పాదయాత్రపైనా కుట్రలే

ABN , First Publish Date - 2021-12-09T05:42:31+05:30 IST

అమరావతిని నిర్వీర్యం చేసిన పాలకులు ప్రస్తుతం ప్రజా మద్దతుతో జరుగుతున్న పాదయాత్రపైనా కుట్రలు చేస్తున్నారని రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాదయాత్రపైనా కుట్రలే
నెక్కల్లు శిబిరంలో నినాదాలు చేస్తున్న రైతులు , మహిళలు

722వ రోజు ఆందోళనలో రాజధాని రైతులు

తుళ్లూరు, డిసెంబరు 8: అమరావతిని నిర్వీర్యం చేసిన పాలకులు ప్రస్తుతం ప్రజా మద్దతుతో జరుగుతున్న పాదయాత్రపైనా కుట్రలు చేస్తున్నారని రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రాష్ట్ర ఏకైక రాజధానిగా అభివృద్ధి కొనసాగాలని రైతులు చేస్తోన్న ఉద్యమం బుధవారంతో 722వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రైతు ధర్నా శిబిరాల నుంచి రైతులు, రైతు కూలీలు, మహిళలు మాట్లాడుతూ ఐదు కోట్ల మంది అమరావతిని కోరుకుంటుంటే ప్రభుత్వం తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్టు, మూడు రాజధానులు పాట పాడుతుందన్నారు. న్యాయమూర్తులు, దేవుళ్లు  అమరావతిని ఆదుకుంటారని న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో రైతులు పాదయాత్ర చేస్తుంటే  అడుగడుగునా అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు.  అమరావతిని స్వాగతిస్తున్నామని చెప్పి అధికారంలోకి వచ్చి జగన్‌రెడ్డి అమరావతి రైతులను మోసం చేశారన్నారు. అమరావతే రాష్ట్ర ఏకైక రాజధానిగా అభివృద్ధి కొనసాగుతుందని ప్రకటించే వరకు ఉద్యమం ఆగదన్నారు. రాజధాని 29 గ్రామాల్లో అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగింది.  

 

Updated Date - 2021-12-09T05:42:31+05:30 IST