నజరానా ఎప్పుడో?
ABN , First Publish Date - 2021-02-26T06:17:51+05:30 IST
గ్రామాల్లో ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగిన పంచాయతీలకు ప్రభుత్వం నజరానాలు ప్రకటించింది.

జిల్లాలో 262 పంచాయతీల్లో ఏకగ్రీవం
విడుదల చేయాల్సిన మొత్తం రూ.20 కోట్లు
ఎదురుచూస్తున్న సర్పంచులు
గుంటూరు(ఆంధ్రజ్యోతి), ఫిబ్రవరి25: గ్రామాల్లో ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగిన పంచాయతీలకు ప్రభుత్వం నజరానాలు ప్రకటించింది. దీనికి సంబంధించి జనవరి 26న జీవో 34ను విడుదల చేసింది. రెండు వేల జనాభాల లోపు ఉన్న గ్రామ పంచాయతీలకు రూ.5లక్షలు, రెండు నుంచి 5వేల లోపు జనాభా ఉన్న గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షలు, ఐదువేల నుంచి పదివేల జనాఽభా ఉన్న పంచాయతీలకు రూ.15లక్షలు, పదివేల జనాభా దాటిన పంచాయతీలకు రూ.20లక్షలు ప్రకటించింది.
గతంలో ఇలా..
2006 గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మైనర్ పంచాయతీకి రూ.5 లక్షలు, మేజర్ పంచాయతీకి రూ.15 లక్షలు ప్రోత్సాహక నగదుగా ప్రభుత్వం విడుదల చేసింది. 2013లో దీనిని మైనర్ పంచాయతీకి రూ.7లక్షలు, మేజర్ పంచాయతీకి రూ.20 లక్షలు పెంచారు.
జిల్లాలో 262 పంచాయతీల్లో ఏకగ్రీవాలు
తాజాగా నాలుగు దశల్లో జరిగిన ఎన్నికల్లో 262 పంచాయతీల్లో సర్పంచ్, వార్డుమెంబర్లు పూర్తిగా ఏకగ్రీవ ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం ఆయ గ్రామాల్లో కొత్తసర్పంచ్‌లు బాధ్యతలు స్వీకరించారు. ఏడు మేజర్, 155 మైనర్ పంచాయతీలకు సుమారు రూ.20 కోట్ల వరకు ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం నజరానా విడుదల చేయాలి. గతంలో ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు పారితోషికం ఇవ్వలేదని అనేకసార్లు అసెంబ్లీలో చర్చకు వచ్చింది. తాజాగా పారితోషికం ఎప్పుడు విడుదల చేస్తారో అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది.