ఆర్టీసీ బస్సుల్లోనే వెంకన్న శీఘ్ర దర్శన టిక్కెట్లు

ABN , First Publish Date - 2021-02-05T06:14:34+05:30 IST

ఆర్టీసీ బస్సుల్లో తిరుమలకు ప్రయాణించే భక్తులకు టీటీడీ అమూల్యమైన అవకాశం కల్పించింది.

ఆర్టీసీ బస్సుల్లోనే వెంకన్న శీఘ్ర దర్శన టిక్కెట్లు

గుంటూరు, ఫిబ్రవరి 4: ఆర్టీసీ బస్సుల్లో తిరుమలకు ప్రయాణించే భక్తులకు టీటీడీ అమూల్యమైన అవకాశం కల్పించింది. తిరుమలలో శ్రీవారి శీఘ్ర దర్శనం కల్పించేలా రూ.300 టిక్కెట్లను అందించేలా ఏర్పాట్లను పునరుద్ధరించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ప్రయాణికులకు వెయ్యి టిక్కెట్లు కేటాయించేలా ఈ నెల ఒకటో తేదీ నుంచే టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌ చేసుకొనే ప్రయాణికులకు టిక్కెట్లతో పాటు అదనంగా రూ.300 చెల్లించి శ్రీవారి శీఘ్ర దర్శన టిక్కెట్లును పొందవచ్చు.   నిత్యం ఉదయం 11 గంటలకు, మరలా సాయంత్రం 4 గంటలకు శీఘ్ర దర్శనం పొందే అవకాశం కల్పించింది. ప్రయాణికులు తిరుమల చేరుకొన్న రోజు నుంచి మూడు రోజుల్లో ఏదో ఒక రోజు శీఘ్ర దర్శన టైమ్‌స్లాట్‌ బుక్‌ చేసుకునే అవకాశం కల్పించింది. గతంలో ఈ పథకం ఉన్నప్పటికీ  తాత్కాలికంగా నిలిపివేశారు. ఏడాది తరువాత తిరిగి ఈ పథకాన్ని పునరుద్ధరించారు. గుంటూరు రీజియన్‌ నుంచి ఆర్టీసీ తిరుపతికి 10 సర్వీసులు నడుపుతోంది. బెంగళూరు వెళ్ళే మరో మూడు సర్వీసులు వయా తిరుపతి మీదుగా వెళ్ళనున్నాయి. ఈ అవకాశాన్ని ఆర్టీసీ ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్‌ఎం రాఘవకుమార్‌ కోరారు. 

ఆర్టీసీ ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌లో సవరణ


ఆర్టీసీ ఆన్‌లైన్‌ టిక్కెట్‌ బుకింగ్‌ కోసం వెబ్‌సైట్‌లో స్వల్ప మార్పు చేసినట్లు ఎన్టీఆర్‌ బస్టాండ్‌ అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ శ్రీనివాసరెడ్డి తెలిపారు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీఎస్‌ఆర్‌టీసీఆన్‌లైన్‌.ఇన్‌కు బదులుగా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీఎస్‌ఆర్‌టీసీఆన్‌లైన్‌.ఓఆర్‌జీ.ఇన్‌ వెబ్‌సైట్‌ ద్వారా టిక్కెట్లు ముందస్తు రిజర్వేషన్‌ చేసుకోవచ్చన్నారు. ఇందుకు సంబంధించిన ఫిర్యాదులు, సూచనల కోసం 0866-2570005 నెంబర్‌లో సంప్రదించాలని కోరారు. 


Updated Date - 2021-02-05T06:14:34+05:30 IST