రభుత్వ పాఠశాలల్లో తీరని దాహం

400పైగా వినియోగంలో లేని ఆర్వో పాంట్లు 

ఇళ్ల నుంచి బాటిళ్లలో తెచ్చుకుంటున్న విద్యార్థులు

కోట్లు కుమ్మరిస్తున్నా అంతంతమాత్రంగా సౌకర్యాలు 

 

సర్కారు పాఠశాలల్లో విద్యార్థుల దాహం తీరడం లేదు. గత ప్రభుత్వం ఏర్పాటుచేసిన మినరల్‌ వాటర్‌ప్లాంట్లు మూలన పడ్డాయి. ప్రస్తుత ప్రభుత్వం నాడు-నేడు పేరిట ఏర్పాటు చేసిన మినరల్‌ వాటర్‌ ప్లాంట్లు పని చేయకపోవడం, కొన్నిచోట్ల పూర్తి కాకపోవడం వల్ల విద్యార్థులకు సురక్షిత తాగు నీరు అందడం లేదు. పాఠశాలల్లో మౌలిక వసతులపై కేంద్ర జలశక్తి కమిషన్‌ ఓ నివేదిక ఇచ్చింది. ఇందులో పాఠశాలల్లో సౌకర్యాలు మేడిపండు చందంగా ఉన్నాయని పేర్కొది.

 

రోజంతా బడిలో గడిపే ఆడిపాడే విద్యార్థులకు ఇంటి నుంచి తెచ్చుకునే లీటరు మంచినీరు ఏ మాత్రం చాలడం లేదు. దీంతో పాఠశాలల్లో ఉన్న చేతిపంపులు, కుళాయిలు, వాటర్‌ ట్యాంకుల్లో రక్షితం కాని నీటినే తాగుతున్నారు. దీంతో జబ్బుల బారిన పడుతున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. ప్రభుత్వం నాడు-నేడు మొదటి ఫేజ్‌లో మినరల్‌వాటర్‌ ప్లాంట్లను ప్రవేశపెట్టింది. కొన్ని పాఠశాలల్లో ఈ ప్లాంట్లు పనిచేయకపోగా, మరికొన్ని పాఠశాలల్లో పూర్తి చేయలేకపోయారు. తాజాగా ప్రభుత్వం ఏ పాఠశాలల్లో ఎలాంటి తాగునీటి అవకాశాలు ఉన్నాయో తెలపాలంటూ మండలాల వారీగా బుధవారం నివేదిక తెప్పించుకుంది. వందలాదిమంది విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో రక్షిత నీటి పథకం కోసం ఏర్పాటు చేసిన మినరల్‌ వాటర్‌ ప్లాంట్లను సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. 


ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌, డిసెంబరు9: పేరుకు మంచినీటి కోసం ఆర్వో ప్లాంట్లు ఉంటాయి.. కానీ వాటిల్లో తలెత్తే సాంకేతిక లోపాలు సవరించే నాథుడే ఉండడు. అక్కడ మరుగుదొడ్లు ఉంటాయి.. కానీ వాటికి నీటి సరఫరా ఉండదు ఫలితంగా వినియోగంలోకి రావు... జిల్లాలోని పాఠశాలల్లో దుస్థితి ఇది. జిల్లాలో గుర్తింపు పొందిన పాఠశాలలు 4,900 ఉండగా వాటిలో ప్రభుత్వ పాఠశాలలు 2800 వరకు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆధ్వర్యంలోని  2.,714 పాఠశాలల్లో తాగునీటి సౌకర్యాలు లేవు. విద్యార్థులు ఇంటివద్ద నుంచే బాటిళ్లలో తాగునీరు తెచ్చుకుంటుంటారు.  నాడు నేడు పథకంలో తాజాగా జిల్లాలో 400కిపైగా పాఠశాలల్లో ఒక్కోటి రూ.1.80 లక్షలు వెచ్చించి ఆర్వో పాంట్లు ఏర్పాటు చేశారు.  


ప్రధానోపాధ్యాయులు బాధ్యులా?

జిల్లాలో నాడు నేడు ఫేజ్‌-1 కింద పాఠశాలల్లో ఏర్పాటుచేసిన ఆర్వోపాంట్లు 468 పనిచేయడం లేదని ప్రధానోపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు. ప్లాంటు ఏర్పాటు చేసిన ఏజన్సీలు సమస్యలు పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేస్తున్నాయి. కాంట్రాక్టు ప్రకారం ఏడేళ్లు సర్వీసు అందించాలి. వారు సరిగా స్పందించక పోవడంతో ఆర్వోప్లాంట్లు పనిచేయడం లేదు.. ఎన్నిసార్లు సాంకేతిక సిబ్బందికి విజ్ఞప్తి చేసినా ఫలితం లేదని ఉపాధ్యాయ సంఘ నాయకులు పేర్కొంటున్నారు. ఇందుకు హెచ్‌ఎంలు బాఽధ్యులు కాదని అంటున్నారు.


వేమూరు నియోజకవర్గంలోని 26 ఉన్నత పాఠశాలు ఉండగా వాటిలో ఎనిమిదింటిలో గత ప్రభుత్వ హయాంలో వాటర్‌ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ఇందులో ఆరు పాఠశాలల్లో మూడేళ్లుగా ఆర్వో ప్లాంట్లు పనిచేయడం లేదు. 

చిలకలూరిపేట మునిసిపాలిటీలో 17 పాఠశాలల్లో నాడు-నేడులో భాగంగా ఆర్వోప్లాంట్లు మంజూరు చేశారు. ఏ ఒక్కటి కూడా వినియోగంలోకి రాలేదు. దీంతో కొన్ని పాఠశాలల్లో మినరల్‌ వాటర్‌ బబుల్స్‌ వేయించుకుంటుండగా కొన్ని పాఠశాలలో విద్యార్థులు ఇంటినుంచే బాటిళ్లతో తాగునీరు తెచ్చుకుంటున్నారు. యడ్లపాడు మండలంలో నాడు-నేడు పథకం కింద 19 పాఠశాలల్లో ఆర్వోప్లాంట్లు ఏర్పాటు చేశారు. వాటిని వినియోగంలోకి తీసుకురాలేదు. మిగిలిన పాఠశాలల్లో అసలు ఆర్వోప్లాంట్లు లేవు. 

సత్తెనపల్లి మండలంలో 93 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. అందులో 28 పాఠశాలల్లో నాడు-నేడు పథకం కింద వాటర్‌ప్లాంట్లు మంజూరుచేశారు. గత ప్రభుత్వ హయాంలో 13పాఠశాలల్లో వాటర్‌ప్లాంట్లు మంజూరుచేసినప్పటికీ అవి మూలనపడ్డాయి. నాడు-నేడు కింద మంజూరైన వాటర్‌ప్లాంట్లలో కొన్ని పనిచేయక నిరుపయోగంగా ఉన్నాయి. నకరికల్లు మండలంలో 12 పాఠశాలల్లో ఆర్వోప్లాంట్లు ఏర్పాటు చేశారు. మంచినీటి కుళాయిలకు పైపులైన్‌ సక్రమంగా లేకపోవటంతో అవి సరిగా పనిచేయటం లేదు. ముప్పాళ్ల మండలంలో 12 పాఠశాలలకు ప్రభుత్వం ఆర్వో ప్లాంటును అందజేసింది. అందులో సంగం పాఠశాలల్లో సాంకేతిక లోపం కారణంగా ప్లాంట్లు పనిచేయటం లేదు. 

పెదకూరపాడు మండలంలో కన్నెగండ్ల, లగడపాడు, హుస్సేన్‌నగరం, కాశిపాడు, గ్రామాల్లోని వాటర్‌ ప్లాంట్లు పని చేయటం లేదు. క్రోసూరు మండలంలో నాడు - నేడు పాఠశాలలకు ఆర్‌వో ప్లాంట్లను ప్రభుత్వం సరఫరా చేసినప్పటికీ ఆ పాఠశాలలు ఉపయోగించకుండా మూలన పడ వేశారు. 88 తాళ్ళూరు జిల్లాపరిషత్‌ హైస్కూల్‌, ఎలిమెంటరీ స్కూల్‌, ఊటుకూరు, బయ్యవరం, పీసపాడు, క్రోసూరు, విప్పర్ల, గుడిపాడు గ్రామాల్లో ఇవి పనిచేయటం లేదు. అచ్చంపేట మండలంలో చెరుకుంపాలెం, ఆర్‌కేజీపాలెం పాఠశాలల్లో ప్లాంట్లు మూలన పడ్డాయి. 

 పిడుగురాళ్ల జడ్పీ పాఠశాలలో నాడునేడులో భాగంగా వాటర్‌ప్లాంటు ఏర్పాటు చేశారు. ప్లాంట్‌కు సంబంధించి వైర్లను ఎలుకలు కొరికేయటంతో నీళ్లు రావడం లేదు. మరమ్మత్తులు చేయటానికే మూడునెలల సమయం గడిచిపోయింది. పిల్లలంతా గతంలో రోటరీక్లబ్‌ ఏర్పాటు చేసిన వాటర్‌ప్లాంట్‌ను  ఉపయోగించుకోగా ఎక్కువమంది ఇంటివద్ద నుండే బాటిళ్లను తెచ్చుకుంటున్నారు.  దాచేపల్లి మండలం కేశానుపల్లి పాఠశాలలోనూ వాటర్‌ప్లాంట్‌ మరమ్మతులకు గురైంది. 

 వినుకొండ నియోజకవర్గంలో  32 ఉన్నత పాఠశాలలు ఉండగా అందులో 10 పాఠశాలలో తాగునీటి ఆర్వోప్లాంట్లు పనిచేయడం లేదు. నాడు-నేడు లో 116 పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేశారు. వివిధ కారణాలతో 40 పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లు పని చేయడంలేదు. 

 పొన్నూరు పురపాలక సంఘం పరిధిలోని శ్రీరామ మున్సిపల్‌ హైస్కూల్‌లో నిధుల కొరతతో ఆర్వో ప్లాంటు  పూర్తి కాలేదు. బాపట్ల పట్టణ, మండలంలో నాడు-నేడు కింద 31 పాఠశాలలో, కర్లపాలెం మండలంలో 11 పాఠశాలలో, పిట్టలవానిపాలెం మండలంలో 17పాఠశాల్లో ఆర్వోప్లాంట్‌లు ఏర్పాటు చేశారు. వీటిల్లో కనీసం 50శాతం కూడా పనిచేయటంలేదు.  

మాచర్ల నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలంలో దాదాపుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్వోప్లాంట్లు నిరూపయోగంగా ఉన్నాయి. మండలంలో నాడు-నేడు కింద 24 పాఠశాలలకు ప్లాంట్లు మంజూరయ్యాయి. కొన్ని పాఠశాలలో ఆర్వో ప్లాంటు సామాగ్రిని తీసుకొచ్చినప్పటికీ నిరుపయోగంగా ఉన్నాయి.    

Updated Date - 2021-12-10T05:16:08+05:30 IST