ఆక్రమణల క్రమబద్ధీకరణకు మరో అవకాశం

ABN , First Publish Date - 2021-08-28T05:23:46+05:30 IST

ప్రభుత్వ భూముల్లో నిరభ్యంతర ఆక్రమణలను క్రమబద్ధీకరించనున్నట్లు గుంటూరు ఆర్‌డీవో ఎస్‌ భాస్కర్‌రెడ్డి తెలిపారు.

ఆక్రమణల క్రమబద్ధీకరణకు మరో అవకాశం
ఎస్‌ భాస్కర్‌రెడ్డి, గుంటూరు ఆర్‌డీవో

డిసెంబరు నెలాఖరు లోపు దరఖాస్తు చేసుకోవాలి

గుంటూరు ఆర్‌డీవో భాస్కర్‌రెడ్డి

గుంటూరు, ఆగస్టు 27(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ భూముల్లో నిరభ్యంతర ఆక్రమణలను క్రమబద్ధీకరించనున్నట్లు గుంటూరు ఆర్‌డీవో ఎస్‌ భాస్కర్‌రెడ్డి తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. శుక్రవారం సాయంత్రం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్‌డీవో మాట్లాడారు. 2019 అక్టోబరు 15వ తేదీకి ముందు ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకొని నివాసం ఉంటున్న వారికి ఈ అవకాశం కల్పించినట్లు తెలిపారు. 75 చదరపు గజాల్లో నివాసం ఉంటే భూమి బేసిక్‌వాల్యుపై 75 శాతం క్రమబద్ధీకరణ ఫీజు చెల్లించుకొని పట్టా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఒకవేళ ఆ కుటుంబం బీపీఎల్‌కి చెంది ఆరు అంచెల మూల్యాంకనంలో అర్హత పొంది ఉంటే ఉచితంగానే డీ-ఫారం పట్టా ఇస్తామన్నారు. 150 చదరపు గజాల లోపు ఉండే ఆక్రమణలకు కూడా 75 శాతం ఫీజు చెల్లించాలన్నారు. 15నుంచి 300 చదరపు గజాల్లో ఉంటే బేసిక్‌ విలువపై 100 శాతం చెల్లించాలని పేర్కొన్నారు. డిసెంబరు 31వ తేదీ లోపు వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అర్హత ఉన్న ఆక్రమణలను క్రమబద్ధీకరిస్తామన్నారు. భూముల రీసర్వే గుంటూరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఇప్పటికే పైలట్‌ ప్రాజెక్టుగా కొండజాగర్లమూడిలో జరిగిందని, ప్రస్తుతం అక్కడ హద్దురాళ్లు వేస్తున్నామన్నారు. త్వరలో 48 గ్రామాల్లో డ్రోన్‌ టెక్నాలజీ సర్వే ప్రారంభమౌతుందన్నారు. ప్రత్తిపాడు, వట్టిచెరుకూరు, పెదనందిపాడు, మేడికొండూరులో ఈ గ్రామాలున్నాయని చెప్పారు.  


Updated Date - 2021-08-28T05:23:46+05:30 IST