రెవెన్యూలో వింత పోకడలు
ABN , First Publish Date - 2021-10-26T04:58:30+05:30 IST
రెవెన్యూ శాఖలో గతంలో ఎప్పుడూ లేని విధంగా వింత పోకడలు చోటు చేసుకుంటున్నాయి.

ఇష్టారీతిన ఇన్‌చార్జిల నియామకం
శావల్యాపురం ఇన్‌చార్జిగా పెదకాకాని తహసీల్దారు
కాకుమాను తహసీల్దారుకి గుంటూరు పశ్చిమ బాధ్యతలు
బొల్లాపల్లి డీటీ.. ఈపూరులో మండల ఇన్‌చార్జిగా?
గుంటూరు, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): రెవెన్యూ శాఖలో గతంలో ఎప్పుడూ లేని విధంగా వింత పోకడలు చోటు చేసుకుంటున్నాయి. 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండలానికి వేరే చోట పని చేస్తున్న తహసీల్దార్‌ని ఇన్‌చార్జిగా నియమించారు. దీంతో ఆయన హెడ్‌క్వార్టర్స్ ఏదో తెలియని పరిస్థితి ఉత్పన్నమైంది. పొరుగు మండలంలో తహసీల్దారు ఉన్నప్పటికీ ఆయనను కాదని మరో మండలంలోని డిప్యూటీ తహసీల్దారుకు ఇన్‌చార్జి తహసీల్దారుగా బాధ్యతలు అప్పగించారు. ఇలాంటి వింతలు గతంలో ఎప్పుడూ చూడలేదని రెవెన్యూవర్గాలు పేర్కొంటున్నాయి. వైసీపీ నేతల పెత్తనం హద్దులు దాటుతోండటంతోనే ఈ పరిస్థితి తలెత్తుతోందన్న అభిప్రాయం రెవెన్యూవర్గాల్లో వ్యక్తమౌతున్నది. ఇటీవలే కాకుమాను తహసీల్దార్ వెంకటేశ్వర్లుని గుంటూరు పశ్చిమ తహసీల్దార్‌గా పూర్తి అదనపు బాధ్యతలు కేటాయించారు. కాగా ఈ రెండు మండలాలకు మధ్యన దాదాపుగా 45 కిలోమీటర్ల దూరం ఉన్నది. ఈ నేపథ్యంలో ఆయనకు హెడ్‌క్వార్టర్స్ ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. అంతేకాకుండా రెండు మండలాల్లో డ్రాయింగ్ ఆఫీసర్ బాధ్యతలు కూడా నిర్వహించాలి. ఒకే అధికారి రెండు చోట్ల జీతాల బిల్లులపై సంతకాలు చేస్తే ఆడిట్ అభ్యంతరాలు వచ్చే అవకాశం లేకపోలేదు. అలానే ఈ రెండు మండలాల్లో ఎక్కడైనా శాంతిభద్రతల సమస్య తలెత్తితే తహసీల్దారు అక్కడికి వెళ్లేసరికి పుణ్యకాలం పూర్తి అవుతుంది. అలానే స్పందన వంటి అర్జీల పరిష్కారంలో వెనకబడిపోయే అవకాశం లేకపోలేదు. కాగా తాజాగా ఇలాంటి వింతే మరొకటి చోటు చేసుకొన్నది. పెదకాకాని తహసీల్దార్ ఎం డానియేల్‌ని 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న శావల్యాపురం మండలానికి ఇన్‌చార్జిగా నియమించారు. ఈపూరు మండలానికి తహసీల్దారుగా బొల్లాపల్లి మండలానికి చెందిన డిప్యూటీ తహసీల్దార్‌ని నియమించారు. సహజంగా పక్క మండలంలో తహసీల్దారు పోస్టు ఖాళీ ఏర్పడితే పొరుగున ఉన్న మండలంలో తహసీల్దార్‌ని ఇన్‌చార్జిగా నియమిస్తారు. లేదంటే అదే మండలానికి చెందిన డీటీకి బాధ్యతలు ఇస్తారు. ఇక్కడ బొల్లాపల్లికి చెందిన డీటీ ఏవీ సుధాకర్‌కి ఈపూరు మండలం తహసీల్దారు ఇన్‌చార్జి బాధ్యతలు కేటాయించారు. బొల్లాపల్లిలో పూర్తిస్థాయి తహసీల్దారు ఉన్నప్పటికీ అతడ్ని విస్మరించి డీటీకి ఇన్‌చార్జి ఇచ్చారు. వీటన్నింటి వెనక వైసీపీ నేతల సిఫార్సులు, ఆదేశాలు, విజ్ఞప్తులున్నాయన్న విషయం బహిరంగ రహస్యమే.