రోడ్లన్నీ గుంతలమయం

ABN , First Publish Date - 2021-09-03T06:10:30+05:30 IST

కొద్దిపాటి వర్షాలతో జిల్లా వ్యాప్తంగా రోడ్లు గుంతలతో నిండిపోయాయి. అంతర్గత రోడ్లతో పాటు ప్రధాన రహదారుల్లోనూ కుండగుంతలు ఏర్పడ్డాయి.

రోడ్లన్నీ గుంతలమయం

ప్రమాదకరంగా కుండగుంతలు

తాత్కాలిక మరమ్మతులు మరిచిన అధికారులు

నరకదారులుగా మారాయని ప్రతిపక్షాల వినూత్న నిరసన

ప్రధాన సమస్యలపై నేటి డీఆర్‌సీలో చర్చకు వచ్చేనా?


గుంటూరు, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): కొద్దిపాటి వర్షాలతో జిల్లా వ్యాప్తంగా రోడ్లు గుంతలతో నిండిపోయాయి. అంతర్గత రోడ్లతో పాటు ప్రధాన రహదారుల్లోనూ కుండగుంతలు ఏర్పడ్డాయి. గుంటూరు నగరంలోని పలు రహదారులపై ఉన్న గుంతల్లో ద్విచక్ర వాహనదారులు అదుపు తప్పి పడి తీవ్రగాయాలు పాలౌతున్నారు. కనీసం తాత్కాలికంగానైనా రోడ్లపై ఏర్పడిన గుంతలను పూడ్చడానికి రోడ్లు, భవనాల శాఖ అధికారులు మరమ్మతులు చేపట్టలేదు. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు రోడ్లపై మొక్కలు నాటి వినూత్నంగా నిరసన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఎలాంటి చలనం ఆ శాఖలో కనిపించడం లేదు. ఏటా నిర్వహించే వార్షిక మరమ్మతులకు ప్రభుత్వం బడ్జెట్‌ నిలిపేయడంతో ఎక్కడా రోడ్లకు రిపేర్లు జరగని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో శుక్రవారం జిల్లా ఇన్‌చార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అధ్యక్షతన జరిగే డీఆర్‌సీ సమావేశంలోనైనా రోడ్ల మరమ్మతుల అంశం చర్చకు రావాలని జిల్లా ప్రజానీకం కోరుకొంటున్నది. జిల్లా ప్రజలు ఎదుర్కొంటోన్న ప్రధాన సమస్యలపై చర్చించేందుకు డీఆర్‌సీ మీటింగ్‌ అజెండాలో అంశాలు రూపొందించకుండా వేరేవి చేర్చడంపై విమర్శలు వ్యక్తమౌతున్నాయి. సమావేశంలో తొలి అంశంగా గృహ నిర్మాణంపై సమీక్షిస్తారని సభ్యులకు తెలిపారు. అలానే కొవిడ్‌, సీజనల్‌ వ్యాధులు, ఉపాధి హామీ పనులు, డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ అర్బన్‌ క్లినిక్స్‌, వ్యవసాయం, నీటిపారుదల, భూసర్వేపై చర్చిస్తామని పేర్కొన్నారు.  


పేదల ఇళ్ల పురోగతి తక్కువే

జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీరంగనాథరాజు స్వయంగా గృహనిర్మాణ శాఖని పర్యవేక్షిస్తున్నారు. అయినా  జిల్లాలో పేదలందరికీ ఇళ్ల పథకం పురోగతి చాలా తక్కువగా ఉన్నది. తొలి దశలో మొత్తం 1,22,435 ఇళ్లు నిర్మించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటిలో ఇప్పటివరకు 1,10,265 ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేశారు. బేస్‌మెంట్‌ కంటే దిగువున 79,477 నిర్మాణాలు ఉండటం పరిస్థితిని కళ్లకు కడుతున్నది. కేవలం 3,127 నిర్మాణాలే బేస్‌మెంట్‌ స్థాయిలో ఉన్నాయి. రూఫ్‌ స్థాయికి 586 చేరాయి. 504 కట్టడాలు రూఫ్‌ పూర్తి అయ్యాయి. ఇప్పటివరకు పూర్తి అయిన ఇళ్లు కేవలం 13గా ఉన్నాయి. 26,558 ఇళ్ల నిర్మాణాలు అసలు ప్రారంభమే కాలేదు. ఇదిలావుంటే  ఎవరైతే పొదుపు సంఘాల మహిళలు పక్కా ఇళ్లు నిర్మించుకోరో వారిపై క్రిమినల్‌ కేసులు పెడతామని, సంక్షేమ పథకాలన్ని నిలిపేస్తామని వలంటీర్లు, సచివాలయ కార్యదర్శులు బెదిరిస్తోన్నారు. కొత్తగా ఇళ్ల పట్టాల కోసం దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య పెరుగుతనే ఉన్నది. 64,835 మంది దరఖాస్తు చేసుకుంటే వారిలో 32,993 మందిని అర్హులుగా తేల్చారు. 31,784 దరఖాస్తులను తిరస్కరించారు. అర్హులైన వారిలో కేవలం 11,349 మందికే పట్టాలు ఇచ్చారు. మిగతా వారికి ఇవ్వాలంటే 430.09 ఎకరాల భూమి అవసరమని లెక్కించారు. ఈ భూమిని ఎప్పుడు సేకరించి అర్హులకు ఇస్తారో తెలియని పరిస్థితి నెలకొన్నది. ఇక ఇసుక కొరత వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వెంటాడుతూనే ఉన్నది. పింఛన్ల తొలగింపు ప్రక్రియ వివిధ మార్గాల్లో కొనసాగుతున్నది. వీటన్నింటిపైనా డీఆర్‌సీలో చర్చ జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు.   

Updated Date - 2021-09-03T06:10:30+05:30 IST